AP DGP Harish Kumar Gupta Warns Maoists: జనజీవనంలో కలవకుంటే నిర్మూలనే..
ABN , Publish Date - Nov 21 , 2025 | 04:02 AM
ఏపీని మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చే లక్ష్యం తో 2026 మార్చివరకు ఆపరేషన్ సంభవ్‌ను కొనసాగిస్తామని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా తెలిపారు...
మావోయిస్టులను మళ్లీ హెచ్చరిస్తున్నాం
ఏపీలో నక్సల్స్ ఉనికిని నిర్వీర్యం చేస్తాం
మార్చి వరకు ‘ఆపరేషన్ సంభవ్’
ఆ గడువులోగా మావోయిస్టు రహిత రాష్ట్రం
రంపచోడవరంలో డీజీపీ గుప్తా వెల్లడి
రంపచోడవరం, నవంబరు 20 (ఆంధ్రప్రదేశ్): ఏపీని మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చే లక్ష్యం తో 2026 మార్చివరకు ‘ఆపరేషన్ సంభవ్’ను కొనసాగిస్తామని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు రాష్ట్రంలోనూ మావోయిస్టు నిర్మూలనా చర్యలు చేపడుతున్నామని వివరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లిలో వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో గురువారం ఆయన రంపచోడవరంలో పర్యటించారు. రెండు ఎన్‌కౌంటర్లలో 13 మంది మృతి చెందగా, ఘటనా స్థలాల్లో లభ్యమైన ఆయుధాలు, పేలుడు సామగ్రిని ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మా ట్లాడారు. ‘‘రాష్ట్రాన్ని హింసకు దూరంగా ఉంచాలన్న ప్రభుత్వ లక్ష్యం మేరకు పోలీసు వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నాం. ఇందులో భాగంగానే మావోయిస్టులకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాం. రాష్ట్రంలో ఎక్కడా మా వోయిస్టుల అలజడిని అనుమతించబోం. అందులో భాగమే మారేడుమిల్లి ఎన్‌కౌంటర్లు’’ అని వివరించారు. దేశవ్యాప్తంగా తీవ్ర నేర స్వభావిగా గుర్తింపు పొందిన మావోయిస్టు నేత హిడ్మా సహా ఆరుగురిని ఒకరోజు, సాంకేతికతను ఉపయోగించి అనేక దుశ్చర్యలకు పాల్పడిన టెక్ శంకర్‌తోపాటు ఏడుగురిని రెండోరోజు ఎదురుకాల్పుల్లో నిర్మూలించామన్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగానే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సంచరిస్తున్న 50 మంది మావోయిస్టులను అరెస్టు చేశామని తెలిపారు. జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని, లేనిపక్షంలో నిర్మూలనా చర్యలను చేపడతామని ఈ ఏడాది జూన్‌లో మన్యం ఎన్‌కౌంటర్ సందర్భంగా హెచ్చరించామని, మావోయిస్టుల నుంచి స్పందన లేనందునే ఆపరేషన్లు కొనసాగిస్తున్నామని డీజీపీ వివరించారు. సాయుధ ఉద్యమాన్ని వదిలి బయటకు రావడానికి మావోయిస్టులకు మరోసారి అవకాశం ఇస్తున్నామని డీజీపీ తెలిపారు.