Health Minister Satya Kumar: ఆరోగ్యశాఖలో ఫైళ్ల పంపకం
ABN , Publish Date - Oct 06 , 2025 | 03:08 AM
సత్వర నిర్ణయాలతో పాలనలో వేగాన్ని పెంచాలన్న ఉద్దేశంతో ఆరోగ్య శాఖలో ఫైళ్ల వికేంద్రీకరణకు మంత్రి సత్యకుమార్ శ్రీకారం చుట్టారు...
మంత్రి వద్దకు 17 కీలక అంశాలు మాత్రమే
మిగిలినవి కార్యదర్శుల స్థాయిలో క్లియరెన్స్
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆమోదం
ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడి
అమరావతి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): సత్వర నిర్ణయాలతో పాలనలో వేగాన్ని పెంచాలన్న ఉద్దేశంతో ఆరోగ్య శాఖలో ఫైళ్ల వికేంద్రీకరణకు మంత్రి సత్యకుమార్ శ్రీకారం చుట్టారు. దీనిపై ఆదివారం ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య శాఖలో మొత్తం 45 ప్రధాన విషయాల్లో 17 అంశాలకు సంబంధించిన ఫైళ్లు మాత్రమే మంత్రి వద్దకు వచ్చేలా.. మిగతావి ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారుల స్థాయిలోనే నిర్ణయం తీసుకోనేలా రూపొందించిన ప్రణాళిలకు మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. సీఎం ఆదేశాల మేరకు పైళ్ల వీకేంద్రీకరణ తీసుకొచ్చామని మంత్రి సత్యకుమార్ వివరించారు. పలు విషయాల్లో ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి, మంత్రిత్వ శాఖలోని మధ్య స్థాయి అధికారులు, వివిధ విభాగాధిపతులు నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుందని నిర్ణయించారు. ఉన్నతాధికారులతో పలు దఫాలు చర్చించి, నిర్ణయాధికార వికేంద్రీకరణపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించామన్నారు. విధానపర విషయాలు, క్యాబినెట్, చట్టసభలకు సంబంధించినవి, సీఎం ఆదేశాలు, సూచనలకు సంబంధించినవి, సిబ్బంది నియామకాలు, విజిలెన్స్‌కు సంబంధించిన, ఉన్నతస్థాయి అధికారులు, సిబ్బందికి చెందిన సర్వీసు విషయాలు, కొత్త కాలేజీలు, ఆస్పత్రుల ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు, తాత్కాలిక సిబ్బంది రెగ్యులరైజేషన్, రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించిన అంశాలకు సంబంధించిన ఫైళ్లు మాత్రమే మంత్రి వద్దకు వస్తాయన్నారు. వివిధ స్థాయిల్లో నిర్ణయ సాధికారత కల్పించి అధికారులు, సిబ్బందిలో బాధ్యత, జవాబుదారీతనాన్ని పెంచడం, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, సిబ్బంది ఉత్పాదకతను పెంచడం ఈ వికేంద్రీకరణ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు.