justice C.H. Manavendranath Roy: ఒకే రోజులో 3.11 లక్షలకు పైగా కేసులు పరిష్కారం
ABN , Publish Date - Dec 18 , 2025 | 04:00 AM
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 13న నిర్వహించిన లోక్ అదాలత్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఒక్క రోజే రికార్డు స్థాయిలో..
లోక్ అదాలత్‌కు అనూహ్య స్పందన
అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 13న నిర్వహించిన లోక్ అదాలత్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఒక్క రోజే రికార్డు స్థాయిలో 3.11 లక్షలకు పైగా క్రిమినల్, సివిల్, ప్రమాద బీమా, వివాహ సంబంధ, ప్రిలిటిగేషన్ కేసులు పరిష్కారమయ్యాయి. మొత్తం రూ.400 కోట్ల పరిహారాన్ని అందజేశారు. లోక్ అదాలత్‌లో ఈ స్థాయిలో పెండింగ్ కేసులు పరిష్కారం కావడం ఇదే మొదటిసారి. లోక్ అదాలత్‌ను విజయవంతంగా నిర్వహించడానికి, ఇంత పెద్ద ఎత్తున కేసుల పరిష్కారం కావడానికి హైకోర్టు న్యాయమూర్తి, ఏపీ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ మార్గదర్శకంలో 13 జిల్లాల న్యాయసేవాధికార సంస్థలు సుదీర్ఘ కసరత్తు చేశాయి. వివిధ శాఖలను సమన్వయ పరిచేందుకు అధికారులతో 969 సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు 2,122 ప్రి లోక్ అదాలత్ సిట్టింగులు నిర్వహించాయి. కేసులు పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా దిగువ కోర్టుల్లో 433 లోక్ అదాలత్ బెంచ్‌లు ఏర్పాటు చేశారు. లోక్ అదాలత్ ద్వారా ఎటువంటి ఖర్చు లేకుండా తక్కువ సమయంలో న్యాయం పొందవచ్చని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ కోరారు. లోక్ అదాలత్ తీర్పు అంతిమమని, దీనిపై ఎలాంటి అప్పీల్ ఉండదని తెలిపారు. ఈ మేరకు ఏపీఎ్‌సఎల్‌ఎ్‌సఏ సభ్య కార్యదర్శి బీఎ్‌సవి హిమబిందు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.