Share News

కన్నీళ్లే మిగిలాయి..!

ABN , Publish Date - Nov 02 , 2025 | 01:22 AM

ఉద్యాన పంటల సాగుకు ఈ ఏడాది వాతావరణం అనుకూలించలేదు. కృష్ణానదికి వరదలు సంభవించిన సమయంలో లంక భూముల్లో సాగు చేసిన వాణిజ్య పంటలు దెబ్బతినగా, మొంథా తుఫాను ప్రభావంతో కంద, పసుపు, అరటి తోటలకు తీరని నష్టం వాటిల్లింది. జిల్లాలో 1,416 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 2,229 మంది రైతులకు రూ.73.45 కోట్ల మేర నష్టం జరిగినట్లుగా ప్రాథమిక నివేదికను ఉద్యానశాఖ అధికారులు తయారుచేశారు. ఈ నష్టం పెరిగే అవకాశం ఉంది.

కన్నీళ్లే మిగిలాయి..!

- ఉద్యాన పంటలపై మొంథా తుఫాను ప్రభావం

- జిల్లాలో 1,416 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు

- కంద, పసుపు, అరటి తోటలకు తీవ్ర నష్టం

- కంద 40 పుట్లకు మించి దిగుబడి రాదంటున్న రైతులు

- గతేడాది కంద పుట్టు ధర రూ.11 వేలు.. ఈ ఏడాది రూ.5,800

- పసుపు దిగుబడి తగ్గుతుందని ఆందోళన

- పూర్తిగా దెబ్బతిన్న అరటి తోటలు

ఉద్యాన పంటల సాగుకు ఈ ఏడాది వాతావరణం అనుకూలించలేదు. కృష్ణానదికి వరదలు సంభవించిన సమయంలో లంక భూముల్లో సాగు చేసిన వాణిజ్య పంటలు దెబ్బతినగా, మొంథా తుఫాను ప్రభావంతో కంద, పసుపు, అరటి తోటలకు తీరని నష్టం వాటిల్లింది. జిల్లాలో 1,416 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 2,229 మంది రైతులకు రూ.73.45 కోట్ల మేర నష్టం జరిగినట్లుగా ప్రాథమిక నివేదికను ఉద్యానశాఖ అధికారులు తయారుచేశారు. ఈ నష్టం పెరిగే అవకాశం ఉంది.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం/మోపిదేవి:

కృష్ణానది తీరంలోని లంక గ్రామాల్లో ఉద్యాన పంటలకు పెట్టింది పేరు. ఈ ఏడాది ప్రారంభం నుంచి వాణిజ్య పంటలు సాగు చేసిన రైతులు ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటూనే ఉన్నారు. మొన్నటి వరకు కృష్ణానదికి వరదలు, ఇప్పుడు మొంథా తుఫాను పంటలను తీవ్రంగా దెబ్బతీసింది. ప్రస్తుతం ఉద్యాన పంటలు సాగు చేసిన భూముల్లో ఉన్న నీటిని బయటకు తోడే ప్రయత్నాల్లో రైతులు ఉన్నారు. పంట నష్టం అంచనా వేసేవరకు తోటల్లో నీటిని అలానే ఉంచితే మరింతగా నష్టం జరుగుతుందని, అందుకే నీటిని ఇంజన్ల ద్వారా తోడేస్తున్నామని రైతులు చెబుతున్నారు.

అరటి తోటలకు కోలుకోలేని దెబ్బ

కృష్ణానది తీరం వెంబడి ఉన్న తోట్లవల్లూరు. పెనమలూరు, కంకిపాడు, ఘంటసాల, చల్లపల్లి మోపిదేవి, అవనిగడ్డ తదితర మండలాల్లో అరటి సాగు భారీగా ఉంది. మొంథా తుఫాను కారణంగా గంటకు 92 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో నాలుగు నెలల వయసున్న అరటి చెట్ల నుంచి గెలలు తయారయ్యే దశలో ఉన్న చెట్లు నిలువునా కూలిపోయాయి. అరటి తోట ఎకరానికి రూ.60 వేల వరకు పెట్టుబడిగా పెట్టామని, కౌలుగా రూ.40వేల నుంచి రూ.50వేలుగా ముందస్తుగానే చెల్లించామని, తుఫాను కారణంగా ఈ మొత్తం నష్టపోయామని రైతులు వాపోతున్నారు. అరటి గెలలు తయారయ్యే సమయంలో చెట్లు పడిపోకుండా చెట్లకు వెదురు వాసాలు కూడా పెట్టామని, ఒక్కో వాసం ఖరీదు వంద రూపాయల నుంచి రూ.120 వరకు ఉంటుందని, బలమైన గాలుల కారణంగా అరటి చెట్లు కూలిన సమయంలో వాసాలు కూడా విరిగిపోయాయని ఇదొక రకమైన న ష్టమని రైతులు అంటున్నారు.

తగ్గనున్న కంద దిగుబడి

కంద పంటను తుఫానుతో పాటు గతంలో వచ్చిన వరదలు దెబ్బతీశాయి. వాతావరణం సక్రమంగా ఉంటే ఎకరానికి కంద పంట దిగుబడి 70నుంచి 80 పుట్లు (ఒక పుట్టుకు 250 కిలోలు) వస్తుంది. కంద పంటను మరో నెల రోజుల్లో తవ్వి విక్రయించేందుకు రైతులు సిద్ధమవుతున్న నేపథ్యంలో మొంథా తుఫాను ప్రభావంతో వీచిన బలమైన గాలుల కారణంగా కంద మొక్కలు విరిగి పడిపోయాయి. విరిగిన మొక్కల కారణంగా దుంపకు ఆహారం సక్రమంగా అందదని, దుంపు పూర్తిస్థాయిలో తయారు కాదని, దీంతో ఎకరానికి 40 పుట్ల మేర మాత్రమే దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. గతేడాది ఇదే రోజుల్లో 250 కిలోల కంద ధర రూ.11వేలు ఉండగా, ఈ ఏడాది ప్రస్తుతం రూ.5,800లుగా ధర ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుఫాను కారణంగా దిగుబడి తగ్గడం ఒక ఎత్తయితే, దిబుడి తగ్గడంతోపాటు ధర తగ్గిన కారణంగా కంద పంట సాగు చేసిన రైతులకు ఈ ఏడాది నష్టాలే మిగలుతాయని రైతులు వాపోతున్నారు. ఎకరం కంద పంట సాగుకు కౌలుతో కలిపి రూ.1.50లక్షల వరకు ఖర్చులు అవుతాయని, అంతా బాగుంటే రూ.3.50 లక్షల వరకు వస్తుందని, ఈ ఏడాది ఎంత మేర రైతులకు ఆదాయం వస్తుందో చెప్పలేకున్నామని అంటున్నారు.

పసుపు దిగుబడి సన్నగిల్లుతున్న ఆశలు

జిల్లాలో పసుపు 2,200 హెక్టార్ల వరకు సాగులో ఉంది. ఎకరం పసుపు సాగుకు రూ.1.75 లక్షల వరకు ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కృష్ణానదికి వచ్చిన భారీ వరదల కారణంగా పసుపు తోటలు దెబ్బతిన్నాయి, పంటను బతికించుకునేందుకు ఎరువులను ఒకటికి, రెండు సార్లు వేసి పసుపు నిలదొక్కుకునేలా రైతులు యాజమాన్య పద్ధతులు పాటించారు. మొంథా తుఫాను కారణంగా వీచిన బలమైన గాలులకు పసుపు మొక్కలు సైతం విరిగిపోయి నేలావాలాయి. మొక్కలు విరిగిపోవడంతో భూమిలో ఉన్న పసుపు దుంపలు పూర్తిగా తయారు కావని, దీంతో దిగుబడి తగ్గుతుందని రైతులు అంటున్నారు. ఎకరానికి సరాసరిన 35 నుంచి 40 క్వింటాళ్ల పసుపు దిగుబడి వస్తుందని, తుఫాను ప్రభావంతో వీచిన గాలుల కారణంగా ఎకరానికి 10క్వింటాళ్ల దిగుబడి తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.

మూడున్నర ఎకరాల్లో కంద, పసుపు సాగుచేశా

-గరికపాటి వెంకటేశ్వరరావు, నాగాయతిప్ప, మోపిదేవి మండలం ః

మూడున్నర ఎకరాల్లో కంద, పసుపు సాగుచేశా. అధిక వర్షాలు, తుఫాను కారణంగా పసుపు పంట దెబ్బతింది. పసుపు మొక్కలు విరిగిపోవడంతో దిగుబడి, నాణ్యత కూడా తగ్గిపోతుంది, కంద పంట మరికొద్ది రోజుల్లో చేతికందే దశలో ఉంది. కంద చెట్లు విరిగిపడిపోవడంతో దుంప పూర్తిగా తయారు కాదు. దీంతో ఎంత ధర పలుకుతుందో తెలియనిస్థితి నెలకొంది. ఉద్యాన పంటలకు పంట బీమా అందించి రైతులను ఆదుకోవాలి.

ఎకరంన్నర అరటి పడిపోయింది

-పుప్పాల ఏసు, పోసిగానిలంక, మోపిదేవి మండలం

ఎకరంన్నర భూమిలో కూర అరటి సాగు చేశా. తుఫాను ప్రభావంతో బలమైన గాలులు వీయడంతో అరటి తోట మొత్తం పడిపోయింది. ఎకరాకు 1500 మొక్కలు నాటా. వారం రోజుల్లో అరటి గెలల విక్రయం జరిపేందుకు సిద్ధమవుతున్నా. ఒక గెల కనీసంగా రెండు వందలు పలికేది. ఇప్పటి వరకు రూ.1.75 లక్షల మేర పెట్టుబడిగా పెట్టాను. అరటి చెట్లు పడిపోవడంతో పూర్తిగా నష్టపోయాను. పంట నష్టం సక్రమంగా నమోదు చేయడంతో పాటు, పంట బీమా ఇచ్చి రైతులను ఆదుకోవాలి.

Updated Date - Nov 02 , 2025 | 01:22 AM