CM Chandrababu: మనసుంటే సాధ్యమే
ABN , Publish Date - Aug 20 , 2025 | 04:57 AM
మరణం తర్వాత కూడా పదిమంది మనల్ని గుర్తుపెట్టుకోవాలి. అలా జీవించగలిగితే... అంతకు మించిన సార్థకత మరొకటి ఉండదు. ఏ మాత్రం మనసున్నా పీ-4 ఆచరణ సాధ్యమే అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
పేదరికంపై పీ4 అస్త్రం
ఆర్థిక అసమానతలు తొలగిపోతాయి
ఇది మానవతాదృక్పథంతో చేసే కార్యక్రమం
శక్తి ఉన్న ప్రతి వ్యక్తీ మరొకరికి తోడ్పడాలి
నేటి బంగారు కుటుంబాలు రేపు మార్గదర్శులుగా మారాలి
15 లక్షల బంగారు కుటుంబాలు టార్గెట్
నేనూ 250 కుటుంబాలను తీసుకున్నా
ఆదాయం, మంచి మనసు ఉంటేనే ప్రజలకు సంక్షేమం ఇవ్వగలం
ఆడబిడ్డలు బయటకు వస్తే ఆర్థిక విప్లవమే
అందుకే ఉచిత బస్సు పథకం: సీఎం
మార్గదర్శిగా పారిశుధ్య కార్మికులు
పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పల్లికొండ హేమలత మార్గదర్శిగా మారారు. తన ఊరికి చెందిన అనాథ వృద్ధురాలు చర్ల కనికరంను దత్తత తీసుకుని ఆమెను కన్నతల్లిలా చూసుకుంటున్నారు. హేమలతను ముఖ్యమంత్రి మంగళవారం సన్మానించి అభినందించారు.

సమాజం వల్ల పైకి వచ్చినవారు సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వాలి. సంపద ప్రజలకు మెరుగైన జీవనం కలిగేలా ఉపయోగపడాలి.సంపద సృష్టించాలి.. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం, మంచి మనసు ఉంటేనే సంక్షేమం అమలు చేయగలం. ఈ రెండింటిలో ఏది లేకపోయినా ప్రజలకు సంక్షేమాన్ని ఇవ్వలేం.
- సీఎం చంద్రబాబు
అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ‘మరణం తర్వాత కూడా పదిమంది మనల్ని గుర్తుపెట్టుకోవాలి. అలా జీవించగలిగితే... అంతకు మించిన సార్థకత మరొకటి ఉండదు. ఏ మాత్రం మనసున్నా పీ-4 ఆచరణ సాధ్యమే’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీ-4 అమలును మంగళవారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బంగారు కుటుంబాల సభ్యులు, మార్గదర్శులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. సీఎం ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పీ4 ద్వారా శక్తి ఉన్న ప్రతి వ్యక్తీ మరొకరికి అండగా నిలవాలని, ‘గివ్ బ్యాక్’ అనేది మన నినాదం కావాలని పిలుపిచ్చారు. సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించేందుకు పీ-4 దోహదపడుతుందన్నారు. ఉగాది రోజు సంకల్పం చేసి ఇప్పుడు అధికారికంగా ప్రారంభిస్తున్నామని.. ఇది చరిత్రాత్మకమైన రోజుగా నిలిచిపోతుందని తెలిపారు.
బంగారు కుటుంబాలను చిన్నచూపు చూడాల్సిన అవసరం లేదని, ఒకప్పుడు బంగారు కుటుంబాలుగా ఉన్న వారే నేడు మార్గదర్శులుగా ఉన్నారని.. నేటి బంగారు కుటుంబాలు రేపటి మార్గదర్శులుగా మారాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. తాను కూడా పేద కుటుంబం నుంచే వచ్చానన్నారు. ఆలయాలు, ప్రార్థనామందిరాలకూ చేయూతనివ్వడం సేవేనని చెప్పారు.చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..
21 లక్షల కుటుంబాలు గుర్తింపు..
రాష్ట్రంలో 1.69 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. వీటిలో 21 లక్షల కుటుంబాలకు వివిధ అవసరాలు ఉన్నాయి. వాటిని బంగారు కుటుంబాలుగా గుర్తించాం. ఇప్పటి వరకు 13.40 లక్షల బంగారు కుటుంబాలను 1.41 లక్షల మంది మార్గదర్శులు దత్తత తీసుకున్నారు. 15 లక్షలు టార్గెట్‌గా పెట్టుకున్నాం. నేను స్వయంగా 250 కుటుంబాలను దత్తత తీసుకున్నాను. ఎంత బిజీగా ఉన్నా స్వయంగా పర్యవేక్షిస్తున్నాను. దానధర్మాలు చేయడం మనకు కొత్తకాదు. మన పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రదాయం అది. తూర్పుగోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ తన ఇంటికి వచ్చిన వారందరికీ లేదనకుండా అన్నం పెట్టేది.. అందుకే ఇప్పటికీ ఆమెను అన్నపూర్ణగా గుర్తుపెట్టుకున్నాం. అన్న ఎన్టీఆర్ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని నమ్మారు. అదే స్ఫూర్తితో టీడీపీ ముందుకెళ్తోంది. అందుకే నిత్యం పేదల అభ్యున్నతి కోసం ఆలోచన చేస్తున్నాం. ప్రభుత్వపరంగా చేయాల్సింది చేస్తున్నాం. ఇకపై ప్రభుత్వ పాలసీలు పేదలకు అనుకూలంగానే ఉంటాయి. భూమ్మీద ఎవరం శాశ్వతం కాదు. అంద రం ఏదో ఒక రోజు చనిపోతాం.. చనిపోయిన తర్వాత అన్నీ వదిలివెళ్లాలి. కొంత మంది జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కొందరు దుర్వినియోగం చేసుకుంటారు. చనిపోయాక కూడా 10 మంది గుర్తుపెట్టుకునే పనులు చేయాలి. అదే శాశ్వతం. మీరు (మార్గదర్శులు) కూడా దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
సంపద పెరుగుతున్నా పేదరికం అలానే ఉంది
ఒకప్పుడు దేశంలో సంపద సృష్టించడం చాలా కష్ఠంగా ఉండేది. ఆర్థిక సంస్కరణల వల్ల సులభమైంది. త్వరలోనే అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో ఆర్థిక వ్యవస్థగా నిలువనుంది. అయితే సంపద పెరుగుతున్నా పేదరికం అలాగే ఉంది. అందుకే పీ-4 తీసుకొచ్చాం. ఈ కార్యక్రమం చాలా మంది జీవితాల్లో గొప్ప మార్పునకు కారణమవుతుంది. ఇంటర్ పాస్ అయిన ఓ అమ్మాయికి 2 నెలల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారు. తద్వారా ఆమె జీవితంలో గణనీయమైన మార్పు వచ్చింది. ఇది పీ-4తో సాధ్యపడింది.
చరిత్రలో ఎవరూ ఇవ్వని సంక్షేమం
మా ప్రభుత్వం పేదలను దృష్టిలో ఉంచుకునే పాలన చేస్తోంది. 64 లక్షల మందికి ఏటా రూ.33 వేల కోట్లను పింఛన్ల రూపంలో ఇస్తున్నాం. దేశంలో మరే రాష్ట్రమూ ఈ రకంగా చేయడం లేదు. ఆగస్టు నెలలోనే పేదలకోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రారంభించాం. కొత్త పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం.. ఇలా ఎన్నిటికో శ్రీకారం చుట్టాం. చరిత్రలో ఎవ్వరూ ఇవ్వని విధంగా సంక్షేమం అమలు చేస్తున్నాం. ఉచిత బస్సు ఓట్ల కోసం తీసుకురాలేదు. ఆడబిడ్డలు బయటకు వస్తే రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధికి వారే ప్రధాన సూత్రధారులు అవుతారు. ఆర్థిక విప్లవానికి నాంది పలుకుతారు. భార్యాభర్తలు ఐటీ రంగంలో ఉంటే.. 80 శాతం మంది భార్యలకే ఎక్కువ జీతం వస్తోంది. నా తల్లి పొగచూరిన పొయ్యిపై వండడంతో అనారోగ్యం పాలైంది. ఆ రకంగా రాష్ట్రంలో మహిళలెవరూ కాకూడదనే అప్పట్లో దీపం పథకం ప్రారంభించి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. దేశంలోనే మొదటిసారి ఈ పథకాన్ని మేమే అమలు చేశాం. ఇప్పుడు ధరలు పెరిగాయని మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. జనాభా పెరుగుదలను ప్రమోట్ చేస్తున్నాను. ఆదాయం సరిపోక చాలా మంది పిల్లలను కనడం మానేస్తున్నారు. నేనిచ్చే పథకాలు వినియోగించుకోగలిగితే మీ ఆదాయం పెరుగుతుంది.
2047 పెద్ద దూరంలో లేదు..
నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో జన్మభూమి, ప్రజల వద్దకు పాలన వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాను. పేదరికం రూపుమాపేందుకు 25 ఏళ్ల క్రితమే ‘వెలుగు’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాను. విజన్-2020 డాక్యుమెంట్ తెస్తే అందరూ విమర్శించారు. అప్పుడు చెప్పిన దాని కంటే ఎక్కువ అభివృద్ధిని హైదరాబాద్‌లో చూస్తున్నాం. ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్ తయారుచేశాం. 2047 పెద్ద దూరంలో లేదు. ఈ ప్రణాళికలు విజయవంతం కావాలంటే దేశంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం రావాలి. మరోసారి వైకుంఠపాళి ఆడకుండా ప్రజలు నమ్మకం ఉంచి కొనసాగి స్తే 2047 నాటికి రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా చేస్తాం. వాట్సాప్‌లో 704 సేవలు అందుబాటులో తెచ్చాం.టెక్నాలజీని ఉపయోగించుకుంటే చాలా ప్రయోజనం ఉంటుంది. ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త విధానం తీసుకున్నాం.