Andhra Pradesh Police: కాగితాలతో ఖాకీల కుస్తీ
ABN , Publish Date - Dec 18 , 2025 | 03:50 AM
పాలనలో పారదర్శకత.. నిర్ణయాల్లో వేగం.. టెక్నాలజీ వినియోగం.. ఇవే ప్రభుత్వ పాలనకు మూల స్తంభాలు అని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నారు.
టెక్నాలజీకి దూరంగా క్షేత్రస్థాయి పోలీసులు
హెడ్ క్వార్టర్స్‌లోనే టెక్.. జిల్లాల్లో మాన్యువల్
చాలా జిల్లాల ఎస్పీలు ఈ-గవర్నెన్స్‌కు దూరం
ప్రభుత్వం జీవో విడుదల చేసి పలుమార్లు ఆదేశాలిచ్చినా పట్టని వైనం
బాధితులకు అందని సత్వర న్యాయం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
‘పాలనలో పారదర్శకత.. నిర్ణయాల్లో వేగం.. టెక్నాలజీ వినియోగం.. ఇవే ప్రభుత్వ పాలనకు మూల స్తంభాలు’ అని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నారు. కానీ ఈ మాటలు జిల్లాల ఎస్పీలకు వినిపించడం లేదు. ప్రభుత్వం డిజిటల్ పాలనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నా.. క్షేత్రస్థాయిలోని ఖాకీలు మాత్రం కాగితాలకే పరిమితమవుతామని అంటున్నారు. పాలనలో ఏకరూపత కోసం కలెక్టర్లు, ఎస్పీలు తప్పనిసరిగా ఈ-గవర్నెన్స్ అంది పుచ్చుకోవాలని ముఖ్యమంత్రి నిరంతరం చెబుతూనే ఉన్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ ఆదేశాలు పాటిస్తున్నా.. పోలీసు యూనిట్లలో మాత్రం విజయవాడ, విశాఖపట్నం కమిషనర్లు.. ఏలూరు, మరో రెండు మూడు జిల్లాల ఎస్పీలు మినహా ఇతరులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేసి పలుమార్లు ఆదేశాలిచ్చినా పలు జిల్లాల ఎస్పీలు మాత్రం.. ‘టెక్నాలజీతో మాకేంటి పని’ అన్నట్టుగా ఉంటున్నారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల సదస్సు సందర్భంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కలెక్టర్లు డిజిటల్ వ్యవస్థలోకి మారినా ఎస్పీలు మాత్రం పేపర్‌తోనే పని చేస్తామంటే జిల్లాల్లో పాలన ఎలా పరుగులు పెడుతుంది? ప్రజలకు వేగవంతమైన సేవలు ఎలా అందుతాయి? అని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. గురువారం జరిగే సమీక్షలో ఈ విషయంలో ఎస్పీలను గట్టిగా హెచ్చరించే అవకాశముంది. సుమారు ఐదున్నర కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి. కలెక్టర్లు, ఎస్పీలే జిల్లాల్లో కీలకమైన అధికారులు.
కలెక్టర్ ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధి చూస్తే.. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించే బాధ్యత ఎస్పీలదే. కూటమి ప్రభుత్వం వచ్చాక పాలనలో వేగం పెంచేందుకు ఆర్టీజీఎస్ లో అన్ని వర్గాల డేటా నింపారు. ఎవరికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయనే దగ్గరి నుంచి ఎవరికి ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నాయి.. ఎవరిపై పోలీసు కేసులున్నాయనే వరకూ ఆర్టీజీఎ్‌సలో డేటా ఉంది. ఈ-గవర్నెన్స్‌కు అలవాటు పడితే నిమిషాల్లో డేటా తీసుకుని అంతే వేగంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే మూస ధోరణి, పాత పద్ధతుల నుంచి పోలీసులు బయటపడక పోవడంతో జిల్లాల ఎస్పీలు సైతం అదేబాటలో నడుస్తున్నారు. ఫలితంగా సిబ్బంది సమస్యలతో పాటు బాధితుల వినతులకు సైతం సత్వర న్యాయం లభించడంలేదు. జిల్లాల్లోని మెజారిటీ ఎస్పీల పరిస్థితి ఇలా ఉండగా, ఆర్టీజీఎస్ తోనిరంతరం అనుసంధానంతో ఉండే ఐపీఎస్‌లకు అన్ని విషాయలు తెలుస్తున్నాయి.
చేయాలన్న తపన ఉంటే..
‘ఏడేళ్లుగా మీరు వెదుకుతున్న దొంగ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఉన్నాడు. ఫొటో పంపా చూసుకోండి. వెళ్లి పట్టుకోండి..’ అని ఒక ఐజీ ర్యాంకు అధికారి శ్రీకాకుళం పోలీసులకు రెండు నెలల క్రితం కీలక సమాచారం ఇచ్చారు. ‘జగ్గయ్యపేట దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది.. వెళ్లి తొందరగా క్లియర్ చేయండి..’ అని అక్కడి పోలీసు అధికారులకు విజయవాడ పోలీస్ కమిషనర్ ఆదేశాలిచ్చారు. ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ప్రాంగణంలోని టెక్ టవర్‌లో ఉన్న ఐజీ ర్యాంకు అధికారికి శ్రీకాకుళం పోలీసులు వెదుకుతున్న దొంగ శ్రీకాళహస్తిలో ఉన్నట్లు ఎలా తెలిసింది? తెలంగాణ సరిహద్దుల్లో ట్రాఫిక్ జామ్ అయితే విజయవాడలో ఉన్న పోలీస్ కమిషనర్‌కు ఎలా తెలిసింది? ఈ ప్రశ్నలకు ఒక్కటే సమాధానం.. టెక్నాలజీ. ఒకరు టెక్ టవర్‌లో ఉంటూ సీసీ కెమెరాలు పర్యవేక్షించడం.. మరొకరు టెక్నాలజీ వినియోగించి అధునాతన సాంకేతికతను అనుసరించడంతో గుర్తించగలిగారు. సీసీ కెమెరాలతో పాటు డ్రోన్లు వినియోగించి ‘అస్త్రమ్’ అనే యాప్ ద్వారా బెజవాడ కమిషనరేట్ నుంచి ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తుంటారు. ఇక ఏలూరులో ఎక్కడ రోడ్డుకు అడ్డంగా వాహనం ఆగినా గాల్లో ఎగురుతూ ఒక డ్రోన్ వస్తుంది. ఆ వాహనం నంబర్, కంపెనీ పేరు చెప్పి ‘ఇక్కడి నుంచి తొందరగా తీసేయండి.. లేదంటే టోయింగ్ వాహనం వచ్చి తీసుకెళ్తుంది’ అని మైకులో హెచ్చరిస్తుంది. ఐఐటీ పట్టభద్రుడైన ఏలూరు ఎస్పీ డ్రోన్‌లో కెమెరాలతో పాటు మైకులు ఏర్పాటు చేయించారు. కంట్రోల్ రూమ్‌లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ డ్రోన్ విజువల్స్ చూసి కారు నంబర్ చెప్పి హెచ్చరించేలా ఏర్పాట్లు చేశారు. ఒకప్పుడు గజిబిజిగా ఉన్న ఏలూరు ట్రాఫిక్‌లో ఇప్పుడు మార్పు కనిపిస్తోంది.
ఏఐ అంటారు.. యాప్ పనిచేయదు
‘రాష్ట్రంలో లక్షల్లో సీసీ కెమెరాలు అందుబాటులోకి తెస్తాం. ప్రతి జిల్లాకు సైబర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం. అన్నింటినీ మించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో పోలీసింగ్ తీరుతెన్నులే మార్చేస్తాం’ అని హోం శాఖ మంత్రి అనితతో పాటు ఉన్నతాధికారులు చెబుతుంటారు. అయితే వాస్తవానికి మాత్రం ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను పోలీసులు అనుసంధానం చేసుకొంటున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. షాపింగ్ మాల్స్, అపార్ట్‌మెంట్లలో ఉండే వాటిని పోలీసులు అనుసంధానం చేసుకుని వాటిని తామే ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఏఐ పోలీసింగ్ కోసమంటూ రెండు నెలల క్రితం గుంటూరులో పోలీసులు ఏఐ హ్యకథాన్ నిర్వహించారు. ఆ తర్వాత జరిగిన మార్పులేంటి? అమలు ఎంతవరకూ వచ్చింది? అనే సంగతి పక్కనపెడితే అందుబాటులో ఉన్న ఏపీ పోలీస్ సేవా యాప్ పనిచేయడం లేదు. ప్రజలకు సంబంధించి సుమారు 76 రకాల సేవలు అందుబాటులో ఉండే యాప్ ఎందుకు పనిచేయడం లేదనే ప్రశ్నకు పోలీసు ఉన్నతాధికారుల నుంచి సమాధానం లేదు. ఫిర్యాదుదారులు తమ కేసు స్టేటస్ తెలుసుకోవాలంటే ఆన్‌లైన్‌లో సాధ్యం కావట్లేదు.