Share News

కాసులిస్తేనే.. కనికరం!

ABN , Publish Date - Aug 07 , 2025 | 12:42 AM

మచిలీపట్నం రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు బరితెగించి వ్యవహరిస్తున్నారు. తహసీల్దార్‌ కార్యాలయాల నుంచి వచ్చే భూములకు సంబంధించిన ఫైల్స్‌ను అనేక కారణాలతో పెండింగ్‌లో పెడుతున్నారు. అడిగినంత మామూళ్లు చెల్లించిన తర్వాతే క్లియర్‌ చేసి పంపిస్తున్నారు. లేదంటే సంవత్సరాల తరబడి పని అవ్వకుండా తొక్కిపెట్టేస్తున్నారు. భారీ మొత్తంలో ముడుపులు ఇవ్వలేదని రోడ్డు కం రైలు మార్గానికి భూములిచ్చిన రైతులకు నగదు ఇవ్వకుండా ఏళ్లతరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఏసీబీ దాడిలో ఓ ఉద్యోగి పట్టుబడినా మరో ఉద్యోగి తన తీరు మార్చుకోలేదని పలువురు విమర్శలు చేస్తున్నారు.

కాసులిస్తేనే.. కనికరం!

- మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగుల బరితెగింపు

- తహసీల్దార్‌ కార్యాలయాల నుంచి వచ్చే ఫైళ్లన్నీ పెండింగే!

- అడిగినంత లంచం ఇస్తేనే క్లియరెన్స్‌ ఇచ్చేది!

- భారీ మొత్తం ఇవ్వలేదని 2023 నుంచి తొక్కిపెట్టిన రైతుల ఫైల్‌

- రోడ్‌ కం రైలు మార్గానికి భూములిచ్చిన రైతులకు చుక్కలు

- ఇటీవల ఏసీబీ దాడిలో పట్టుబడిన ఓ ఉద్యోగి

- అయినా తీరు మార్చుకోని మరో ఉద్యోగి

మచిలీపట్నం రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు బరితెగించి వ్యవహరిస్తున్నారు. తహసీల్దార్‌ కార్యాలయాల నుంచి వచ్చే భూములకు సంబంధించిన ఫైల్స్‌ను అనేక కారణాలతో పెండింగ్‌లో పెడుతున్నారు. అడిగినంత మామూళ్లు చెల్లించిన తర్వాతే క్లియర్‌ చేసి పంపిస్తున్నారు. లేదంటే సంవత్సరాల తరబడి పని అవ్వకుండా తొక్కిపెట్టేస్తున్నారు. భారీ మొత్తంలో ముడుపులు ఇవ్వలేదని రోడ్డు కం రైలు మార్గానికి భూములిచ్చిన రైతులకు నగదు ఇవ్వకుండా ఏళ్లతరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఏసీబీ దాడిలో ఓ ఉద్యోగి పట్టుబడినా మరో ఉద్యోగి తన తీరు మార్చుకోలేదని పలువురు విమర్శలు చేస్తున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

మచిలీపట్నంలోని ఆర్డీవో కార్యాలయంలో అవినీతి పెరిగిపోయింది. ఇటీవల జరిగిన ఏసీబీ అధికారుల దాడిలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బీరం త్రినాథ్‌ రూ.40 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. అయితే త్రినాథ్‌తో పాటు మరో ఉద్యోగిని కూడా అదేరోజు పట్టు కునేందుకు ఏసీబీ అధికారులు మచిలీపట్నం వచ్చారని, అతను తెలివిగా తప్పుకున్నాడని రెవెన్యూ ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ఆర్డీవో కార్యాలయంలో పనిచేసే ఈ సీనియర్‌ ఉద్యోగి తనకు త్వరలో తహసీల్దార్‌గా పదోన్నతి వస్తుందని, అందుకే అవినీతికి దూరంగా ఉంటున్నానని పైకి చెబుతూ, తెరవెనుక మాత్రం తనదైనశైలిలో అవినీతికి పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. భూములకు సంబంధించిన వివిధ ఫైళ్లు ఆర్డ్డీవో కార్యాలయానికివస్తే, వాటిని పరిశీలించి, వాటిలోని లొసుగులను తెరపైకి తెచ్చి అర్జ్జీదారులతో బేరసారాలు నడిపి పనులు చేయడం ఈ ఉద్యోగికి వెన్నతో పెట్టిన విద్య అనే విమర్శలు ఉన్నాయి. వివిధ ఫైళ్లను క్లియర్‌ చేసేందుకు ఈ ఉద్యోగి అనేక మెలికలు పెడతారని, మంత్రులు, శాసన సభ్యులతో చెప్పిస్తే మరిన్ని కొర్రీలు పెట్టి, మీ ఫైళ్లు ఆమోదానికి నోచుకోవాలంటే తాను అడిగినంత నగదును ఇవ్వాల్సిందేనని ముక్కు పిండి వసూలు చేస్తున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు.

రెవెన్యూ అసోసియేసన్‌ నాయకులు హెచ్చరించినా..

మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయం పరిధిలోని 11 మండలాల తహసీల్దార్‌ కార్యాలయాల నుంచివచ్చే ఫైళ్లను పరిష్కరించకుండా ఆర్డీవో కార్యాలయంలో పనిచేసే ఇద్దరు కీలక ఉద్యోగులు పెండింగ్‌ పెట్టడంపై అనేక ఫిర్యాదులు అందాయి.వీరు అనుసరిస్తున్న విధానంపై మండలాల్లో పనిచేసే రెవెన్యూ ఉద్యోగులు రెవెన్యూ అసోసియేషన్‌ నాయకుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. ఏసీబీ అధికారుల దాడి జరగకముందే ఆ ఇద్దరు ఉద్యోగులను రెవెన్యూ అసోసియేషన్‌ పెద్దలు పిలిచి మీ వ్యవహారశైలి వల్ల తోటి ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని, కొంతమేర దూకుడు తగ్గించాలని సూచించారు. అయినా వినకుండా దూకుడుగా వెళ్లడంతో ఏసీబీ అధికారులకు ఒక ఉద్యోగి చిక్కాడు. దీంతో మరో ఉద్యోగిని రెవెన్యూ అసోసియేషన్‌ నాయకులు పిలిచి ఇప్పటికైనా పనితీరు మార్చుకోవాలని, లేకుంటే ఇబ్బందులు పడతావని చెప్పినట్లు సమాచారం.

రైతులకు నగదు ఇవ్వకుండా జాప్యం!

మచిలీపట్నం పోర్టు వరకు రోడ్‌ కం రైలు మార్గాలకు రైతులు భూములు ఇచ్చారు. మేకావానిపాలేనికి చెందిన ఆరుగురు రైతులకు 2023 నుంచి నగదు ఇవ్వకుండా ఆర్డీవో కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి చక్రం తిప్పుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. పూర్వ కాలంలో అన్నదమ్ములు పంచుకున్న భూములకు సంబంధించి పత్రాలు సక్రమంగా లేవనే కారణంతో నగదును ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారు. తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలు పలుమార్లు ఆర్డీవో కార్యాలయంలో ఇస్తే ఈ పత్రాలు పనికిరావని ఇక్కడి ఉద్యోగి చెప్పడం గమనార్హం. ఆరుగురు రైతులకు నగదు ఇవ్వకుండా ఈ ఉద్యోగి తొక్కిపెట్టారు. దీంతో రైతులు తమ భూములను తీసుకుని అందులో రోడ్డు కూడా వేశారని, అన్నిపత్రాలు ఇచ్చినా, అవి సక్రమంగా లేవంటూ నగదు విడుదల చేయకుండా ఆర్డీవో కార్యాలయ ఉద్యోగి జాప్యం చేస్తున్నారని కలెక్టర్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్‌కు నాపైనే ఫిర్యాదు చేస్తారా అంటూ ఈ ఉద్యోగి తమపై విరుచుకుపడ్డాడని రైతులు కన్నీరుపెట్టుకున్నారు. రికార్డులు సక్రమంగా లేని భూములకు సంబంధించి నగదును కోర్టులో జమ చేస్తే, తమ వద్ద ఉన్న పత్రాలను చూపి నగదును తెచ్చుకునే ప్రయత్నం చేస్తామని రైతులు అంటున్నారు. నగదును కోర్టులో కూడా చెల్లించకుండా ఈ ఉద్యోగి తీవ్ర జాప్యం చేస్తున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. రోడ్‌ కం రైలు మార్గానికి తీసుకున్న భూములకు సంబంధించి ఒకే కుటుంబానికి చెందిన వారికి రూ.1.25కోట్ల నగదును చెల్లించాల్సి ఉంది. ఈ భూములకు పత్రాలు సక్రమంగా లేవని, పెద్ద మొత్తంలో నగదు ఇస్తే మీపని పూర్తవుతుందని చెప్పి ఈ ఉద్యోగి, ఒక అధికారి తెరవెనుక బేరం పెట్టినట్లు సమాచారం. ఇంతపెద్ద మొత్తంలో నగదు ఇవ్వలేమని వారు చెప్పడంతో ఈ పని అవ్వకుండా తొక్కిపెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టీవో కార్యాలయంపై జిల్లాస్థాయి అధికారులు నిఘా పెట్టి అక్రమాలకు పాల్పడుతున్న వారిని కట్టడి చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.

Updated Date - Aug 07 , 2025 | 12:42 AM