లంకల్లో కలవరం!
ABN , Publish Date - Aug 20 , 2025 | 01:27 AM
ప్రకాశం బ్యారేజీ నుంచి లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో కృష్ణమ్మ కడలివైపు పరుగులుతీస్తోంది. పులిగడ్డ అక్విడెక్టు వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవాహం సాగడం, మరో ఏడు లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉండటంతో లంక గ్రామాల్లో కలవరం మొదలైంది. గంటగంటకు పెరుగుతున్న వరద ఉధృతితో నదీతీర ప్రాంతాలు, లంకలకు ముప్పు పొంచి ఉంది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. నాగాయలంక, తోట్లవల్లూరు మండలాల్లో కలెక్టర్ బాలాజీ, జేసీ గీతాంజలి శర్మ పర్యటించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు.
- ప్రకాశం బ్యారేజీ నుంచి 4.66 లక్షల క్యూసెక్కుల విడుదల
- పులిగడ్డ అక్విడెక్టును తాకుతూ కడలివైపు పరుగులు
- మరో ఏడు లక్షల క్యూసెక్కులు వచ్చే అవకాశం
- నదీ తీర గ్రామాలు, లంకలకు పొంచి ఉన్న ముప్పు
- నాగాయలంక, తోట్లవల్లూరు మండలాల్లో పర్యటించిన కలెక్టర్, జేసీ
- వరద ఉధృతి, పునరావాస కేంద్రాల ఏర్పాటుపై ఆరా
- అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం
ప్రకాశం బ్యారేజీ నుంచి లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో కృష్ణమ్మ కడలివైపు పరుగులుతీస్తోంది. పులిగడ్డ అక్విడెక్టు వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవాహం సాగడం, మరో ఏడు లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉండటంతో లంక గ్రామాల్లో కలవరం మొదలైంది. గంటగంటకు పెరుగుతున్న వరద ఉధృతితో నదీతీర ప్రాంతాలు, లంకలకు ముప్పు పొంచి ఉంది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. నాగాయలంక, తోట్లవల్లూరు మండలాల్లో కలెక్టర్ బాలాజీ, జేసీ గీతాంజలి శర్మ పర్యటించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
కృష్ణానదికి ఎగువ ప్రాంతాల్లోని ప్రాజెక్టులు, ఉపనదుల నుంచి భారీగా వరద నీరు రావడంతో మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి ప్రకాశం బ్యారేజీ నుంచి 4.66 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. దీంతో నదీతీర ప్రాంతాలు, లంక గ్రామాల్లోని ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు. వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలో కలెక్టర్ బాలాజీ నాగాయలంక మండలంలో అధికారులతో కలసి పర్యటించారు. వరద పరిస్థితులు, అధికారులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఎదురుమొండి-గొల్లమంద దీవులకు వెళ్లే రహదారి వరద ఉధృతి కారణంగా 700 మీటర్ల మేర కొట్టుకుపోవడంతో అధికారులు ఈ రహదారి బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు బుఽధవారం నాటికి ఆరు లక్షల నుంచి ఏడు లక్షల క్యూసెక్కుల వరకు వరద నీటిని వదిలే అవకాశం ఉందన్నారు. వరద పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసినట్లు తెలిపారు. వరద మరింతగా పెరిగితే లంక గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పడవలను సిద్ధం చేశామన్నారు. పునరావాస శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్‌తో పాటు వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జేసీ గీతాంజలిశర్మ తోట్లవల్లూరు మండలంలో పర్యటించి వరద పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తోట్లవల్లూరు, పెనమలూరు మండలాల్లోని లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆమె ఆదేశించారు. లంక గ్రామాల్లో గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.
పులిగడ్డ ఆక్విడెక్టును తాకిన వరద
ప్రకాశం బ్యారేజీ నుంచి 4.66 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండటంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి వరద ప్రవాహం మరింతగా పెరిగింది. పులిగడ్డ ఆక్విడెక్టును తాకుతూ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. అవనిగడ్డ మండలం యండ్లలంకకు వెళ్లే రోడ్డు గతంలో వచ్చిన వరద నీటి ప్రవాహం కారణంగా కొట్టుకుపోయింది. మళ్లీ భారీ స్థాయిలో వరద వస్తుండటంతో ఈ రోడ్డు మరింతగాకోతకు గురవుతోంది. నాగాయలంక మండలంలోని ఎదురుమొండి, నాచుగుంట, ఈలచెట్లదిబ్బ తదితర గ్రామాల వద్ద కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది.
22వ తేదీ వరకు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కోస్తాతీరం వెంబడి ఈ నెల 22వ తేదీ వరకు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ప్రభావంతో మచిలీపట్నంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఒకమోస్తరు, తేలికపాటి వర్షం కురిసింది.