Kurnool Market: ఉల్లి కిలో 50 పైసలు
ABN , Publish Date - Sep 19 , 2025 | 04:53 AM
రాయలసీమ జిల్లాల్లో ఉల్లి ధరలు పతనం కావడంతో రైతులను ఆదుకునేందుకు క్వింటాకు రూ.1200 చెల్లించి ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా సేకరించిన కూటమి ప్రభుత్వం...
కర్నూలు, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ జిల్లాల్లో ఉల్లి ధరలు పతనం కావడంతో రైతులను ఆదుకునేందుకు క్వింటాకు రూ.1200 చెల్లించి ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా సేకరించిన కూటమి ప్రభుత్వం వాటికి కర్నూలు మార్కెట్‌లో గురువారం వేలంపాట నిర్వహించగా... క్వింటా ఉల్లిని కనిష్ఠంగా రూ.50కి కొనుగోలు చేశారు. అంటే.. కిలో 50 పైసలన్న మాట..! గరిష్ఠంగా క్వింటా రూ.400 పలికింది. ఎక్కువ శాతం రూ.100లోపే కొనుగోలు చేశారు. బహిరంగ వేలంలో పాల్గొన్న వ్యాపారులు ముందే కుమ్మక్కై ఇలా అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా రైతుల నుంచి 6,057 టన్నులు (60,570 క్వింటాళ్లు) ప్రభుత్వం సేకరించింది. అందులో 3,707 టన్నులు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని రైతు బజార్లకు సరఫరా చేయగా.. మరో 2,350 టన్నుల ఉల్లి బస్తాలు కర్నూలు మార్కెట్‌లోనే గుట్టలుగా పేరుకుపోయాయి. దీంతో రైతులు అమ్మకానికి తెచ్చిన ఉల్లిని కనీసం టెండరుకు ఉంచేందుకు స్థలం కూడా లేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ బి.నవ్య ఆదేశాల మేరకు ఏపీ మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన ఉల్లిగడ్డలకు కర్నూలు మార్కెట్ యార్డు స్పెషల్ గ్రేడ్ సెక్రెటరీ జయలక్ష్మి ఆధ్వర్యంలో బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలంలో క్వింటా కనిష్ఠంగా రూ.50 నుంచి గరిష్ఠంగా రూ.400 వరకూ ధర పలింది.
ఎక్కువశాతం క్వింటా రూ.100 పలికంది. ఇలా మొత్తం 492 టన్నులు (4,920 క్వింటాళ్లు) మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేశారు. వ్యాపారులు వ్యూహం ప్రకారమే వేలంలో పోటీ పడకపోవడంతో వచ్చినకాడికి ఇచ్చేయాల్సి వచ్చింది. దీంతో మార్క్‌ఫెడ్‌కు కిలోకు రూపాయి కూడా రాలేదు. కాగా, ఇదే ఉల్లిని వ్యాపారులు బయట కిలో రూ.10-20కు పైగా విక్రయిస్తున్నారు. కర్నూలులో బహిరంగ మార్కెట్‌లో నాలుగు కిలోలు రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. కాగా, ప్రభుత్వం సేకరించిన ఉల్లి బస్తాలను సకాలంలో బయటకు తరలించకపోవడంతో నిల్వచేసిన ప్లాట్‌ఫాం, గోదాముల్లోనే దాదాపు 200 టన్నులు ఉల్లి కుళ్లిపోతోందని అధికారులు తెలిపారు. అలా కుళ్లిన వంద టన్నుల ఉల్లిని డంపింగ్ యార్డులకు తరలించారు.