APDPMS: ఇక ఆన్‌లైన్‌లో భూ వినియోగ మార్పు
ABN , Publish Date - Oct 27 , 2025 | 03:35 AM
రాష్ట్రంలో భూ వినియోగ మార్పు(చేంజ్ ఆఫ్ లాండ్ యూజ్-సీఎల్‌యూ)లకు ఇకనుంచి ఆన్‌లైన్‌లో అనుమతి ఇవ్వనున్నారు.
45 రోజుల్లోపు అనుమతులిచ్చేలా ఆదేశాలు.. ఒక్కో దరఖాస్తుకు రూ.10 వేల ఫీజు
అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూ వినియోగ మార్పు(చేంజ్ ఆఫ్ లాండ్ యూజ్-సీఎల్‌యూ)లకు ఇకనుంచి ఆన్‌లైన్‌లో అనుమతి ఇవ్వనున్నారు. గతంలో ఉన్న సీఎల్‌యూ ప్రక్రియను రద్దు చేసిన మున్సిపల్ శాఖ.. ఇటీవల కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఆ మేరకు అసెంబ్లీలో చట్ట సవరణ కూడా చేశారు. వ్యాపార సౌలభ్యం కోసం ఈజీ ఆఫ్ డూయింగ్‌లో భాగంగా దీన్ని అమల్లోకి తెచ్చారు. వ్యక్తులు, రియల్ ఎస్టేట్ సంస్థలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు రూ.10 వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఏపీ డెవల్‌పమెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా దరఖాస్తు చేసిన 45 రోజుల్లోపు అనుమతులు ఇస్తారు. ఆ మేరకు మున్సిపల్‌శాఖ ప్రామాణిక కార్యాచరణ విధానం(ఎ్‌సవోపీ) విడుదల చేసింది. డాక్యుమెంట్ అప్‌లోడ్, ఫీజు చెల్లింపులు, రియల్ టైం ట్రాకింగ్, ఈ-మెయిల్/ఎ్‌సఎంఎస్ అలర్ట్ సౌకర్యం కల్పించారు. గ్రామ, పట్టణ స్థానిక సంస్థలు దరఖాస్తుల పరిశీలన కోసం 3 రోజులు, పరిశీలించి డీటీసీపీకి పంపించేందుకు 3 రోజులు, డీటీసీపీ పరిశీలన, సూచనలకు 3 రోజులు, సీఎల్‌యూ సమావేశం నిర్వహణ 5 రోజులు, మంత్రి ఆమోదం కోసం 3 రోజులు, రాష్ట్ర గెజిట్‌లో అభ్యంతాల కోసం 18 రోజులు, అభ్యంతరాల సమీక్ష, సీఎల్‌యూ చార్టీల సేకరణ 5 రోజులు, ప్రభుత్వానికి డీటీసీపీ సిఫారసులకు 2 రోజులు, ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చేందుకు 3 రోజుల గడువును ఎస్‌వోపీలో ప్రకటించారు.