CM Chandrababu: పీ-4లో తొలి అడుగు
ABN , Publish Date - Jul 08 , 2025 | 05:05 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన ప్రయోగం పీ4 పథకం కింద తూర్పు గోదావరి జిల్లాలో మార్గదర్శి బంగారు కుటుంబం తొలి అడుగు వేసింది. కొవ్వూరు నియోజకవర్గంలోని మలకపల్లి గ్రామానికి ఈ నెల 1న వచ్చిన సీఎం చంద్రబాబు..
పోసిబాబు కుమారుడికి మెరుగైన ఉద్యోగం
సీఎం హామీతో చర్మకారుడి కుటుంబంలో వెలుగు
రాజమహేంద్రవరం, జూలై7(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన ప్రయోగం పీ4 పథకం కింద తూర్పు గోదావరి జిల్లాలో మార్గదర్శి బంగారు కుటుంబం తొలి అడుగు వేసింది. కొవ్వూరు నియోజకవర్గంలోని మలకపల్లి గ్రామానికి ఈ నెల 1న వచ్చిన సీఎం చంద్రబాబు.. స్థానిక చర్మకారుడు సనమండ్ర పోసిబాబును స్వయంగా తన కారులో ఎక్కించుకుని అతడి ఇంటికెళ్లి వారి జీవన స్థితిగతులను ఆరా తీసిన సంగతి తెలిసిందే. అనంతరం సీఎం చంద్రబాబు అతడి పరిస్థితి గమనించి పోసిబాబు కుమారుడు మోహన్‌కు మెరుగైన ఉద్యోగమిస్తామని, పోసిబాబుకు షాపు పెట్టిస్తామని హామీ ఇచ్చారు. ఈమేరకు ఈ కుటుంబాన్ని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి దత్తత తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేవలం వారం రోజుల్లోనే పోసిబాబు కుమారుడు మోహన్‌కు పెరవలి మండలం ఖండవల్లిలోని రవళి స్పిన్నింగ్ మిల్లులో మెరుగైన ఉద్యోగం లభించింది. మోహన్ ఇప్పటికే రవళి స్పిన్పింగ్ మిల్లు యూనిట్-5లో ఫిట్టరుగా పనిచేస్తుండగా, సీఎం హామీ మేరకు అతడికి టెక్నికల్‌గా ప్రాధాన్యమున్న క్యాప్రికన్ డిస్టిలరీ పోస్టు ఇస్తూ మిల్లు యాజమాన్యం సోమవారం నియామక ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో భాగంగా మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ కాలంలో రూ.13 వేల వరకూ జీతం ఉంటుంది. తర్వాత జీతం పెంచుతారు. ఈ సందర్భంగా మోహన్ సోమవారం కలెక్టర్ పి.ప్రశాంతిని కలవగా, ఆమె అభినందించి ఉద్యోగం బాగా చేసుకోవాలని సూచించారు. మోహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా మా ఇంటికి వచ్చి, మా పరిస్థితిని ఆరా తీసి, మా అభివృద్ధికి బాటలు వేయడాన్ని జీవితంలో మరువలేమన్నారు.