Oil Exploration: ఆయిల్, గ్యాస్ కోసం అన్వేషణ
ABN , Publish Date - Jun 18 , 2025 | 07:07 AM
ఓఎన్‌జీసీ (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్) గుంటూరు జిల్లాలో ఇంధన, గ్యాస్ నిక్షేపాల కోసం అన్వేషణ చేస్తోంది. దీనికోసం జిల్లాలోని పలు మండలాల్లో సర్వే చేపట్టింది.
గుంటూరు జిల్లాలో ఓఎన్‌జీసీ భారీగా డ్రిల్లింగ్
వట్టిచెరుకూరు, ఫిరంగిపురంలో పెద్దఎత్తున శోధన
గుంటూరు, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ఓఎన్‌జీసీ (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్) గుంటూరు జిల్లాలో ఇంధన, గ్యాస్ నిక్షేపాల కోసం అన్వేషణ చేస్తోంది. దీనికోసం జిల్లాలోని పలు మండలాల్లో సర్వే చేపట్టింది. కొన్ని రోజులుగా పొలాల్లో యంత్రాలతో డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పనులు చేపడుతోంది. ఇంధన, గ్యాస్ నిక్షేపాల అన్వేషణలో భాగంగానే తాము ఈ పనులు చేపడుతున్నామని ఆ సంస్థ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఫిరంగిపురం మండలంలోని పొనుగుపాడు, వట్టిచెరుకూరు మండలంలోని పల్లపాడు తదితర గ్రామాల్లో సర్వే కొనసాగుతోంది. గుంటూ రు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలో ఈ అన్వేషణ జరుగుతున్నది. అన్వేషణలో భాగంగా ఏకంగా 24 వేల బోర్లు వేసి ఆయిల్, గ్యాస్ నిక్షేపాల ఉనికి ఉందో, లేదో తేల్చేందుకు ముమ్మరంగా డ్రిల్లింగ్ పనులు చేస్తున్నారు. శాటిలైట్ ఇమేజ్‌ల ఆధారంగానే ఈ బోర్లు వేస్తున్నారు. ఈ సర్వే కోసం మొత్తం రూ. 13.44 కోట్లు వెచ్చిస్తున్నట్టు అధికారులు తెలిపారు. తడ నుంచి ఇచ్ఛాపురం వరకు జోన్లుగా విభజించి అన్వేషణ సాగిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఓఎన్‌జీసీ నిర్ణయించింది. అందులో భాగంగా ఆయిల్, గ్యాస్ నిక్షేపాలను గుర్తించి గ్యాస్ పంపిణీ సామర్థ్యాన్ని పెంచేందుకు మినీ లిక్విఫయింగ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) ప్లాంట్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది.