Share News

Onion Farmers Struggle: ఉల్లి.. అదే లొల్లి

ABN , Publish Date - Sep 08 , 2025 | 04:10 AM

రాష్ట్రంలో ఉల్లిపంటకు కేంద్రంగా ఉన్న కర్నూలులో రైతులు పంటను విక్రయించలేక కన్నీరుపెడుతున్నారు..

Onion Farmers Struggle: ఉల్లి.. అదే లొల్లి

ఆరుగాలం కష్టపడి పండించిన ఉల్లి.. రైతన్నలకు కన్నీరు పెట్టిస్తోంది. లక్షల రూపాయలు అప్పులు చేసి సాగుచేస్తే చేతికొచ్చిన పంట.. కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వ్యయప్రయాసాలకోర్చి దిగుబడిని మార్కెట్‌కు తెస్తే.. కొనేవారు కరువయ్యారు. నిన్న మొన్నటి వరకు అండగా ఉన్న మార్క్‌ఫెడ్‌ తాజాగా పక్కకు తప్పుకొంది. దీంతో రైతులకు మరిన్ని ఇబ్బందులు తలెత్తాయి.

  • కర్నూలు మార్కెట్‌లో ఉల్లి గుట్టలు

  • ఎగుమతులు లేక నిలిచిన సరుకుపొరుగు రాష్ట్రాల్లోనూ తగ్గిన డిమాండ్‌

  • దీంతో కొనుగోళ్లు నిలిపేసిన మార్క్‌ఫెడ్‌

  • మద్దతు ధరపై బోనస్‌ ప్రకటించినావివిధ ఆంక్షలతో రైతులు సతమతం

  • కొనేవారి కోసం 934 టన్నుల నిల్వలు

  • వ్యాపారుల కరుణ కోసం ఎదురుచూపు

(కర్నూలు-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉల్లిపంటకు కేంద్రంగా ఉన్న కర్నూలులో రైతులు పంటను విక్రయించలేక కన్నీరుపెడుతున్నారు. కర్నూలు ఉల్లి మార్కెట్‌లో వందల క్వింటాళ్ల ఉల్లి నిల్వలు పేరుకుపోయాయి. ప్రభుత్వం క్వింటాకు రూ.1,200 కనీస మద్దతు ధర ప్రకటించినా రైతులకు ఆ మేరకు న్యాయం జరగడంలేదు. ఆరు రోజుల కిందటి వరకు ఉల్లిని కొనుగోలు చేసిన ఏపీ మార్క్‌ఫెడ్‌.. నిల్వలు పెరిగిపోవడంతో ఇప్పుడు కొనుగోళ్లను నిలిపివేసింది. దీంతో రైతులు పూర్తిగా ప్రైవేటు వ్యాపారులపైనే ఆధారపడాల్సి వస్తోంది. వారు కొనే ధరకు, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోంది. సదరు వ్యత్యాసాన్ని బోనస్‌ రూపంలో రైతులకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

పెట్టుబడికి వడ్డీలూ దక్కట్లేదు!

గతేడాది క్వింటా రూ.5 వేలకుపైగా ధర పలికిన ఉల్లి ప్రస్తుతం రూ.500 కూడా మించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు స్పందించి కనీస మద్దతు ధర రూ.1,200గా ప్రకటించారు. దీంతో ఆగస్టు 31 నుంచి ఏపీ మార్కెఫెడ్‌ కొనుగోళ్లు చేపట్టింది. క్వింటా రూ.1,200 చొప్పున 1,226 టన్నులు కొనుగోలు చేసింది. మరో 292 టన్నులను రైతుబజార్లు, సంక్షేమ హాస్టళ్లు, రేషన్‌ దుకాణాలకు సరఫరా చేశారు. ప్రస్తుతం 934 టన్నులు(9,340 క్వింటాళ్లు) పేరుకుపోయాయి. ఇప్పటికే కొనుగోలు చేసిన ఉల్లి నిల్వలను బయటకు పంపలేని పరిస్థితుల్లో మార్క్‌ఫెడ్‌ కొనుగోళ్లు ఆపేసింది. మార్కెట్‌ యార్డు లైసెన్స్‌ ఉన్న వ్యాపారులూ ముందుకు రావడంలేదు. అయితే, వ్యాపారులు ఎంతకు కొన్నా.. రూ.1200 చొప్పున వ్యత్యాసం అమౌంట్‌ను బోన్‌సగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ-క్రాప్‌ నమోదు, బ్యాంక్‌ ఖాతా పుస్తకం, పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌ జిరాక్స్‌ కాపీ ఇస్తేనే బోనస్‌ అమౌంట్‌ ఖాతాలో జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ-క్రాప్‌ నమోదు కాని రైతులకు బోనస్‌ ఇచ్చేది లేదని తేల్చేశారు. మరోవైపు, మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసిన 12,260 క్వింటాళ్లకు సంబంధించిన రూ.1.47 కోట్లను రైతుల ఖాతాలలో ఇంకా జమ చేయలేదు.


దిగుబడి పెరిగి..

కర్నూలు మార్కెట్‌కు జిల్లా నుంచే కాకుండా అనంతపురం, కడప, తెలంగాణలోని జోగులాంబ గద్వాల, కర్ణాటకలోని రాయచూరు జిల్లాల నుంచి రైతులు ఉల్లిని తీసుకొస్తారు. ఖరీఫ్‌ సీజన్‌లో ఆగస్టు నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. గతేడాది ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఈ ఏడాది ఒక్క కర్నూలు జిల్లాలోనే 31 వేల ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. దీంతో మన రాష్ట్రంలోనే దిగుబడి భారీగా పెరిగింది. ఈ ఏడాది ఏపీ మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేస్తుందని ప్రకటించడంతో రైతులు పొలాల్లో విక్రయించడం ఆపేసి మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. ఈ నెల 6న ఒక్కరోజే 16 వేల క్వింటాళ్ల ఉల్లిని తీసుకొచ్చారని మార్కెట్‌ యార్డు కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. ఎక్కడిక్కక్కడే నిల్వలు పేరుకుపోవడంతో ఆదివారం సైతం కొనుగోళ్లు సాగించామన్నారు.

డిమాండ్‌ ఏదీ?

వ్యాపారులు కొనుగోలు చేసిన సరుకు కర్నూలు మార్కెట్‌ నుంచి బయటకు తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇక్కడి నుంచి కోల్‌కతా, తమిళనాడు, కేరళ, కటక్‌, గుజరాత్‌.. తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. అయితే.. అక్కడ కూడా డిమాండ్‌ లేకపోవడం, లారీలు దొరక్కపోవడంతో లోడింగ్‌లో జాప్యం జరుగుతోందని ఓ వ్యాపారి తెలిపారు.


1.jpg

ప్రతి ఉల్లిపాయా కొంటాం

కర్నూలు మార్కెట్‌కు తీసుకొచ్చిన ప్రతి ఉల్లిపాయను కొనుగోలు చేస్తాం. రైతులు అధైర్య పడవద్దు. అసత్య ప్రచారాలు నమ్మొ ద్దు. ప్రభు త్వం క్వింటాకు రూ.1,200 మద్దతు ధర ప్రకటించింది. వ్యాపారులు ఎంత ధరకు కొంటారో, ఆపై వ్యాత్యాసం అమౌంట్‌ను బోనస్‌ రూపం లో రైతులు ఖాతాలో జమ చేస్తాం. పంట అమ్మగానే రైతులకు టోకెన్‌ ఇస్తారు. ఆ ప్రకారం బోనస్‌ డబ్బులు ఖాతాలో జమ అవుతాయి.

- పి. రంజిత్‌బాషా, కర్నూలు కలెక్టరు

gn.jpg

రెండు రోజులుగా పడిగాపులు

రెండు ఎకరాల్లో ఉల్లి సాగు చేశా. రూ.1.50 లక్ష లు పెట్టుబడి పెట్టా. వ్యాపారులకు క్వింటా రూ. 550 చొప్పున అమ్మేశాను. ప్రభు త్వం రూ. 1,200కు కొంటుందని చెబితే కర్నూలు మార్కెట్‌కు 50 బస్తాలు శనివారం తీసుకొచ్చా. ఇప్పుడేమో ప్రభుత్వం కొనదు.. బోనస్‌ ఇస్తుందని అన్నారు. రెండు రోజుల నుంచి మార్కెట్‌లోనే ఉన్నాను.

- తిమ్మన్న, ఉల్లి రైతు, దిప్పన గుర్తి గ్రామం, కర్నూలు

Updated Date - Sep 08 , 2025 | 04:11 AM