Bapatla District: అతి వేగానికి మరో 5 ప్రాణాలు బలి
ABN , Publish Date - Dec 13 , 2025 | 04:38 AM
మితిమీరిన వేగం ఐదు ప్రాణాలను బలి తీసుకుంది. కొబ్బరి కాయల లోడుతో వెళుతున్న వాహనం అదుపుతప్పి పంట కాల్వలో బోల్తా కొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
కొబ్బరికాయల లోడు వాహనం కాల్వలో బోల్తా
ముగ్గురు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు
రెండు బైక్‌లు ఢీకొని ఇరువురి దుర్మరణం
కొల్లూరు/ భట్టిప్రోలు/ పిట్టలవానిపాలెం, డిసెంబరు 12(ఆంధ్రజ్యో తి): మితిమీరిన వేగం ఐదు ప్రాణాలను బలి తీసుకుంది. కొబ్బరి కాయల లోడుతో వెళుతున్న వాహనం అదుపుతప్పి పంట కాల్వలో బోల్తా కొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం లంక గ్రామాల్లోని తోటల నుంచి కొబ్బరికాయలను సేకరించడానికి భట్టిప్రోలు మండలం చింతమోటుకి చెందిన తండ్రీ కొడుకులు సమ్మెట పోతురాజు, గణేశ్ వెళ్లారు. తమతో పాటు చింతమోటుకు చెందిన కూలీలు చాట్రగడ్డ కాంతారావు (50), పెసర్లంక శ్రీనివాసరావు (55), వెల్లటూరుకు చెందిన షేక్ ఇస్మాయిల్ (60)ను వెంట తీసుకువెళ్లారు. కాయలను లోడు చేసుకుని తిరిగి వెళ్తుండగా దోనేపూడి-కోటిపల్లి మధ్య వాహనం అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడిం ది. వాహనం క్యాబిన్‌లో ఉన్న గణేశ్, పోతురాజు గాయపడగా, మరో వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. కాయలపై కూర్చొన్న కాంతారావు, శ్రీనివాసరావు, ఇస్మాయిల్ వాహనం కింద పడి కాల్వలో కూరుకుపోయి మృతిచెందారు. స్థానికులు బోల్తా కొట్టిన వాహనానికి తాళ్లు కట్టి పైకి లేపి మృతదేహాలను వెలికి తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తెనాలి, గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలకు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ఏరియా వైద్యశాలకు తరలించారు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే ఆనందబాబు, ఎస్పీ ఉమామహేశ్వర్ పరిశీలించారు.
మరో ఘటనలో... ఎదురెదురుగా వచ్చిన రెండు బైక్‌లు వేగంగా ఢీకొన్న ఘటనలో ఇరువురు దుర్మరణం పాలయ్యారు. బాప ట్ల జిల్లా చందోలు ఎస్‌ఐ వెంకట శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరం మండలం చినమట్లపూడి చెందిన షేక్ జాన్ సైదా(35) భార్య, కుమారుడితో కలిసి బైక్‌పై చందోలు వస్తుండగా అదే మండలం పెదపల్లి గ్రామానికి చెందిన ఆట్ల భానుప్రకాశ్(22) బైక్‌పై వెళ్తూ వేగంగా ఎదురొచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన షేక్ జాన్‌సైదా, భానుప్రకాశ్ అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.