పైసల్ ‘మత్తు’!
ABN , Publish Date - May 15 , 2025 | 12:39 AM
జిల్లాలో ఎక్సైజ్ అధికారుల తీరు అనేక విమర్శలకు దారితీస్తోంది. మద్యం దుకాణాల వద్ద అనధికారికంగా సిట్టింగ్ రూమ్‌లు ఏర్పాటు చేసి మరీ నిర్వాహకులు మందుబాబులతో తాగిస్తున్నారు. ఉదయం పది గంటలకు తీయాల్సిన షాపులను ఏడు గంటలకే తెరిచేస్తున్నారు. తెలంగాణ నుంచి మద్యం తెచ్చి జోరుగా విక్రయాలు సాగిస్తున్నారు. ఫిర్యాదులపై తనిఖీలకు వెళ్లిన ఎక్సైజ్ అధికారులు పైసల్ ‘మత్తు’లో అక్కడ తమకు ఏమీ కనిపించలేదన్నట్టు వెనక్కి తిరిగి వస్తున్నారు. ఎక్సైజ్ కార్యాలయాల్లో ఫైలు కదలాలంటే మాత్రం ప్రతి పనికి ఒకరేటు నిర్ణయించి మరీ ముక్కుపిండి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
- ఎక్సైజ్‌శాఖ మాయాజాలం
- మద్యం దుకాణాల వద్ద అనధికార సిట్టింగ్ రూమ్‌లు!
- ఉదయం 7 గంటల నుంచే విక్రయాలు
- తెలంగాణ మద్యం తెచ్చి జోరుగా అమ్మకాలు
- పట్టుకుని వదిలేసిన అధికారులు
- మధ్యవర్తిత్వం వహించిన ఇద్దరికి పెద్ద మొత్తంలో నగదు!
- కార్యాలయంలో ఫైలు కదలాలంటే నగదు చెల్లించాల్సిందే..
జిల్లాలో ఎక్సైజ్ అధికారుల తీరు అనేక విమర్శలకు దారితీస్తోంది. మద్యం దుకాణాల వద్ద అనధికారికంగా సిట్టింగ్ రూమ్‌లు ఏర్పాటు చేసి మరీ నిర్వాహకులు మందుబాబులతో తాగిస్తున్నారు. ఉదయం పది గంటలకు తీయాల్సిన షాపులను ఏడు గంటలకే తెరిచేస్తున్నారు. తెలంగాణ నుంచి మద్యం తెచ్చి జోరుగా విక్రయాలు సాగిస్తున్నారు. ఫిర్యాదులపై తనిఖీలకు వెళ్లిన ఎక్సైజ్ అధికారులు పైసల్ ‘మత్తు’లో అక్కడ తమకు ఏమీ కనిపించలేదన్నట్టు వెనక్కి తిరిగి వస్తున్నారు. ఎక్సైజ్ కార్యాలయాల్లో ఫైలు కదలాలంటే మాత్రం ప్రతి పనికి ఒకరేటు నిర్ణయించి మరీ ముక్కుపిండి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
మచిలీపట్నం శివారులో ఉన్న సుల్తానగరం మద్యం దుకాణంలో తెలంగాణ నుంచి తెచ్చిన మద్యం విక్రయిస్తున్నారు. దీనిపై ఎకై్ౖసజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు ఫిర్యాదు అందింది. గత నెల 29వ తేదీన అధికారులు తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ మద్యం విక్రయి స్తున్నట్టుగా గుర్తించారు. మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంతలోనే ఎస్‌ఎన్ గొల్లపాలేనికి చెందిన వ్యక్తి, ఒక ప్రజాప్రతినిధి వద్ద ఉండే మరో వ్యక్తి ఈ విషయంలో తలదూర్చారు. పెద్ద మొత్తంలో నగదు తీసుకుని ఈ అంశం పక్కదారి పట్టించేందుకు ఎక్సైజ్ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారని స్థానికులు చెప్పుకుంటున్నారు. దీంతో మద్యం దుకాణంలో లభించిన తెలంగాణ మద్యం, స్థానికంగా ఉన్న బెల్ట్‌షాప్‌లో దొరికినట్టుగా కథను మలిచేశారు. అధికారులు తీరుపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్‌శాఖ జిల్లా అధికారులు ఈ విషయం మాకు తెలియదని చెబుతుండగా, మచిలీపట్నం ఎక్సైజ్ సీఐ మాత్రం బెల్ట్ షాపులోనే తెలంగాణకు చెందిన మద్యం స్వాధీనం చేసుకున్నామని, దీనిపై కేసు నమోదు చేశామని చెబుతుండటం గమనార్హం.
సిట్టింగ్ రూమ్‌లు ఏర్పాటు చేసి మరీ విక్రయాలు
జిల్లాలోని 115 మద్యం దుకాణాల్లో కేవలం మద్యం విక్రయాలు మాత్రమే జరపాలి. మద్యం దుకాణం వద్ద మందుబాబులు మద్యం తాగడానికి వీల్లేదు. అయితే మద్యం దుకాణాల వద్ద సిట్టింగ్ రూమ్‌లను ఏర్పాటు చేసి మరీ మందుబాబులతో అక్కడే మద్యం షాపుల వారు తాగిస్తున్నారు. మద్యం దుకాణం వద్ద సిట్టింగ్ రూమ్ ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలి. గతంలో సిట్టింగ్ రూమ్‌ల ఏర్పాటుకు ఒక్కో మద్యం దుకాణం నుంచి కనీసంగా రూ.2లక్షలను కట్టించుకునే వారు. ప్రభుత్వం సిట్టింగ్ రూమ్‌లకు ఇంతవరకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఎక్సైజ్ శాఖ అధికారులే చెబుతున్నారు. అయినా అనధికారికంగా సిట్టింగ్ రూమ్‌లను ఏర్పాటు చేసి మరీ మద్యం విక్రయాలు జరపడం గమనార్హం. ఎకై్ౖసజ్, పోలీస్‌శాఖల అధికారులు సిట్టింగ్ రూమ్‌లను ఏర్పాటు చేసినందుకుగాను మామూళ్లు దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
బార్ అండ్ రెస్టారెంట్‌లకు మద్యం తరలింపు
క్వార్టర్ మద్యం సీసాలను దుకాణంలోని వారు బార్ అండ్ రెస్టారెంట్‌కు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. రూ.85 క్వార్టర్ బాటిల్‌ను మద్యం దుకాణంలో రూ.99లకే విక్రయించాలి. అదే బార్ అండ్ రెస్టారెంట్‌లో దీన్ని రూ.140 నుంచి రూ.150 వరకు అమ్ముతున్నారు. మద్యం దుకాణం, బార్ అండ్ రెస్టారెంట్లకు సరఫరా చేసే మద్యం ధరల్లో తేడాలు ఉండటంతో బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు వీరితో కుమ్మక్కై గుడివాడ, మచిలీపట్నం ఉయ్యూరు తదితర ప్రాంతాల్లో ఈ దందా నిర్వహిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. మచిలీపట్నంలోని పోతేపల్లిలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణం భవనంపై సిట్టింగ్ రూమ్ మాదిరిగా ఏర్పాటు చేసి అక్కడ మద్యం తాగించడం, మందుబాబుల అల్లరి అధికం కావడంతో స్థానికులు ఇటీవల ధర్నాకు దిగారు. చిన్నాపురం. సుల్తానగరంతోపాటు వివిధ ప్రాంతాల్లో మందు తాగేందుకు సిట్టింగ్ రూమ్‌లను ఏర్పాటు చేసి మరీ మద్యం విక్రయాలు జరుపుతున్నారు. గుడివాడ సమీపంలోని మండలంలో గౌడ సామాజికవర్గం కోటాలో ఇటీవల ఏర్పాటు చేసిన మద్యం దుకాణం నుంచి నెలకు ఇంత ఇవ్వాలని సివిల్ పోలీసులు సైతం వెంట పడుతుండటంతో కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వారు బెంబేలెత్తిపోతున్నారు.
ఉదయం 7 గంటల నుంచే విక్రయాలు
మద్యం దుకాణాల్లో ఉదయం 10 గంటలకు విక్రయాలు ప్రారంభించి రాత్రి 10 గంటలకు మూసివేయాలి. కానీ మద్యం దుకాణాలను ఉదయం ఏడు గంటలకే తెరుస్తున్నారు. దొడ్డిదారిన మద్యం విక్రయాలు జరిపేస్తున్నారు. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే లెక్కలు చూసుకునేందుకు షాపులు తెరిచామని చెప్పి తప్పించుకుంటున్నారు. గుడివాడలోని డిపో నుంచి మద్యం కేసులు తీసుకోవాలంటే ఒక్కో కేసుకు ఇంత అని అనధికారికంగా నగదు వసూలు చేస్తున్నట్టు సమాచారం. తాము సూచించిన వాహనాల్లోనే మద్యం దుకాణాలకు తరలించాలనే ఆంక్షలు కూడా పెడుతున్నట్టు తెలిసింది.