Deputy CM Pawan: స్వతంత్రంగా పంచాయతీలు
ABN , Publish Date - Dec 05 , 2025 | 05:16 AM
గత ప్రభుత్వ పాలనలో నిస్తేజంగా మారిన పంచాయతీలు ఇకనుంచి స్వతంత్రంగా వ్యవహరించనున్నాయి. స్థానిక సమస్యల పరిష్కారానికి ఆయా కార్యాలయాల చుట్టూ తిరగకుండా...
డీడీవో కార్యాలయాలతో పౌర సేవలు విస్తృతం
10 వేల మందికి ప్రమోషన్లతో న్యాయం చేశాం: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
చిత్తూరు నుంచి వర్చువల్‌గా రాష్ట్రవ్యాప్తంగా 77 డీడీవో కార్యాలయాలు ప్రారంభం
వివిధ జిల్లాల్లో పాల్గొన్న స్పీకర్, మంత్రులు
చిత్తూరు/అమరావతి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ‘గత ప్రభుత్వ పాలనలో నిస్తేజంగా మారిన పంచాయతీలు ఇకనుంచి స్వతంత్రంగా వ్యవహరించనున్నాయి. స్థానిక సమస్యల పరిష్కారానికి ఆయా కార్యాలయాల చుట్టూ తిరగకుండా పంచాయతీలోనే తీర్మానం చేసుకొని పరిష్కరించుకొనేలా చేస్తున్నాం’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. చిత్తూరు వేదికగా గురువారం ఆయన రాష్ట్రవ్యాప్తంగా 77 డివిజనల్ డెవల్‌పమెంట్ ఆఫీసర్ (డీడీవో) కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ‘పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సంస్కరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా డీడీవో కార్యాలయాలను ప్రారంభించాం. డీడీవో వ్యవస్థతో పౌర సేవలు విస్తృతమవుతాయి. క్షేత్రస్థాయిలో అభివృద్ధి, సంక్షేమ పథకాల పర్యవేక్షణకు వీలుంటుంది. ప్రభుత్వ ఆదేశాలు వెంటనే క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు ఇవి ఉపయోగపడతాయి’ అని పేర్కొన్నారు.
స్వయం పాలన సంస్థలుగా పంచాయతీలు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉద్యోగుల ప్రమోషన్ల సమస్యలు తన దృష్టికి వచ్చాయని పవన్ తెలిపారు. ‘వీడీవో, ఎంపీడీవోలు అవే హోదాల్లో రిటైరవుతున్నారు. మేం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 10 వేల మందికి ప్రమోషన్లు ఇచ్చి న్యాయం చేశాం’ అని తెలిపారు. డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ను 77 డీడీవో కార్యాలయాల నుంచి వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణరెడ్డి, సవిత, మనోహర్‌తో పవన్ మాట్లాడారు. నర్సీపట్నం డీడీవో కార్యాలయం నుంచి స్పీకర్ అయ్యన్నపాత్రుడు కనిపించేసరికి, ‘మీరు వస్తారని అనుకోలేదు’ అని పవన్ అన్నారు. దీనికి అయ్యన్న మాట్లాడుతూ డీడీవో వ్యవస్థ బలోపేతం గొప్ప నిర్ణయమన్నారు. టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ డీడీవో కార్యాలయాలు మినీ కలెక్టరేట్లుగా మారనున్నాయని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమాన్ని పర్యవేక్షించడానికి కీలకం కానుందన్నారు. ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ ‘అన్ని కార్యాలయాలు ఒకే తరహాలో నిర్మించాలి’ అన్నారు. పెనుగొండ నుంచి సవిత మాట్లాడుతూ డీడీవో కార్యాలయాలు ప్రత్యేక భవనంలో ఏర్పాటు చేయాలని కోరారు. వీటిపై స్పందించిన పవన్.. ‘ప్రస్తుతం ప్రారంభించిన కార్యాలయాలన్నీ ప్రభుత్వ భవనాలేనని, రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఖర్చు చేసి వసతులు కల్పించామని చెప్పారు.
హడావిడి లేనందుకు సంతోషం
పవన్ పర్యటనలో చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం ఆయన ఆలోచనల్ని పూర్తిస్థాయిలో ఆచరణలో పెట్టింది. అధికారులు, ప్రజాప్రతినిధులు పవన్‌కు బొకేలు ఇవ్వడం, శాలువాలతో సత్కరించడం వంటివి చేయలేదు. ఏ హడావిడి లేనందున సంతోషంగాఉందని వారిని పవన్ అభినందించారు.
పాడేరు డీడీవోకు అభినందన
పాడేరు డీడీవో జయప్రకాశ్‌తో పవన్ మాట్లాడారు. ‘గతంలో అల్లూరి జిల్లాలో పనిచేసి ప్రస్తుతం చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న సుమిత్‌కుమార్ 17 వేల ఎకరాల్లో గంజాయి సాగును అరికట్టి, ఉపాధి హామీ పథకం ద్వారా ప్లాంటేషన్ చేయించారు. మీరు దాన్ని కొనసాగిస్తూ 35 వేల ఎకరాలకు తీసుకెళ్లారు. అభినందనీయం’ అని కొనియాడారు.
డీడీవో కార్యాలయాల కేంద్రంగా సరికొత్త పాలన
రాష్ట్రవ్యాప్తంగా 77 డివిజన్లలో డీడీవో కార్యాలయాల ప్రారంభం ఓ సువర్ణాధ్యాయమని ఏపీ పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) హర్షం వ్యక్తంచేసింది. కూటమి ప్రభుత్వం చొరవతో డివిజన్ స్థాయి పాలన మరింత సమన్వయంతో సాగుతుందని జేఏసీ చైర్మన్ కేఎస్ వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి వైవీడీ ప్రసాద్, డి.వెంకట్రావు, కేఎన్‌వీ ప్రసాదరావు ఆశాభావం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ శాఖ లక్ష్యాలు సాఽధించేలా ఉద్యోగులు పనిచేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రాభివృద్ధికి..కూటమి ఐక్యతే మూలం
చిన్న చిన్న మనస్పర్థలు సహజం: పవన్
కూటమి పార్టీల నేతల ఐక్యతే రాష్ట్రాభివృద్ధికి మూలమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం చిత్తూరులో డీడీవో కార్యాలయాల ప్రారంభోత్సవం అనంతరం కూటమి పార్టీల నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ’వర్షించని మేఘం... శ్రమించని మేధావి’ ఉన్నా, లేకపోయినా ఒక్కటేనని, కూటమి ప్రభుత్వానికి ఇంత బలం ఉండి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవస్థల్లో మార్పు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులున్నా నిష్ప్రయోజనమేనని చెప్పారు. మూడు పార్టీల నాయకులకు విభిన్న భావజాలాలున్నా ’రాష్ట్రం బాగుండాలి-అరాచకాలు ఉండకూడదు’ అనే సదుద్దేశంతో ఒకే గొడుగు కిందకు వచ్చి కూటమిగా ఏర్పడ్డామన్నారు. మనలో మనకు చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్, మనస్పర్థలు ఉండడం సహజమేనని, ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని సూచించారు. వైసీపీ పాలనలో దిగజారిన వ్యవస్థలను తిరిగి నిలబెడుతున్నామని చెప్పారు. నాలుగు సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబునే రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వబోమంటూ వైసీపీ పాలకులు మాట్లాడారని.. పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేయడానికి భయపెట్టారని గుర్తుచేశారు. చిత్తూరు జిల్లాకే తలమానికమైన శేషాచలం అడవులను అడ్డగోలుగా దోచేశారని, అలాంటి వాళ్లను మనం నిలువరించాలన్నారు. అవినీతిని అరికట్టి బలహీనుల గొంతుగా మారాలని పిలుపిచ్చారు. నిస్సహాయులైన వ్యక్తులకు అండగా నిలవడమే నాయకుడి లక్షణమన్నారు. ఏ వ్యక్తికైనా పదవి అనేది బాధ్యత తప్ప అలంకారంగా మారకూడదని చెప్పారు. ‘జనసేన నాయకుల ముఖ్య లక్ష్యం సమాజంలో కోల్పోయిన ధైర్యాన్ని నింపడమే. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తనూ గుర్తుపెట్టుకుని వారికి తగిన గుర్తింపు ఇస్తాం. గ్రామ స్థాయి నుంచి లోక్‌సభ నియోజకవర్గం వరకు ఐదుగురు సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేస్తాం’ అని తెలిపారు.
పవన్ మాటలను వక్రీకరిస్తున్నారు
పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్
కోనసీమ కొబ్బరి తోటల నష్టాల సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను కొందరు తెలంగాణ నేతలు వక్రీకరిస్తున్నారని మంత్రి దుర్గేశ్ అన్నారు. పవన్‌కు తెలంగాణపై ఉన్న అభిమానాన్ని ఎవరూ శంకించలేరని, తెలంగాణను కించపర్చాలనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పారు. ‘తల్లి.. బిడ్డకు దిష్టితీసేటప్పుడు.. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి తగలకూడదని అనడం సహజం. అలాగే కొబ్బరి తోటల విషయంలో మాట్లాడారే తప్పితే తెలంగాణాను కించపర్చడానికి కాదు. ఆయన క్యాజువల్‌గా అన్నమాటలను సీరియ్‌సగా తీసుకోవద్దు. ఇక్కడితో ఇది పరిసమాప్తం కావాలని కోరుకుంటున్నాం’ అని కోరారు.