Awareness Campaign: బెట్టింగ్ కట్టడెలా
ABN , Publish Date - Aug 26 , 2025 | 04:19 AM
ఆన్‌లైన్ బెట్టింగ్.. మాదక ద్రవ్యాల కంటే తీవ్రమైన సమస్యగా మారుతోంది. కంటికి కనిపించని ఈ మహమ్మారి.. నగరాలు, పట్టణాలు దాటి చివరికి మారుమూల గ్రామాలకు సైతం పాకింది. రాష్ట్రంలో ఆన్‌లైన్ బెట్టింగ్, జూదంపై నిషేధం ఉన్నా కొన్ని ఇతర రాష్ట్రాల్లో...
మారుమూలకూ ఆన్‌లైన్ యాప్‌ల విజృంభణ
ఏపీలో నిషేధమున్నా ఫలితం అంతంతే
కొన్ని రాష్ట్రాల్లో లీగల్ కావడమే సమస్య
కుటుంబాలను నాశనం చేస్తున్న మహమ్మారి
అప్పులపాలై కొందరు యువత ఆత్మహత్య
కేంద్రం తెచ్చిన చట్టంతో కొత్త ఆశలు
దేశంలో ఇక లీగల్ యాప్‌లూ కనుమరుగు
మరో రూపంలో ముప్పు ఉందంటున్న నిపుణులు
విదేశాల నుంచి టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లోకి ఏపీకే ఫైల్స్ ఆపడమెలా? సర్వర్ల ట్రాకింగ్ ఎలా?
ప్రచారమే విరుగుడంటున్న నిపుణులు, పోలీసులు
గేలం వేసి ఉచ్చులోకి..
ఆన్‌లైన్ బెట్టింగ్ మోసగాళ్లు ‘ఏపీకే ఫైల్’ రూపంలో లింక్ పంపుతారు. ఆకర్షించేలా వాచీలు, చీరలు, తదితర బ్రాండెడ్ వస్తువులపై ఆఫర్లు ఇస్తారు. తర్వాత మెల్లగా బెట్టింగ్ ముగ్గులోకి దించుతారు. ఎవరైనా అంతటితో విషయం తెలుసుకుని జాగ్రత్త పడితే గండం తప్పినట్టే. అత్యాశతో ముందుకుపోతే అంతే. మొదట్లో సులువుగా వంద, రెండు వందలు గెలిచేలా చేస్తారు. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. వందల నుంచి వేలు బెట్టింగ్ కాచేలా చేస్తారు. అలా ఆ వ్యక్తి స్థాయిని బట్టి భారీ మొత్తానికి చేరుకోగానే విత్ డ్రా చేయకుండా కేటుగాళ్లు అకౌంట్‌ను బ్లాక్ చేస్తారు. స్ర్కీన్‌పై మాత్రమే డబ్బులు ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ అప్పటికే డబ్బులు లాగేసి ఉంటారు. ఇలా ఎందరో యువత అప్పులపాలై రోడ్డున పడ్డారు. కొందరు దిక్కుతోచక ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెట్టింగ్ మహమ్మారి ఎన్నో కుటుంబాలను నాశనం చేసింది.
నిషేధం ఉన్నా విచ్చలవిడి..
ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ ఆన్‌లైన్ బెట్టింగ్, జూదంపై ఇప్పటికే నిషేధం ఉంది. అయినా ఈ మహమ్మారి రాష్ట్రమంతా విజృంభించింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌ను కట్టడి చేయలేకపోవడానికి కారణం.. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, కేరళ వంటి రాష్ట్రాల్లో చట్టబద్ధం కావడమే. బెట్టింగ్ నిర్వాహకులు అక్కడి నుంచి యువతకు వల వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల నిషేధిత చట్టం తీసుకొచ్చింది. దీనివల్ల దేశంలో యాప్‌లను కట్టడి చేసినా.. విదేశాల నుంచి సవాల్ ఎదురయ్యే అవకాశముందని నిపుణులు అంటున్నారు. సోషల్ మీడియా ద్వారా యువతకు వ్యసనంగా మార్చే ప్రమాదముందని చెబుతున్నారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఆన్‌లైన్ బెట్టింగ్.. మాదక ద్రవ్యాల కంటే తీవ్రమైన సమస్యగా మారుతోంది. కంటికి కనిపించని ఈ మహమ్మారి.. నగరాలు, పట్టణాలు దాటి చివరికి మారుమూల గ్రామాలకు సైతం పాకింది. రాష్ట్రంలో ఆన్‌లైన్ బెట్టింగ్, జూదంపై నిషేధం ఉన్నా కొన్ని ఇతర రాష్ట్రాల్లో చట్టబద్ధం కావడంతో అరికట్టడం సవాల్‌గా మారింది. అక్కడ లీగల్ అయినందున నిర్వాహకులపై చర్యలు తీసుకోలేని పరిస్థితి. దీంతో బెట్టింగ్ మహమ్మారిని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం బెట్టింగ్ యాప్‌ల ఊబి నుంచి యువతను కాపాడుతుందనే ఆశ ఒకవైపు ఉన్నా.. ఊసరవెల్లిలా రూపం మార్చుకుని మరో దారిలో వచ్చే ప్రమాదముందని పోలీసులు అంటున్నారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన చట్టం ద్వారా లీగల్ బెట్టింగ్ యాప్‌లను కట్టడి చేయవచ్చు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే డ్రీమ్ లెవెన్ లాంటి క్రికెట్ బెట్టింగ్ యాప్‌లు, రమ్మీకి సంబంధించినవి, చిన్న పిల్లల గేమ్‌లలో డబ్బుల లావాదేవీలు ఉన్నటువంటి వాటిని అదుపు చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం వీటికి జియో ఫెన్సింగ్ వేస్తుంది గనుక దేశమంతా ఇవి కనుమరుగవుతాయి. జూదం, బెట్టింగ్‌ను ప్రోత్సహించే గేమ్‌లు నిషేధిత జాబితాలోకి వస్తాయని కొత్త చట్టంలో కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటివరకూ ఒక రాష్ట్రంలో నిషేధించిన యాప్‌లు మరో రాష్ట్రంలో అందుబాటులో ఉండటంతో ఎలాంటి ఫలితం కనిపించేది కాదు. ఇకమీదట ఆ పరిస్థితి ఉండదు. అయితే ఇక ఎదురయ్యే సవాలు విదేశాల నుంచి వస్తుంది.
బెట్టింగ్ యాప్‌లకు పుట్టినిల్లు లాంటి మలేసియా, చైనా, ఉక్రెయిన్ వంటి దేశాల నుంచి బెట్టింగ్ నిర్వహించే అవకాశం ఉంది. అక్కడి నుంచి మన దేశంలోని టెలిగ్రామ్ గ్రూపుల్లోకి ఏపీకే ఫైల్స్ ద్వారా లింక్ పంపి డౌన్‌లోడ్ చేసుకోమని ఆఫర్ ఇచ్చే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటు పడ్డ వ్యక్తులు వాటిని డౌన్‌లోడ్ చేసుకునే అవకాశముందని అంటున్నారు. విదేశాల నుంచి సోషల్ మీడియా గ్రూపుల్లోకి లింకులు పంపే యాప్‌లను కట్టడి చేయడం ఎలా? చైనా, మలేసియాలో ఉంటూ ఏపీకే ఫైల్స్ ద్వారా గేలం వేసే వ్యక్తుల్ని ట్రాక్ చేయడం ఎలా? అనే ప్రశ్నలు పోలీసుల నుంచి వస్తున్నాయి. వాటిని కట్టడి చేయాలంటే పెద్దఎత్తున అవగాహన కల్పించడమే ఏకైక మార్గమని పోలీసు అధికారులు చెబుతున్నారు. మిర్రర్ సర్వర్లు ఉదాహరణకు ఉక్రెయిన్‌లో ఉంటే, లోకేషన్ భారత్‌లో చూపించే వాటికి మూల్ ఖాతాలు ఉండాలి. మూల్ ఖాతాలు లేకపోతే డబ్బులు దారి మళ్లించే అవకాశం ఉండదు. ఎక్కువ కాలం లావాదేవీలు జరపని ఖాతాల వివరాలు బ్యాంకర్ల నుంచి తీసుకుని వారికి కమీషన్ ఆశ చూపించి ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వాహకులు మోసాలకు పాల్పడుతున్నారు. ఇకపై అనుమానితులకు తమ బ్యాంకు ఖాతా ఆపరేట్ చేసుకునే అవకాశం ఇవ్వరాదని, అటువంటి లావాదేవీలతో జైలుకు వెళ్లాల్సి వస్తుందని ప్రచారం చేయాలని నిపుణులు, పోలీసులు చెబుతున్నారు.
అంతా ఆన్‌లైన్..
ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వాహకులు ఒక డొమైన్ కొని వెబ్‌సైట్ డిజైన్ చేయిస్తారు. యాప్ ద్వారా గేలం వేసేందుకు ఇన్‌ఫ్లూయన్సర్లకు అడిగినంత చెల్లిస్తారు. గోప్యంగా కాల్ సెంటర్ నడుపుతారు. చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న వారిని ఎంచుకుంటారు. ఈజీమనీకి ఆశపడే వారిని ఉచ్చులోకి లాగుతారు. మొదట్లో వంద, రెండొందల రూపాయలు బెట్టింగ్ పెట్టే వారికి గెలుపు రుచి చూపిస్తారు. డబ్బు వస్తోందన్న ఆశతో వేల రూపాయలు బెట్టింగ్ ఆడేలా చేస్తారు. తర్వాత మొత్తం లాగేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో నిషేధం ఉన్నా..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగ్, జూదం నిషేధంలో ఉన్నా మరింత పుంజుకొంటున్నాయి. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు, యూ ట్యూబ్ లింకులు, పైరసీ వెబ్‌సైట్ల ద్వారా ఏపీకే ఫైళ్లు పంపి యువతను ఆకర్షిస్తున్నారు. వీటిలో అత్యధికంగా మోసపూరిత యాప్‌లు, వ్యక్తిగత సమాచారం దోచుకునే మాల్వేర్ అని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసే సమయంలో యూజర్లు ఎటువంటి అనుమతులు అడిగినా ‘అలౌ’ నొక్కేస్తున్నారని, ఆ క్షణం నుంచి బ్యాంక్ ఖాతా మొదలుకొని ఫోన్ కాంటాక్టులు, ఫొటోలు అన్నీ స్కామర్ల చేతిలోకి వెళ్లిపోతున్నాయని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఐపీఎల్ సీజన్లో ఆన్‌లైన్ బెట్టింగ్ ఫిర్యాదులు గణనీయంగా పెరుగుతున్నట్లు ఏపీ పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల గత రెండేళ్లలో ఏపీలో పదుల సంఖ్యలో ఆత్మహత్యలు నమోదయ్యాయి.
అవగాహన పెరగాలి..
యువత గేమింగ్ యాప్‌లకు అలవాటు పడకుండా అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ పెద్దఎత్తున ప్రచారం చేయిస్తున్నారు. ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. యువత గేమింగ్ యాప్‌ల నుంచి మొదలు పెట్టి ఆన్‌లైన్ బెట్టింగ్ వైపు మళ్లుతున్నారని చెప్పారు. ‘మొదట వంద రూపాయలతో ప్రారంభించి తర్వాత ఆ మొత్తం వేలల్లోకి చేరుతోంది. తక్కువ మొత్తం బెట్టింగ్ పెట్టినప్పుడు డబ్బులు వస్తాయి. తర్వాత ఆశపడి ఎక్కువ మొత్తం అప్పులు చేసి పెడతారు. కొందరు అంతా పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితిని అరికట్టేందుకు నెల రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాం. యువతలో అవగాహన తీసుకొచ్చేందుకు కృషి చేశాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం సమాజానికి చాలా మంచిది. కాకపోతే దొడ్డిదారిన మళ్లీ వచ్చే యాప్‌లను కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. బాధ్యత గల ప్రతి ఒక్కరి సహకారం కావాలి. టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేసి సమాచారం ఇస్తే పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది’ అని జగదీశ్ అన్నారు.