Share News

Payment Delay: ఉల్లి డబ్బులేవీ

ABN , Publish Date - Nov 01 , 2025 | 03:45 AM

ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసిన ఉల్లికి సంబంధించిన డబ్బుల కోసం రైతులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. సరుకు విక్రయించి రెండు నెలలు కావస్తున్నా...

Payment Delay: ఉల్లి డబ్బులేవీ

  • చెల్లించాల్సింది రూ.17 కోట్లు.. ఇప్పటికి ఇచ్చింది 2.11 కోట్లే

  • 2 నెలలుగా రైతుల నిరీక్షణ

  • 8 మార్క్‌ఫెడ్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు

కర్నూలు, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసిన ఉల్లికి సంబంధించిన డబ్బుల కోసం రైతులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. సరుకు విక్రయించి రెండు నెలలు కావస్తున్నా ఇంకా ఖాతాల్లో సొమ్ములు జమ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలకు ఉల్లి దెబ్బతిని దిగుబడి భారీగా తగ్గిపోయింది. రైతుల కష్టాలను ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాల ద్వారా వెలుగులోకి తెచ్చింది. దీంతో సీఎం చంద్రబాబు సారథ్యంలోకి కూటమి ప్రభుత్వం స్పందించి ఉల్లి క్వింటా మద్దతు ధర రూ.1,200 ప్రకటించడమే కాకుండా ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆగస్టు 31 నుంచి కర్నూలు మార్కెట్‌ యార్డులో మార్క్‌ఫెడ్‌ నేరుగా ఉల్లి కొనుగోలు చేసింది. మార్క్‌ఫెడ్‌, లైసెన్స్‌డ్‌ వ్యాపారులు కలిసి 2,800 మంది రైతుల నుంచి దాదాపు 1.55 లక్షల క్వింటాళ్లు ఉల్లి సేకరించారు. దీనికి గాను రైతులకు రూ.17 కోట్లు చెల్లించాల్సి ఉంది. వారం, పది రోజుల్లోగా ఖాతాలో జమ చేస్తామని రైతులకు మార్క్‌ఫెడ్‌ అధికారులు భరోసా ఇచ్చారు. ఉల్లి అమ్మకాలు చేసిన రైతుల పట్టాదారు పాస్‌ పుస్తకాలు, ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ పాస్‌ పుస్తకం, ఈ-క్రాప్‌ జిరాక్స్‌ కాపీలు తీసుకున్నారు. అయితే 2నెలలు కావస్తున్నా నేటికీ రైతులకు డబ్బులు చెల్లించకపోవడంపై విమర్శలొస్తున్నాయి. కేవలం 350మందికి రూ.2.11 కోట్లు జమ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఇంకా 2,445 మంది రైతులకు రూ.14.89 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే ఉల్లి డబ్బు బకాయిలు చెల్లించాలని రైతులు కోరుతున్నారు. కాగా, మెజార్టీ రైతులకు ఏపీజీబీ ఖాతాలు ఉన్నాయని, గ్రామీణ బ్యాంకులు వీలినం కారణంగా కొత్త బ్యాంకు ఖతాలు రావడంతో ఈ సమస్య తలెత్తిందని, త్వరలోనే రైతుల ఖాతాలో నిధులు జమ చేస్తామని ఏపీ మార్క్‌ఫెడ్‌ అధికారులు పేర్కొన్నారు.

Updated Date - Nov 01 , 2025 | 03:45 AM