Organ Donation: అవయవదానంతో నలుగురి జీవితాల్లో వెలుగులు
ABN , Publish Date - Jul 23 , 2025 | 06:11 AM
బ్రెయిన్ డెడ్ అయిన యువకుడు అవయవ దానం ద్వారా నలుగురి జీవితాలలో వెలుగులు నింపనున్నాడు.
రోడ్డు ప్రమాదంలో కొల్లూరు యువకుడి బ్రెయిన్‌డెడ్
యలవర్తి ఆదిత్యసాయి కళ్లు,కిడ్నీలు, కాలేయం దానం
తాడేపల్లి టౌన్, విజయవాడ, జూలై 22 (ఆంధ్రజ్యోతి): బ్రెయిన్ డెడ్ అయిన యువకుడు అవయవ దానం ద్వారా నలుగురి జీవితాలలో వెలుగులు నింపనున్నాడు. బాపట్ల జిల్లా కొల్లూరుకు చెందిన యలవర్తి ఆదిత్యసాయి(22) ఈ నెల 19న బైక్‌పై ప్రయాణిస్తూ కొల్లూరు వద్ద రోడ్డు ప్రమాదానికి గురవడంతో తలకు తీవ్ర గాయమైంది. చికిత్స నిమిత్తం ఆయనను తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించగా తలకు శస్త్రచికిత్స చేశారు. అయినప్పటికీ స్పృహలోకి రాకపోవడంతో 21వ తేదీన బ్రెయిన్‌డెడ్ అయినట్టు వైద్యులు ప్రకటించారు. అవయవ దానానికి కుటుంబసభ్యులు అంగీకరించడంతో ఏపీ జీవన్‌దాన్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కె.రాంబాబు, మణిపాల్ ఆస్పత్రి క్లస్టర్ హెడ్ సుధాకర్ కంటెపూడి ఆధ్వర్యంలో అవయవాలను సేకరించారు. కళ్లను ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి, ఒక కిడ్నీ, కాలేయాన్ని మణిపాల్ ఆస్పత్రికి, మరో కిడ్నీని క్యాపిటల్ ఆస్పత్రికి అందజేసినట్టు మణిపాల్ ఆస్పత్రి ప్రతినిధులు తెలిపారు.