Share News

‘ఓపెన్‌’ అవినీతి!

ABN , Publish Date - Sep 13 , 2025 | 01:19 AM

విద్యాశాఖ ఓపెన్‌ స్కూల్‌ కేటగిరీలో ఉమ్మడి కృష్ణాజిల్లాలో అవినీతి తిమింగలాలు రాజ్యమేలుతున్నాయి. ఓపెన్‌ స్కూల్స్‌ నిర్వహణ పేరుతో అందినకాడికి విద్యార్థుల నుంచి దండుకుంటున్నాయి. తాము సూచించిన ఓపెన్‌ స్కూల్స్‌లో చేరితే పాస్‌ గ్యారంటీ అని ప్రచారం చేస్తున్నాయి. జిల్లా విద్యాశాఖ కార్యాలయాలలో పనిచేసే కొందరి సహాయ సహకారాలతో ఓపెన్‌ స్కూల్స్‌కు చెందిన ఒక అధికారి, గతంలో పని చేసిన అధికారి, ఓ ఆపరేటర్‌ గ్యాంగ్‌గా ఏర్పడి అక్రమ వసూళ్లకు పాల్పడినట్టుగా విమర్శలు వస్తున్నాయి.

‘ఓపెన్‌’ అవినీతి!

- ఓపెన్‌ స్కూల్స్‌ ఫలితాల వెనుక భారీ దందా!

- ఉమ్మడి కృష్ణాజిల్లాలో రూ.10 కోట్ల వరకు వసూలు!

- వైసీపీ ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన ఓ గ్యాంగ్‌

- మూడేళ్లుగా కొనసాగుతున్న వ్యవహారం

- విద్యాశాఖ అధికారుల కార్యాలయంలోని వారితో కుమ్మక్కై..

- గతంలో ఆరోపణలు వచ్చినా.. మొక్కుబడిగా చర్యలు

- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, కమిషనర్‌కు ఫిర్యాదులతో విషయం వెలుగులోకి

విద్యాశాఖ ఓపెన్‌ స్కూల్‌ కేటగిరీలో ఉమ్మడి కృష్ణాజిల్లాలో అవినీతి తిమింగలాలు రాజ్యమేలుతున్నాయి. ఓపెన్‌ స్కూల్స్‌ నిర్వహణ పేరుతో అందినకాడికి విద్యార్థుల నుంచి దండుకుంటున్నాయి. తాము సూచించిన ఓపెన్‌ స్కూల్స్‌లో చేరితే పాస్‌ గ్యారంటీ అని ప్రచారం చేస్తున్నాయి. జిల్లా విద్యాశాఖ కార్యాలయాలలో పనిచేసే కొందరి సహాయ సహకారాలతో ఓపెన్‌ స్కూల్స్‌కు చెందిన ఒక అధికారి, గతంలో పని చేసిన అధికారి, ఓ ఆపరేటర్‌ గ్యాంగ్‌గా ఏర్పడి అక్రమ వసూళ్లకు పాల్పడినట్టుగా విమర్శలు వస్తున్నాయి.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఇటీవల జరిగిన ఓపెన్‌ స్కూల్స్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జరగటం సంచలనం సృష్టించింది. విద్యాశాఖ కార్యాలయంలోని కొందరు అధికారులతో సంబంధాలు కలిగిన వసూళ్ల గ్యాంగ్‌ ఈ భారీ స్కామ్‌కు పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి కృష్ణా ఓపెన్‌ స్కూల్స్‌లో జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై తాజాగా మంత్రి నారా లోకేశ్‌కు ఫిర్యాదు అందటంతో లోగుట్టు వ్యవహారాలు వెలుగు చూశాయి. విద్యాశాఖ కమిషనర్‌కు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఉమ్మడి కృష్ణా ఓపెన్‌ స్కూల్స్‌ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓపెన్‌ స్కూల్స్‌ విభాగంలో రూ.10 కోట్ల మేర స్కామ్‌ జరిగినట్టుగా విద్యాశాఖ కమిషనర్‌కు అందిన ఫిర్యాదును బట్టి తెలుస్తోంది.

వందకుపైగా స్కూళ్లు!

ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాల్లో పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ ఓపెన్‌ స్కూల్స్‌ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం, ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో వందకుపైగానే ఓపెన్‌ స్కూల్స్‌ ఉన్నాయి. ఓపెన్‌ స్కూల్స్‌లో మంచి ఫలితాలే వచ్చేవి. మాస్‌ కాపీయింగ్‌ ఆరోపణలు ఉండటం వల్ల కూడా ఫలితాలు ఎక్కువుగా ఉండేవన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఉన్నట్టుండి ఇటీవల కాలంలో కృష్ణాజిల్లాలో ఓపెన్‌ స్కూల్స్‌ ఫలితాల శాతం దారుణంగా పడిపోయింది. దీని వెనుక లోగుట్టు ఎవరికీ అర్థం కాలేదు. ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలను అత్యంత కఠినంగా నిర్వహించటం వెనుక ఓ గ్యాంగ్‌ హస్తం ఉందన్నది ఆ తర్వాత కానీ బోధపడలేదు. ప్రైవేటు సంస్థల పరిధిలో నిర్వహించే ఓపెన్‌ స్కూల్స్‌కు, ఈ గ్యాంగ్‌కు మంచి సంబంధాలు ఉండేవి. వాటితో ఈ గ్యాంగ్‌కు ఇబ్బంది ఉండేది కాదు. ప్రభుత్వ స్కూళ్లలో, కాలేజీలలో నిర్వహించే ఓపెన్‌ స్కూల్స్‌ విషయంలో మాత్రం తాము వేసిన వసూళ్ల ప్రణాళికకు అనుగుణంగా కృష్ణాజిల్లాలో నిర్వహించిన పరీక్షలను ఈ గ్యాంగ్‌ టార్గెట్‌గా చేసుకున్నట్టు తెలుస్తోంది. పథకం ప్రకారం ఉత్తీర్ణతా శాతం పడగొట్టిన తర్వాత ఈ గ్యాంగ్‌ నేతృత్వంలోనే జెడ్పీ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలల్లో మరికొన్ని స్టడీ సెంటర్లను ప్రారంభించారని తెలుస్తోంది. రెండు జిల్లాల్లో తాము ఏర్పాటు చేయించిన ఓపెన్‌ స్కూల్స్‌లో చేరిన వారికి పాస్‌ గ్యారంటీ అన్న హామీ ఇచ్చి తెర వెనుక వందలాది మందికి ఆఫర్‌ ఇచ్చి అడ్మిషన్లు ఇప్పించినట్టు తెలుస్తోంది. ఇలా అడ్మిషన్లు పొందిన వారి నుంచి ఒక్కొక్కరి దగ్గర వేలాది రూపాయలను వసూలు చేసినట్టు తెలుస్తోంది. తమ ఆఫర్ల ద్వారా అడ్మిషన్లు పొందిన విద్యార్థులను పాస్‌ చేయించటానికి విద్యాశాఖ అధికారుల కార్యాలయంలోని కొందరు అధికారులతో తమకు ఉన్న సన్నిహిత పరిచయాల కారణంగా ప్రభుత్వ పాఠశాలల టీచర్లను, హెచ్‌ఎంలను పరీక్షల సూపరింటెండెంట్లుగా, ఇన్విజిలేటర్లుగా నియమించటంలో సఫలీకృ తమైనట్టు సమాచారం. వీరి ద్వారా పరీక్షలలో మాస్‌ కాపీయింగ్‌ చేయించి 99 శాతం ఉత్తీర్ణత తీసుకువచ్చారని తెలిసింది. అసలు అభ్యర్థుల బదులు నకిలీ అభ్యర్థులతో కూడా పరీక్షలు రాయించినట్టు సమాచారం. ఈ వ్యవహారాలను గత మూడు సంవత్సరాలుగా గుట్టుగా నడిపిస్తున్నారని, ఈ పేరుతో రూ.10 కోట్ల వరకు వసూలు చేశారని తెలుస్తోంది.

ఉన్నతాధికారులకు ఫిర్యాదులు

ఈ గ్యాంగ్‌ వ్యవహారం కృష్ణాజిల్లాలో కొంతమందికి తెలియటంతో వారు జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై విద్యాశాఖ ఉన్నతాధికారులు పూర్తి స్థాయి చర్యలు చేపట్టలేదు. ఒక ఆపరేటర్‌ను ఎన్టీఆర్‌ జిల్లాకు బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ జిల్లాలో కూడా ఇదే విధానాన్ని ఈ గ్యాంగ్‌ అమలు చేసింది. సడెన్‌గా ఉత్తీర్ణతా శాతాన్ని పడగొట్టి.. గతంలో కృష్ణా జిల్లాలో అనుసరించిన విధానాన్నే అనుసరించింది. కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులతో చేతులు కలిపి వారి ద్వారా ఓపెన్‌ స్కూల్స్‌కు అడ్మిషన్లు సాగించారు. కిందటి ఆగస్టు నెలలో ఈ తతంగాన్ని నడిపించారు. దీని వెనుక కూడా భారీ డీల్‌ నడిచిందని తెలుస్తోంది. రాష్ట్ర విద్యాశాఖాధికారులు జోక్యం చేసుకుంటే తప్ప .. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఓపెన్‌ స్కూల్స్‌ ప్రక్షాళన కాలేని పరిస్థితి నెలకొంది.

Updated Date - Sep 13 , 2025 | 01:19 AM