Share News

CM Chandrababu: మార్గదర్శుల ఎంపిక స్వచ్ఛందమే

ABN , Publish Date - Aug 06 , 2025 | 04:45 AM

రాష్ట్రంలో చేపట్టిన పీ-4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శుల ఎంపిక పూర్తి స్వచ్ఛందంగానే జరుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇందులో ఎలాంటి బలవంతం లేదని తెలిపారు.

CM Chandrababu: మార్గదర్శుల ఎంపిక స్వచ్ఛందమే

  • ఎవరినీ బలవంతం చేయొద్దు: సీఎం

  • వీరి ఎంపికలో వ్యతిరేకత రాకూడదు

  • 2029 నాటికి పీ-4 లక్ష్యం సాకారం

  • ఈ కార్యక్రమం దేశానికే ఆదర్శం

  • అవనిగడ్డ పారిశుధ్య కార్మికురాలే స్ఫూర్తి

  • ఆర్థిక అసమానతలు మరింత తగ్గాలి

  • ఇవి పెరగడం సమాజానికి మంచిది కాదు

  • ప్రజలే ఆస్తిగా జీరో పావర్టీ మిషన్‌ అమలు

  • నేనూ 250 కుటుంబాలను దత్తత తీసుకున్నా

  • ప్రజాప్రతినిధులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌

అమరావతి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చేపట్టిన పీ-4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శుల ఎంపిక పూర్తి స్వచ్ఛందంగానే జరుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇందులో ఎలాంటి బలవంతం లేదని తెలిపారు. మార్గదర్శుల ఎంపికలో ఎక్కడా వ్యతిరేకత రాకూడదని సీఎం ఆదేశించారు. ఎవరినీ బలవంతం చేయొద్దని, మానవత్వం ఉండేవారు ఇందులో చేరతారని పేర్కొన్నారు. సచివాలయంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పీ-4 లక్ష్యం 2029 నాటికి సాకారమవుతుందని, ఇది దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. పేదరిక నిర్మూలనలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యమని తెలిపారు. సమాజానికి తిరిగి ఇవ్వాలన్నదే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. మార్గదర్శుల నుంచి చిన్న ఆసరా పేదలకు కొండంత అండ అవుతుందన్నారు. ఈ స్ఫూర్తితోనే అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన పారిశుధ్య కార్మికురాలు పల్లెకుంట హేమలత మార్గదర్శిగా మారి ఓ వృద్ధురాలిని ఆదుకుంటున్నారని ప్రశంసించారు. స్పందించే మనసుంటే పేదల్ని ఆదుకునేందుకు మానవత్వం చూపుతూ ముందుకొస్తారని, డబ్బుతో పాటు సాయం చేసేవారు కూడా మార్గదర్శులేనని తెలిపారు. బంగారు కుటుంబాలకు కావాల్సింది భావోద్వేగంతో కూడిన అనుబంధం, చేయూత మాత్రమేనన్నారు. సీఎ్‌సఆర్‌ నిధులతో బిల్‌ గేట్స్‌, వేదాంత లాంటి సంస్థలు పనిచేస్తున్నాయని, వీటికి మించి కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా పీ-4 చేపట్టామన్నారు. ప్రజలే ఆస్తిగా జీరో పావర్టీ మిషన్‌ అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ‘‘మంచి కార్యక్రమాలను అడ్డుకునేందుకు కొందరు రాక్షసుల తరహాలో వ్యవహరిస్తారు.


ప్రజల్లో దీనిపై వ్యతిరేకత తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. గతంలో జన్మభూమి, శ్రమదానం, నీరు-మీరు... ఇలా ఏ కార్యక్రమం చేపట్టినా ఇదేవిధంగా విమర్శించారు. ఇలాంటివి పట్టించుకోను. కొందరికి ఆర్థిక వనరులున్నా పేదలను ఆదుకోవడానికి మనసు రాదు. కొందరికి మనసున్నా సమయం ఉండకపోవచ్చు. ఇలాంటి వారిని గుర్తించాలి. పీ-4 వేదిక ఉందని చెప్పాలి. ఆర్థిక అసమానతలు మరింత తగ్గాలి. ఈ రోజు బంగారు కుటుంబంలో సాయం పొందిన వారే... రేపు మార్గదర్శి కావచ్చు. సంక్షేమ పథకాలతో పాటు బంగారు కుటుంబాలకు పీ-4 ద్వారా అదనపు సాయం అందుతుంది. విదేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐలు, పారిశ్రామికవేత్తలను కలిసి వారిలో ఆలోచనను రేకెత్తించాలి’’ అని చంద్రబాబు సూచించారు.


1,03,938 మంది మార్గదర్శుల గుర్తింపు

‘‘మార్గదర్శుల స్ఫూర్తే బంగారు కుటుంబాలకు ఆసరా. ఇప్పటి వరకు 9,37,913 బంగారు కుటుంబాల ఎంపిక పూర్తయింది. 1,03,938 మంది మార్గదర్శులను గుర్తించాం. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల కుటుంబాలకు ఉన్న అవసరాలను ప్రాధాన్య క్రమంలో గుర్తించాం. 11 ప్రశ్నలతో వివరాలు నమోదు చేసి ఏఐతో విశ్లేషించాం. ఉద్యోగావకాశాలు కల్పించాలని 31 శాతం మంది, వైద్య చికిత్సలకు సంబంధించి 22 శాతం మంది, తమ చిన్న చిన్న వ్యాపారాలను మరింత పెంచుకోవడానికి అవకాశాలు కల్పించాలని 9 శాతం మంది కోరారు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడటంతో పాటు గ్రామాలు, మండలాల వారీగా దత్తత తీసుకునేందుకు ముందుకొస్తున్నారు. అలాగే ‘ఫండ్‌ ఏ నీడ్‌’ అనే అంశాన్ని కూడా పీ-4లో పెట్టాం. ఈ కార్యక్రమం అమలును 3నెలలకోసారి సమీక్షించుకుంటాం. ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనవచ్చు. నేను కూడా మార్గదర్శిగా పేరు నమోదు చేయించుకుని 250 కుటుంబాలను దత్తత తీసుకున్నా. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నెల 19 నుంచి పీ-4 అమలుకునిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమీక్షకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌, సీఎస్‌ విజయానంద్‌, పీ-4 ఫౌండేషన్‌ ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ఆర్థిక, ప్రణాళిక శాఖ అధికారులు హాజరయ్యారు.


100 కుటుంబాల దత్తత: జీవీ, బొలిశెట్టి

సీఎం చంద్రబాబు స్ఫూర్తితో బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ఇద్దరు ప్రజాప్రతినిధులు ముందుకొచ్చారు. వినుకొండలోని ఎస్టీ వర్గాలకు చెందిన 100 కుటుంబాలను దత్తత తీసుకుంటానని చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు సీఎంకు తెలిపారు. అలాగే తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌ కూడా తన నియోజకవర్గంలో వంద పేద కుటుంబాలను దత్తత తీసుకుంటామని పీ-4పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రకటించారు. కాగా, పీ-4 కార్యక్రమం స్ఫూర్తితో పాఠశాలలు, ట్రిపుల్‌ ఐటీల్లో చదివే పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించేలా కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. బడుగు వర్గాల్లోని ప్రతిభావంతులకు ఆర్థిక సాయం అందిస్తానని తెలిపారు. పీ4 కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి ముందుకొచ్చిన వారిని సీఎం అభినందించారు. మరింత మంది ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Updated Date - Aug 06 , 2025 | 07:50 AM