BJP State President PVN Madhav: ఓఆర్‌ఆర్ గేమ్ చేంజర్
ABN , Publish Date - Aug 06 , 2025 | 04:52 AM
అమరావతి రాజధానికి అవుటర్ రింగురోడ్డు (ఓఆర్‌ఆర్) గేమ్ ఛేంజర్ అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చెప్పారు.
రాజధానికి ఇచ్చే రూ.15 వేల కోట్ల రుణాన్ని కేంద్రమే తిరిగి చెల్లిస్తుంది
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
గుంటూరు, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధానికి అవుటర్ రింగురోడ్డు (ఓఆర్‌ఆర్) గేమ్ ఛేంజర్ అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చెప్పారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు రాజధానితో అనుసంధానం ఏర్పడుతుందన్నారు. దీనికయ్యే ఖర్చంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. అమరావతి-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవేని కూడా కేంద్రమే నిర్మిస్తోందన్నారు. వీటివల్ల రాజధానిని మరో ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా ఎవరూ చేయలేరన్నారు. గుంటూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గత వైసీపీ ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచనలతో రాష్ట్రం ఐదేళ్ల విలువైన సమయాన్ని కోల్పోయింది. విశాఖపట్టణంలో రాజధాని అంటే ఎవరికీ ఇష్టం లేదు. 2019 ఎన్నికల ముందు వరకు అమరావతికి జై కొట్టిన జగన్ ఆతర్వాత మాట మార్చారు. ఉద్యమ సమయంలో అమరావతి రైతులకు అన్నివిధాలా సాయం అందించాం. భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ప్లాట్లు ఇవ్వాలి. ఎల్‌పీఎస్ దేశానికి రోల్ మోడల్ కావాలంటే ముందు రైతులకు ప్లాట్లు ఇవ్వాలి. ఎన్‌డీఏ-3 అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధానికి రూ.15 వేల కోట్లు ఇచ్చాం. ఈ నిధులను వరల్డ్ బ్యాంకు, జైకా, ఐఎంఎఫ్ సమకూరుస్తున్నా.. వాటి రీపేమెంట్ కేంద్రమే చేస్తుంది. కొండవీటి వాగు, పాలవాగు విషయంలో ఆయా సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వాటిని ఒప్పించి ప్రధాని మోదీ రుణం మంజూరు చేయించారు.
విభజన చట్టంలో రాష్ట్రానికి మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ సాధ్యమైనంత త్వరగా తీసుకొస్తాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏమి పూర్తి చేయగలుగుతామో అంచనా వేసి వాటిని పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని ప్రధాని సీఎంకు సూచించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రూ.వేల కోట్ల విలువ చేసే జాతీయ రహదారుల నిర్మాణానికి మూడు రోజుల కిందటే శంకుస్థాపన చేశారు. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్టులు మంజూరు చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అభివృద్ధి ఎలా పరుగులు పెడుతుందనే దానికి చక్కటి ఉదాహరణే ఏపీ’ అని మాధవ్ చెప్పారు.