Government Scandal: ఓఎస్డీల ఓవరాక్షన్!
ABN , Publish Date - Apr 15 , 2025 | 03:50 AM
మంత్రుల వద్ద పనిచేస్తున్న ఓఎస్డీలు అవినీతి, అక్రమాలు చేస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని నివేదికలు అందాయి. వీరిని అదుపు చేసే పరిస్థితి లేదని తెలుస్తోంది.

పదిమంది మంత్రుల ఓఎస్డీలపై సీఎంకు ఫిర్యాదుల వెల్లువ
బరి తెగించి దండుకుంటున్నారు.. మంత్రులకూ
వారిపై అదుపు లేదు.. ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదికలు
పార్టీ నాయకుల నుంచీ ఉప్పు.. కొనసాగిస్తే చెడ్డపేరు
తెస్తారని సీఎంకు మొర.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర మంత్రుల వద్ద పనిచేస్తున్న కొంతమంది ఓఎస్డీలు అదుపు తప్పి వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. సీఎం చంద్రబాబు కేబినెట్‌లో మొత్తం 25 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో సుమారు 10 మంత్రుల వద్ద పనిచేస్తున్న ఓఎస్డీలు తమ ఓవరాక్షన్‌తో, అవినీతి, అక్రమాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారంటూ ముఖ్యమంత్రికి పలు నివేదికలు అందినట్టు సమాచారం. ఇప్పటికే మంత్రి కొల్లు రవీంద్ర వద్ద పనిచేస్తున్న ఓఎస్డీని తప్పించిన విషయం తెలిసిందే. అలాగే, ఒక సీనియర్ మంత్రి వద్ద, మరో కీలక మంత్రి వద్ద పనిచేస్తున్న ఓఎస్డీలు కూడా బరితెగించి వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఓఎస్డీల్లో కొందరు హాస్టళ్లలో పిల్లల బువ్వను కూడా వదిలిపెట్టడం లేదని, దేవాలయ ఆస్తులను మింగేస్తున్నారని, అన్నదాతలకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహకాలపై కన్నేసి గడ్డి కరుస్తున్నారని సమాచారం. ఇంకొందరికి అక్రమాలే ఇంధనంగా మారాయని, అవినీతి రోడ్డుపై హైస్పీడ్‌తో దూసుకుపోతున్నారని, ఖనాజాకు చేరాల్సిన నిధులకు మధ్యలోనే గండికొట్టి దోచేస్తున్నారని తెలుస్తోంది. అయితే, వీరిని మంత్రులూ అదుపు చేసే పరిస్థితి కనిపించడం లేదని రాష్ట్ర సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చివరకు జూనియర్ మంత్రుల వద్ద పనిచేస్తున్నవారు కూడా అందినకాడికి దండుకొనే ప్రయత్నాల్లో మునిగిపోయారని చెబుతున్నారు. నికరంగా పదిమంది మంత్రుల ఓఎస్డీలపై ఈ విమర్శలు రావడంతో ప్రభుత్వం కూడా అప్రమత్తం అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు మంత్రుల ఓఎస్డీలకు సంబంధించి ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదికలు అందాయి. ఇవి కాకుండా, పార్టీ వర్గాల నుంచి కూడా ప్రభుత్వానికి ఉప్పందింది. సదరు ఓఎస్డీలను ఇలాగే కొనసాగిస్తే మంత్రులకే కాకుండా ప్రభుత్వానికి కూడా అప్రతిష్ఠ తెచ్చిపెడతారని సీఎం వద్ద ఆ పార్టీ నేతలు మొర పెట్టుకున్నట్టు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Visakhapatnam: మరో 24 గంటల్లో డెలివరీ కానున్న భార్య.. భర్త ఎంత దారుణానికి ఒడికట్టాడో..
PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..