Share News

Farmer Protest: రైతుల్లేని వైసీపీ పోరు

ABN , Publish Date - Sep 10 , 2025 | 05:38 AM

యూరి యా కొరతపై రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాల ఎదుట నిరసనలు తెలపాలన్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పిలుపును రాష్ట్రవ్యాప్తంగా రైతులెవరూ పట్టించుకోలేదు..

Farmer Protest: రైతుల్లేని వైసీపీ పోరు

  • జగన్‌ పిలుపును పట్టించుకోని అన్నదాతలు

  • ఆర్డీవో ఆఫీస్‌ల వద్ద నిరసనలకు స్పందన కరువు ఇంటికే పరిమితమైన వైసీపీ అధ్యక్షుడు

  • మమ అనిపించిన పార్టీ నేతలు, కార్యకర్తలు

అమరావతి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): యూరి యా కొరతపై రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాల ఎదుట నిరసనలు తెలపాలన్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పిలుపును రాష్ట్రవ్యాప్తంగా రైతులెవరూ పట్టించుకోలేదు. మంగళవారం ‘అన్నదాత పోరు’ పేరుతో ఆ పార్టీ నిర్వహించిన ఆందోళనల్లో అన్నదాతలు కనిపించలేదు. పోరుకు పిలుపునిచ్చిన జగన్‌.. తాడేపల్లిలో నివాసానికే పరిమితమయ్యారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలే పాల్గొని మమ అనిపించారు. పలు చోట్ల సీనియర్‌ నేతలు, మాజీ మంత్రులు కూడా డు మ్మా కొట్టారు. రైతుల నుంచి స్పందన లేకపోవడంతో పలుచోట్ల వైసీపీ నేతలే రైతుల్లా కండువాలు కప్పుకుని ఆర్‌డీఓ కార్యాలయాలకు వెళ్లారు. యూరియా కొరత తీర్చాలంటూ వినతిపత్రాలు ఇచ్చేసి వచ్చేశారు. ఇబ్రహీంపట్నం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి జోగి రమేశ్‌ రెచ్చిపోయి వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు ఆయన్ను కట్టడి చేశారు. దీంతో పక్కనే ఉన్న గాంధీబొమ్మకు వినతిపత్రం ఇచ్చేసి జోగి రమేశ్‌ వెనుదిరిగారు. పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతిలో అభినయ్‌రెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, అనకాపల్లిలో గుడివాడ అమర్నాథ్‌, నందిగామలో దేవినేని అవినాశ్‌రెడ్డి తదితరులు పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోదావరి జిల్లాలో యూరియా కొరత లేకపోవడం, ఈ జిల్లాల్లో వాడకం కూడా తగ్గడంతో వైసీపీ పిలుపును రైతులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఆందోళనలకు వీల్లేదంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేయడంతో.. శాంతియుతంగా అన్నదాత పోరు చేస్తామంటూ వైసీపీ నేతలు ప్రకటించారు. శాంతియుత ర్యాలీలకు పోలీసులు అనుమతిని ఇచ్చినా కూడా పలుచోట్ల వైసీపీ శ్రేణులే ముఖం చాటేశాయి. అధికారాన్ని కోల్పోయాక వరుసగా రైతు పోరు పేరిట జగన్‌ ఇస్తున్న పిలుపునకు రైతుల నుంచిగానీ, సొంత పార్టీ నేతల నుంచిగానీ స్పందన రావడం లేదు.

Updated Date - Sep 10 , 2025 | 05:38 AM