Share News

Onion Farmers: మార్కెట్‌కు వెళ్లే దారీ లేదు

ABN , Publish Date - Sep 20 , 2025 | 07:28 AM

కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల కన్నీళ్లు ఆగడంలేదు. గిట్టుబాటు ధర లేక నిండా మునిగిన రైతుకు ఇప్పుడు కూలి, రవాణా ఖర్చులు కూడా పెనుభారంగా మారాయి.

Onion Farmers: మార్కెట్‌కు వెళ్లే దారీ లేదు

  • కర్నూలు నగరం బయటే ఉల్లి వాహనాలు

  • కొనసాగుతున్న ఉల్లి రైతుల అవస్థలు

కర్నూలు జిల్లా కోసిగి గ్రామానికి చెందిన ఈ రైతు పేరు హనుమప్ప. ఎకరాకు లక్షకు పైగా పెట్టుబడితో 12 ఎకరాల్లో ఉల్లి సాగుచేశారు. ఇప్పుడు క్వింటా రూ.50-100 కూడా పలకట్లేదు. మార్క్‌ఫెడ్‌ కేంద్రానికి తీసుకెళ్తే ప్రభుత్వ మద్దతు ధర రూ.1,200 చొప్పునైనా వస్తుంది. అయితే, ఉల్లి కోత కూలీ, రవాణా, హమాలీ కలిపి ఎకరాకు రూ.25-30 వేలు ఖర్చు ఎలా భరించాలో తెలీడంలేదు. ఆ బాధలు ఎందుకని.. గత్యంతరం లేక ఇలా పొలంలోనే పంటను వదిలేశామని ఆ రైతు ఏకరువు పెట్టాడు.

కర్నూలు, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల కన్నీళ్లు ఆగడంలేదు. గిట్టుబాటు ధర లేక నిండా మునిగిన రైతుకు ఇప్పుడు కూలి, రవాణా ఖర్చులు కూడా పెనుభారంగా మారాయి. ఉల్లి పంట కోసి మార్కెట్‌కు తరలిద్దామంటే.. గిట్టుబాటు కావడం లేదంటూ కొందరు పొలంలోనే వదిలేస్తున్నారు. మరికొందరు.. ప్రభుత్వం మద్దతు ధర క్వింటా రూ.1,200 అయినా చేతికొస్తుందనే ఆశతో పంటను కర్నూలు మార్కెట్‌కు తీసుకెళ్తుంటే అక్కడ నిల్వ చేసేందుకు చోటు లేదు. ఏపీ మార్క్‌ఫెడ్‌ కొన్న ఉల్లి నిల్వలు పేరుకుపోవడంతో ఉల్లిలోడ్‌తో వచ్చిన వాహనాలను మార్కెట్‌లోకి అనుమతించడం లేదు. పోలీసులు ఉల్లి లోడ్‌ వాహనాలను నగరంలోకి అనుమతించలేదు. కర్నూలు-బళ్లారి వయా కోడుమూరు రహదారిలో ఆపేశారు. ముందుగా వెళ్తే ఉల్లి దించుకోవడానికి ప్లాట్‌ఫాం దొరుకుతుందనే ఆశతో ఉదయం 11 గంటలకే రైతులు వచ్చారు. అయితే మార్కెట్‌లో స్థలం లేదంటూ బయటే ఆపేశారు. ఏ క్షణంలో అనుమతిస్తారో? అంటూ రైతులు, వాహన డ్రైవర్లు రోడ్డుపైనే గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. దగ్గరలో హోటళ్ల కూడా లేక భోజనాలు చేయలేని పరిస్థితి. ఈ విషయాన్ని మార్కెట్‌ యార్డు స్పెషల్‌ గ్రేడ్‌ సెక్రెటరీ జయలక్ష్మి దృష్టికి ‘ఆంధ్రజ్యోతి’ తీసుకెళ్లగా ఏపీ మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసిన 1,800 మెట్రిక్‌ టన్నుల ఉల్లితో మార్కెట్‌ నిండిపోయిందన్నారు. రాత్రి 10 గంటల తరువాత ఉల్లి వాహనాలను మార్కెట్‌లోకి అనుమతిస్తామని చెప్పారు.


రోడ్డుపై నరకం చూస్తున్నాం

రెండెకరాల్లో ఉల్లి సాగు చేస్తే 276 బస్తాలు దిగుబడి వచ్చింది. ప్రభుత్వం రూ.1,200లకు కొనుగోలు చేస్తుండడంతో కొంతైనా ఖర్చులకు వస్తుందని తీసుకొస్తే, మార్కెట్‌లో దించేందుకు స్థలం లేదని పెద్దపాడు రోడ్డుపైనే ఆపేశారు. ఎప్పుడు అనుమతిస్తారో తెలియక రోడ్డుపైనే నిరీక్షించక తప్పలేదు. భోజనం కూడా దొరకలేదు.

- మల్లికార్జున, ఉల్లి రైతు, తిమ్మందొడ్డి,

సి.బెళగల్‌ మండలం, కర్నూలు జిల్లా

Updated Date - Sep 20 , 2025 | 07:30 AM