Share News

Deputy CM Pawan: పల్లె పండుగ 2.0

ABN , Publish Date - Nov 08 , 2025 | 04:49 AM

పల్లె ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, గుంతలు లేని రహదారులు అందుబాటులో ఉంచాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Deputy CM Pawan: పల్లె పండుగ 2.0

  • సాస్కి నిధులతో పనులు చేపట్టాలి

  • ప్రజలందరికీ పల్లె రోడ్ల సమాచారం

  • త్వరలో అందుబాటులోకి జీఆర్‌ఆర్‌ఎంఎస్‌

  • పైలట్‌గా అడవితల్లి బాటలకు అనుసంధానం

  • మార్చి నాటికి కోటి మందికి స్వమిత్వ కార్డులు

  • జల్‌జీవన్‌, స్వమిత్వ పనులు నేనే పరిశీలిస్తా

  • అధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్‌

అమరావతి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): పల్లె ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, గుంతలు లేని రహదారులు అందుబాటులో ఉంచాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పల్లెపండుగ 2.0, అడవి తల్లిబాట పనుల పురోగతి, జల్‌జీవన్‌ మిషన్‌, స్వమిత్వ పథకాలపై ఆయన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ, గ్రామీణ నీటి సరఫరా ఇంజనీరింగ్‌ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పల్లె రోడ్ల సమాచారం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో జియో రూరల్‌ రోడ్డు మేనేజ్‌మెంట్‌ సిస్టం(జీఆర్‌ఆర్‌ఎంఎ్‌స)ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. స్పెషల్‌ అసిస్టెన్స్‌ టు స్టేట్స్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ (ఎస్‌ఏఎ్‌ససీఐ) నిధులతో పల్లె పండగ 2.0 ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆయన ఆదేశించారు. జల్‌జీవన్‌ మిషన్‌, పల్లెపండుగ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పక్కాగా పాటించాలని స్పష్టం చేశారు. నిధులు అందుబాటులో ఉన్నా... పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడంపై పవన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అడవి తల్లిబాట, జల్‌జీవన్‌ మిషన్‌ పనులు వేగవంతంగా పూర్తి చేసేలా తక్షణం ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామీణ రహదారులన్నింటినీ జీఆర్‌ఆర్‌ఎంఎ్‌సకు అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని రహదారులకు మెరుగుపరుచుకునేలా ఈ సాంకేతిక ఉండాలని చెప్పారు. దీన్ని త్వరితగతిన అభివృద్ధి చేయాలని, 48గంటల్లో అందుకు సంబంధించి ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్దం కావాలని స్పష్టం చేశారు. అడవితల్లి బాటను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంచుకొని ఈ సిస్టమ్‌కు అనుసంధానం చేయాలని పవన్‌ సూచించారు.


అడవి తల్లిబాటపై అలసత్వం వద్దు

‘గిరిజన గ్రామాల్లో చేపట్టిన అడవి తల్లిబాట పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి కనబడటం లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి సవాళ్లు ఎదుర్కొవాల్సి ఉంటుంది. పక్కా ప్రణాళికతో అన్నింటినీ అధిగమించాలి. కేంద్రం నుంచి పీఎం జన్మన్‌ పథకం కింద వచ్చే నిధులతో పాటు, ఉపాధి హామీ పథకం నిధులు, రాష్ట్ర ప్రభుత్వ సాయం మొత్తం కలిపి రూ.1చ158 కోట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 761 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 662 రహదారులు నిర్మించాలన్న సంకల్పంతో పనులు ప్రారంభించాం. అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి పనుల పురోగతిని పరిశీలించాలి. రూ.2,123కోట్ల సాస్కి నిధులతో పల్లెల్లో 4,007 కి.మీ మేర రహదారులు, గోకులాలు, మ్యాజిక్‌ డ్రైన్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్లు ఈ ప్రక్రియను పర్యవేక్షించాలి. ఈ నెల 17 తర్వాత క్షేత్రస్థాయిలో పర్యటించి జల్‌జీవన్‌ మిషన్‌ పనుల్లో పురోగతిని, ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉన్న నీటి సరఫరా వ్యవస్థల వద్ద నీటి నాణ్యతను స్వయంగా పరిశీలన చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పించే స్వమిత్వ పథకం ద్వారా వచ్చే మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి ప్రాపర్టీ కార్డులు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలి. పంచాయతీరాజ్‌ శాఖ, సర్వే శాఖతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియ త్వరితగతిన ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. ఈ పథకం కింద నిర్వహిస్తున్న సర్వేలో ప్రత్యక్షంగా పాల్గొని ప్రజల అభిప్రాయం సేకరిస్తాం. ఈ సర్వే తర్వాత ఎవరి భూములు వారికి అప్పగిస్తూ రాజముద్రతో కూడిన ప్రాపర్టీ కార్డులు అందిస్తాం’ అని పవన్‌ పేర్కొన్నారు. ఈ సమీక్షలో గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, కమిషనర్‌ కృష్ణతేజ, సర్వే కార్యదర్శి కూర్మనాథ్‌,పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఇంజనీర్‌ ఇన్‌చీఫ్ బాలూనాయక్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎన్‌సీ గాయత్రి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


నేడు తిరుపతికి పవన్‌

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శనివారం తిరుపతి రానున్నారు. ఉదయం 8 గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. రేణిగుంట మండలంలోని మామండూరు ఎకో టూరిజం పార్కు సందర్శిస్తారు. సుమారు రెండు గంటల పాటు అక్కడే గడుపుతారు. దట్టమైన అటవీ ప్రాంతంలో జలపాతంతో కూడిన మామండూరు ఎకో టూరిజం పార్కు అభివృద్ధిపై సంబంధిత శాఖ అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తారు. అక్కడ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆపై తిరుపతి చేరుకుని మంగళంలోని ఎర్రచందనం గోదామును పరిశీలిస్తారు. అనంతరం తిరుపతి కలెక్టరేట్‌ చేరుకుని అధికారులతో సమావేశమవుతారు. మొక్కల పెంపకం మొదలుకుని ఎకో టూరిజం అభివృద్ధి, ఏనుగుల సమస్య, ఎర్రచందనం అక్రమ రవాణా, అభయారణ్యాల పరిధిలోనూ అలాగే సముద్ర, పులికాట్‌ తీర ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుగా ఉన్న అటవీ శాఖ ఆంక్షలు వంటి అంశాలపై సమావేశంలో సమీక్షిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు.


పోర్టల్‌లో రోడ్ల వివరాలు

రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ రహదారుల సమాచారం త్వరలోనే పౌరులకు అందుబాటులోకి రానుంది. ఈ రోడ్ల స్థితిగతులను తెలుసుకునేందుకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ సరికొత్త పోర్టల్‌ను ప్రారంభించనుంది. రోడ్ల పూర్తి డేటాను జియో రూరల్‌ రోడ్స్‌ యాప్‌ ద్వారా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సేకరించారు. దానిని జియో రూరల్‌ రోడ్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం(జీఆర్‌ఆర్‌ఎంఎస్‌) పోర్టల్‌కు అనుసంధానించారు. పం చాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలో గ్రామాల మధ్య కనెక్టివిటీ ఉన్న రోడ్లు రాష్ట్రంలో 31,332 ఉన్నాయని గుర్తించారు. 67వేల కి.మీ. పొడవైన ఈ రోడ్ల వివరాలన్నీ ఇక వెబ్‌లో అందుబాటులోకి రానున్నాయి. ప్రతి మూడు నెలలకోసారి ఆ రోడ్ల స్థితిగతులను స్థానిక ఇంజనీర్లు అప్‌డేట్‌ చేస్తారు. వాటి ఫొటోలను వెబ్‌లో ఉంచుతారు. దీంతో రాష్ట్రంలోని ప్రతి పౌరుడు వెబ్‌సైట్‌ ద్వారా ఏయే రోడ్లు ఎలా ఉన్నాయో పరిశీలించే చూసుకునే అవకాశం కలుగుతుంది. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన(పీఎంజీఎ్‌సవై) ద్వారా గతంలో కొన్ని రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. పీఎంజీఎ్‌సవై రోడ్లన్నింటికీ కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ ఆయా రోడ్లకు డిస్ట్రిక్ట్‌ రూరల్‌ రోడ్స్‌ పంచాయతీరాజ్‌ (డీఆర్‌ఆర్‌పీ) కోడ్‌ నంబర్లు కేటాయించింది. వాటిని మినహాయిస్తూ మిగిలిన రోడ్లకు ఇప్పుడు కొత్త కోడ్‌ నంబర్లు కేటాయించారు. ఈ రహదారులను బ్యాడ్‌, ఫెయిర్‌, వెరీ ఫెయిర్‌, గుడ్‌, ఎక్స్‌లెంట్‌ అనే కేటగిరీలుగా విభజిస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో రోడ్లు నిర్మించిన ప్రాంత ంలో నేల స్వభావం, తారు, సిమెంట్‌, డబ్ల్యూబీఎం, గ్రావెల్‌, ఎర్త్‌ రోడ్ల వివరాలు కూడా వెబ్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. ఇకపై ఒక్క క్లిక్‌తోనే ఈ సమాచారం మొత్తం అందుబాటులోకి రానుంది.


పోర్టల్‌ ఆధారంగానే పనులు

సాస్కి పేరుతో 50 ఏళ్ల పాటు తిరిగి చెల్లించే విధానంలో రాష్ట్రాలకు కేంద్రం వడ్డీ రహిత రుణాలను అందిస్తోంది. ఆర్‌అండ్‌బీ, టూరిజం, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల్లో మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులను వినియోగించుకోవచ్చు. డిప్యూటీ సీఎం పవన్‌ చొరవతో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలో రోడ్ల నిర్మాణాలకు కేంద్రం నుంచి రూ.2వేల కోట్లు సమీకరించనున్నారు. పోర్టల్‌లో సమాచారం ఆధారంగా తొలుత బాగా దెబ్బతిన్న రహదారులకు ప్రాధా న్యం ఇచ్చి పనులు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఈ పోర్టల్‌ను త్వరలో ప్రారంభించనున్నారు.

Updated Date - Nov 08 , 2025 | 04:50 AM