Onion Farmers: ఉల్లి రైతు బేజారు
ABN , Publish Date - Sep 01 , 2025 | 04:49 AM
ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక రాష్ట్రంలోని ఉల్లిరైతు విలవిలలాడుతున్నాడు. సాధారణంగా అక్టోబరు మాసంలో మార్కెట్‌కు కర్నూలు ఉల్లి రావాల్సి ఉంది. కానీ, ఈ సంవత్సరం ఉల్లిని...
మహారాష్ట్ర ఉల్లికే వ్యాపారుల మొగ్గు
కర్నూలు ఉల్లి కొనేందుకు ముందుకు రాని వైనం
కిలో రూ.5కు అడుగుతున్న వ్యాపారులు
(తాడేపల్లిగూడెం-ఆంధ్రజ్యోతి)
ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక రాష్ట్రంలోని ఉల్లిరైతు విలవిలలాడుతున్నాడు. సాధారణంగా అక్టోబరు మాసంలో మార్కెట్‌కు కర్నూలు ఉల్లి రావాల్సి ఉంది. కానీ, ఈ సంవత్సరం ఉల్లిని ముందుగానే సాగుచే యడంతో జూలైలోనే మార్కెట్‌కు వచ్చేసింది. జూలై, ఆగస్టు నెలల్లో కురిసిన వర్షాలకు 30 శాతం వరకు ఉల్లి దెబ్బతింది. ఎకరాకు రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టి పండించగా.. అమ్ముదామంటే అయినకాడికి అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. పంటను పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మార్కెట్‌కు తీసుకురాగా, కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఉల్లి తీయడానికే ఎకరాకు రూ.15వేలు ఖర్చుచేసినట్లు రైతులు చెబుతున్నారు. వ్యాపారులు క్వింటా రూ.500 నుంచి రూ.600 మధ్య అడుగుతున్నారని వాపోతున్నారు. కనీసం క్వింటా రూ.2వేలకు అమ్మితే లాభాలు లేకపోయిన చేసిన ఖర్చులు వస్తాయని అంటున్నారు. గతేడాదితో పోల్చితే ఉల్లి ధర 10 రెట్లు పడిపోయింది. గతేడాది కర్నూలు ఉల్లి క్వింటా రూ.4500 నుంచి రూ.6000 మధ్య విక్రయించారు. గతేడాది మహారాష్ట్రలో వర్షాలకు అక్కడ ఉల్లి పంట దెబ్బతింది. దీంతో కర్నూలు ఉల్లి హాట్‌కేకులా అమ్ముడుపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కర్నూలు రైతులు ఉల్లి సాగు విస్తీర్ణాన్ని పెంచారు. సుమారు 15వేల హెక్టార్లలో ఉల్లిసాగు చేశారు. దిగుబడి కూడా ఆశాజనకంగా వచ్చింది. ఎకరాకు 50 నుంచి 60 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. పంట చేతికందే సమయంలో వరుణుడు కాటేశాడు. దీంతో నాణ్యత లోపించింది. ఇదే అదనుగా దళారులు సిండికేట్‌గా మారి కర్నూలు ఉల్లిని కొనడం మానేశారు. రైతులు అయినకాడికి అమ్ముకుందామన్నా కొనేవారు లేరు.
మహారాష్ట్ర ఉల్లిని నిలుపుదల చేయాలి
మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లిని ఏపీలోకి రాకుండా చేస్తే కర్నూలు ఉల్లి కొనుగోలుకు వ్యాపారులు ముందుకొస్తారని రైతులు చెబుతున్నారు. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఉల్లి వస్తోంది. అక్కడ కూడా ఉల్లి నిల్వలు పేరుకుపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం విదేశాలకు ఎగుమతులను నిలిపివేయడమేనని చెబుతున్నారు. ఏటా ఆగస్టు నెలాఖరు నాటికి మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతి అయ్యేది కాదు. అదే సమయంలో కర్నూలు ఉల్లి మార్కెట్లోకి వచ్చేసేది. ఈ ఏడాది మహారాష్ట్రలోనూ ఉల్లి సాగు విస్తీర్ణం పెంచడం, దిగుబడులు పెరగడం, ఎగుమతికి అనుమతి ఇవ్వకపోవడం తదితర కారణాలతో నిల్వలు పెరిగాయి. మహారాష్ట్ర ఉల్లికి నాణ్యత ఉండటంతో ఏపీలో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. కర్నూలు ఉల్లికి ఘాటు ఎక్కువగా ఉన్నప్పటికీ వండే సమయంలో ఎరుపురంగు ఉండటం వల్ల దీన్ని కొనుగోలు చేయడానికి ఎక్కువమంది ఇష్టపడటం లేదు.
కర్నూలు టు హైదరాబాద్
కర్నూలు ఉల్లి తాడేపల్లిగూడెం మార్కెట్‌కు రావడం తగ్గింది. తాడేపల్లిగూడెం మార్కెట్‌కు ప్రతిరోజు 50 నుంచి 60 లారీల ఉల్లి కర్నూలు నుంచి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ధర పతనంతో రైతులు రవాణా వ్యయం తక్కువగా ఉండే హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి రోజు 60 నుంచి 100 లారీల వరకు కర్నూలు నుంచి హైదరాబాద్‌కు ఉల్లి లోడ్‌తో వెళ్తున్నాయి. తాడేపల్లిగూడెం మార్కెట్ 10లోపు లారీలు మాత్రమే వస్తున్నాయి. ఆదివారం 6 లారీలు మాత్రమే వచ్చాయి. నాసిరం ఉల్లి క్వింటా రూ.400 నుంచి రూ.600 మధ్య ధర పలికింది. కొద్దిపాటి నాణ్యతతో పొడిగా ఉన్న ఉల్లి మాత్రం రూ.700 నుంచి రూ.900 మధ్య విక్రయాలు జరిగాయి.
నిల్వ ఉండే సామర్థ్యం లేదు
కర్నూలు నుంచి వస్తున్న ఉల్లికి నిల్వ ఉండే సామర్థ్యం లేదు. రెండు రోజులు ఉంచితే బస్తాలో డ్యామేజ్ కనిపిస్తోంది. వర్షాల వల్ల ఈ పరిస్థితి నెలకొంది. నాణ్యత ఉన్న ఉల్లి కొనుగోలుకు చిరువ్యాపారులు ముందుకు వస్తారు. ఆ దిశగా రైతులు ప్రయత్నించాలి.
- కొట్టు అంజిబాబు,
హోల్‌సేల్ ఉల్లి వ్యాపారి, తాడేపల్లిగూడెం
మహారాష్ట్ర ఉల్లికే..
మహారాష్ట్ర ఉల్లి మార్కెట్లో అందుబాటులో ఉంది. నాణ్యత వల్ల దాన్నే ఇక్కడి ప్రజలు ఇష్టపడతారు. కర్నూలు ఉల్లి కూరకు అంతగా బాగుండదని భావిస్తారు. దీనికి తోడు కర్నూలు ఉల్లి తడిసి వేస్టేజ్ ఎక్కువగా వస్తోంది. నిల్వ ఉండటం లేదు.
- యర్రా అయ్యప్ప, రిటైల్ వ్యాపారి, తాడేపల్లిగూడెం