Rajamahendravaram: పాపికొండల బోటు షికారు ప్రారంభం
ABN , Publish Date - Oct 12 , 2025 | 05:05 AM
ప్రసిద్ధి చెందిన పాపికొండల బోటు షికారు మూడు నెలల విరామం తరువాత శనివారం ప్రారంభమైంది. గోదావరి వరదల కారణంగా జూలైలో బోటు షికారుని ప్రభుత్వం నిలిపివేసింది.
గోదావరి వరదల తగ్గుముఖంతో ఆరంభమైన సందడి
రాజమహేంద్రవరం,అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధి చెందిన పాపికొండల బోటు షికారు మూడు నెలల విరామం తరువాత శనివారం ప్రారంభమైంది. గోదావరి వరదల కారణంగా జూలైలో బోటు షికారుని ప్రభుత్వం నిలిపివేసింది. వరదలు తగ్గడంతో తిరిగి ఆరంభమయ్యాయి. పోలవరం ప్రాజెక్టు సమీపంలో గండిపోచమ్మ గుడి వద్ద నుంచి శనివారం ఒక బోటు వెళ్లింది. 23 మంది ప్రయాణించారు. తూర్పుగోదావరి జిల్లా గండిపోచమ్మ గుడి వద్ద నుంచి సుమారుగా 15 బోట్లు అందుబాటులో ఉన్నాయి. మెల్లగా పర్యాటకుల సందడి పెరుగుతుందని ఆపరేటర్లు చెపుతున్నారు. గండిపోచమ్మ ఆలయం నుంచి ఉదయం 10 గంటలకు ఈ బోటు షికారు మొదలవుతుంది. పేరంటాలపల్లి వరకూ వెళ్లి తిరిగి సాయంత్రం 5 గంటలకు గండిపోచమ్మ గుడివద్దకు వస్తుంది. రెండు వైపులా పాపికొండల అందాలు, గోదావరి వంపు సొంపులు, ప్రవాహం, పచ్చని ప్రాంతాలు కనువిందు చేస్తుంటాయి. ఆన్‌లైన్‌లో కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. రాజమండ్రి నుంచి వాహనాల్లో గండిపోచమ్మ గుడి వరకూ బోటు నిర్వాహకులు యాత్రికులను తీసుకెళతారు. పెద్దలకు రూ.1,250, పిల్లలకు రూ.1,000గా ధర నిర్ణయించారు. ఉదయం అల్పాహరం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం తినుబండారాలు ఈ ప్యాకేజ్‌లో ఉన్నాయి. నేరుగా గండిపోచమ్మ గుడి వద్ద కూడా బోటు ఎక్కవచ్చు. ఇదిలా ఉండగా రాజమండ్రి అఖండ గోదావరిలో మూడు హౌస్‌బోట్ల షికార్‌కు ప్రభుత్వం అనుమతించింది. రాజమండ్రి పుష్కర ఘాట్‌లో ఒకటి, సరస్వతీ ఘాట్‌లో ఒకటి, కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో ఒకటి నడపనున్నారు.