Share News

Nadendla Manohar: ధాన్యం కొనుగోళ్లు 27 నుంచి

ABN , Publish Date - Oct 18 , 2025 | 04:05 AM

రాష్ట్రంలో ఈనెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

Nadendla Manohar: ధాన్యం కొనుగోళ్లు 27 నుంచి

ఖరీ్‌ఫలో 51 లక్షల టన్నుల సేకరణ లక్ష్యం

48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బు

రైస్‌ మిల్లర్లతో భేటీలో మంత్రి నాదెండ్ల మనోహర్‌

అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈనెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మొత్తం 10,700 మంది సిబ్బందితో ధాన్యం సేకరణకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై చర్చించేందుకు శుక్రవారం ఆయన రాష్ట్ర రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో విజయవాడలో సమావేశమయ్యారు. మంత్రి మనోహర్‌ మాట్లాడుతూ.. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో 51 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న ప్రభుత్వ లక్ష్య సాధన కోసం మిల్లర్లు పనిచేయాలని కోరారు. బ్యాంక్‌ గ్యారంటీలు 1:2 ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం 35బ్యాంకుల సేవలను ఉపయోగించుకోవచ్చని వివరించారు. ధాన్యం విక్రయించిన 24 గంటల నుంచి 48 గంటల్లోగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని వెల్లడించారు. కాగా, ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ.. గత ప్రభుత్వం పెట్టిన రూ.1,674 కోట్ల బకాయిలు, మిల్లర్లకు చెల్లించాల్సిన రూ.763 కోట్లను కూటమి ప్రభుత్వం చెల్లించిందని మంత్రి మనోహర్‌ గుర్తుచేశారు. రైతుల కోసం కలిసి పనిచేద్దామని మిల్లర్లకు పిలుపునిచ్చారు. పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంలో రైస్‌ మిల్లర్లు ప్రభుత్వానికి తోడుగా నిలవాలని కోరారు. ఈ సమావేశానికి రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, కార్యదర్శి వల్లూరి సూర్యప్రకాశరావు, కోశాధికారి రంగయ్యనాయుడు, 26 జిల్లాల రైస్‌మిల్లర్స్‌ ప్రతినిధులు హాజరయ్యారు.

Updated Date - Oct 18 , 2025 | 04:06 AM