Share News

పికప్‌కు ప్యాకప్‌!

ABN , Publish Date - Nov 17 , 2025 | 01:14 AM

ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన డోర్‌ పికప్‌ - డోర్‌ డెలివరీ పార్శిల్‌ స్కీమ్‌కు కాంట్రాక్టు సంస్థ మంగళం పాడింది. ఆన్‌లైన్‌ ఆప్లికేషన్‌ ద్వారా బుక్‌ చేసుకునేవారు డోర్‌ పికప్‌, డెలివరీ ఆప్షన్‌ ఎంచుకున్నా సదరు సంస్థ ప్రతినిధులు వెళ్లడం లేదు. దీంతో వినియోగదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. విధిలేక బస్‌స్టేషన్‌కు వచ్చి పార్శిల్‌ ఇచ్చి, తీసుకెళ్తున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.

పికప్‌కు ప్యాకప్‌!

-ఆర్టీసీ పార్శిల్‌ డోర్‌ డెలివరీకి గ్రహణం

- నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టు సంస్థ

- పార్శిల్‌ పికప్‌ చేసుకోవడానికి వెళ్లని ప్రతినిధులు

- విధిలేక బస్‌స్టేషన్‌కు వచ్చి ఇస్తున్న వినియోగదారులు

- డోర్‌ డెలివరీ చేయకుండా తాత్సారం

- పాయింట్‌కు వచ్చి పార్శిల్‌ తీసుకెళ్లాల్సిన దుస్థితి

- అధికారులకు ఫిర్యాదు చేస్తున్న వినియోగదారులు

ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన డోర్‌ పికప్‌ - డోర్‌ డెలివరీ పార్శిల్‌ స్కీమ్‌కు కాంట్రాక్టు సంస్థ మంగళం పాడింది. ఆన్‌లైన్‌ ఆప్లికేషన్‌ ద్వారా బుక్‌ చేసుకునేవారు డోర్‌ పికప్‌, డెలివరీ ఆప్షన్‌ ఎంచుకున్నా సదరు సంస్థ ప్రతినిధులు వెళ్లడం లేదు. దీంతో వినియోగదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. విధిలేక బస్‌స్టేషన్‌కు వచ్చి పార్శిల్‌ ఇచ్చి, తీసుకెళ్తున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో లాజిస్టిక్స్‌ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు, వినియోగదారులకు మరింత చేరువ కావటానికి డోర్‌ పికప్‌- డోర్‌ డెలివరీ స్కీమ్‌ను అధికారులు ప్రవేశపెట్టారు. లాజిస్టిక్‌ పార్శిల్స్‌, కార్గో రవాణాకు సంబంధించిన నిర్వహణ కాంట్రాక్టును దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థకే డోర్‌ పికప్‌ - డోర్‌ డెలివరీని కూడా అప్పగించారు. దీనికి వినియోగదారుల నుంచి అదనంగా చార్జీ వసూలు చేస్తారు. వినియోగదారుల నుంచి ముక్కుపిండి చార్జీలు వసూలు చేస్తున్న కాంట్రాక్టు సంస్థ డోర్‌ పికప్‌ చేయటం లేదని, డోర్‌ డెలివరీ అస్సలు చేయటం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీలో లాజిస్టిక్స్‌ను ప్రవేశ పెట్టిన అనతికాలంలోనే బహుళ ప్రజాదరణ పొందింది. ఆర్టీసీకి భారీ సంఖ్యలో బస్సులు ఉండటం.. దూర ప్రాంతాలకు సైతం అదే రోజున గంటల వ్యవధిలోనే పార్శిల్స్‌ రవాణా అవుతుండటంతో వ్యాపారం అమాంతం పెరిగింది. దీంతో కార్గో విభాగాన్ని మరింత బలోపేతం చేసుకోవటం కోసం ఆర్టీసీ అధికారులు విజయవాడ కేంద్రంగా డోర్‌ పికప్‌ - డోర్‌ డెలివరీ విధానానికి శ్రీకారం చుట్టారు.

కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం

ప్రస్తుతం లాజిస్టిక్స్‌ నిర్వహిస్తున్న సంస్థకే ఈ బాధ్యతలను అప్పగించారు. వాస్తవానికి ఈ కాంట్రాక్టు సంస్థ సాధారణ లాజిస్టిక్స్‌ విభాగాన్నే సరిగా నిర్వహించటం లేదు. మ్యాన్‌ పవర్‌ను తగినంతగా ఉపయోగించకపోవటం వల్ల.. బస్‌స్టేషన్‌ కార్గో బుకింగ్‌ పాయింట్‌కు వచ్చే వారు గంట, రెండు గంటలు వేచి చూడాల్సి వస్తోంది. సాధారణ నిర్వహణ బాధ్యతలనే సక్రమంగా నిర్వహించని సంస్థకు ‘డోర్‌ పికప్‌ - డోర్‌ డెలివరీ’ బాధ్యతలు అప్పగించటంతో సమస్య తలెత్తింది. డోర్‌ పికప్‌ను ప్రారంభంలో కొద్ది రోజులు ప్రవేశపెట్టిన కాంట్రాక్టు సంస్థ ఆ తర్వాత చేతులెత్తేసింది. సిబ్బందిని కుదించటంతో సాధారణ విధులు నిర్వహించటానికే కష్టమైపోతోంది. దీంతో డోర్‌ పికప్‌ను వదిలేశారు.

డోర్‌ పికప్‌కు రాకపోవడంతో అవస్థలు

ఆర్టీసీ లాజిస్టిక్స్‌ ఆన్‌లైన్‌ ఆప్లికేషన్‌ ద్వారా బుక్‌ చేసుకునేవారు డోర్‌ పికప్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే.. ఇంటికి వచ్చి పికప్‌ చేసుకోవటానికి ఎవరూ రావటం లేదు. దీంతో విసిగి వేసారిన వినియోగదారులు బస్‌స్టేషన్‌కు వచ్చి ఇవ్వాల్సి వస్తోంది. ఎందుకు పికప్‌కు రావటం లేదంటే సమాధానం చెప్పే పరిస్థితి కూడా ఉండటం లేదు. కొంతమంది బాధ్యులైన ఆర్టీసీ అధికారుల సమాచారం తెలుసుకుని ఫిర్యాదులు చేస్తున్నారు. అధికారులు స్పందించి కాంట్రాక్టు సంస్థను మందలిస్తే డోర్‌ పికప్‌ చేపడుతున్నారు. పికప్‌తో పాటు డోర్‌ డెలివరీ ఆప్షన్‌ ఎంచుకున్నా .. డోర్‌ డెలివరీ కూడా చేయడం లేదు. కొంతమంది బస్‌స్టేషన్‌కు వచ్చి డోర్‌ డెలివరీ ఆప్షన్‌ ఇచ్చినా.. ఆ ప్రాంత రిసీవింగ్‌ పాయింట్‌కు పార్శిల్‌ చేరుకుంటుందే త ప్ప డోర్‌ డెలివరీ మాత్రం చేయటం లేదు.

అదే సంస్థకు ఎందుకు ఈ బాధ్యతలు?

డోర్‌ పికప్‌ - డోర్‌ డెలివరీ విధానాన్ని ప్రస్తుత లాజిస్టిక్స్‌ సంస్థకు అప్పగించటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. లాజిస్టిక్స్‌ విభాగాన్నే సరిగా నిర్వహించలేకపోతున్న సంస్థకు.. పికప్‌ - డెలివరీ బాధ్యతలు అప్పగించటం పట్ల ఆరోపణలు కూడా వస్తున్నాయి. పికప్‌, డెలివరీలను స్ప్లిట్‌ చేసి మరో కాంట్రాక్టు సంస్థకు అప్పగించి ఉంటే ఈ సమస్యలు వచ్చేవి కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వంటి ఈ కామర్స్‌ సంస్థల పికప్‌, డెలివరీలను ఈ కార్ట్‌ లాజిస్టిక్స్‌ వంటి మరో సంస్థలతో చేయిస్తుంటాయి. దీంతో ఈ కామర్స్‌ సంస్థలు ఉత్పత్తిదారుల నుంచి పికప్‌ చేసుకోవటంతో పాటు.. ఎక్కడికి డెలివరీ చేయాలో అక్కడికి సురక్షితంగా పార్శిల్స్‌ను చేరవేస్తుంటాయి. ఒకవేళ వినియోగదారులకు ఆ ఉత్పత్తులు నచ్చకపోతే రిటర్న్‌ పెడితే మళ్లీ వారి ఇళ్లకు వెళ్లి వాటిని పికప్‌ చేసుకుంటారు. విసుగు, విరామం అనేది లేకుండా సర్వీసు అందిస్తారు. ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగంలో డోర్‌ పికప్‌ - డోర్‌ డెలివరీ విభాగంలో ఇది మచ్చుకు కూడా కనిపించటం లేదు. పికప్‌ - డెలివరీ విధానాన్ని కూడా ఇదేవిధంగా మెరుగు పరచుకోవాల్సిన అవసరం ఉంది.

Updated Date - Nov 17 , 2025 | 01:14 AM