Share News

Governor Abdul Nazeer: ఒక్క ఆలోచనతో అద్భుతమైన జీవితం

ABN , Publish Date - Nov 13 , 2025 | 04:48 AM

స్వామి వివేకానంద స్ఫూర్తితో యువతరం ఉన్నతంగా ఆలోచించాలి. ఒక్క ఆలోచనతో జీవితాలను అద్భుతంగా మార్చుకోవచ్చు. ఆ ఆలోచనే కలగా మార్చుకోవాలి.

 Governor Abdul Nazeer: ఒక్క ఆలోచనతో అద్భుతమైన జీవితం

  • 2047 నాటికి వికసిత్‌ భారత్‌ ఆశయంతో ముందడుగు

  • దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి: గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

  • ఘనంగా రాయలసీమ వర్సిటీ స్నాతకోత్సవం

కర్నూలు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ‘స్వామి వివేకానంద స్ఫూర్తితో యువతరం ఉన్నతంగా ఆలోచించాలి. ఒక్క ఆలోచనతో జీవితాలను అద్భుతంగా మార్చుకోవచ్చు. ఆ ఆలోచనే కలగా మార్చుకోవాలి. కలను సాకారం చేసుకునేందుకు పరితపించాలి. అప్పుడే విజయానికి మార్గం సుగుమం అవుతుంది’ అని రాష్ట్ర గవర్నర్‌, రాయలసీమ వర్సిటీ చాన్స్‌లర్‌ అబ్దుల్‌ నజీర్‌ పిలుపునిచ్చారు. కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిఽథిగా హాజరైన గవర్నర్‌ వివిధ విభాగాల్లో రాణించిన విద్యార్థులకు బంగారు పతకాలు, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ‘నాణ్యమైన విద్యా బోధన, పరిశోధనలు, సృజనాత్మకత ఆవిష్కరణ, జాతీయ సమైక్యత సాధించడం, మానవీయ, ప్రగతిశీల సమాజ నిర్మాణం కోసం విశ్వవిద్యాలయం కృషి చేస్తుందని ఆశిస్తున్నాను. ఉన్నత విద్యను యువత పెట్టుబడిగా మార్చుకోవాలి. ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) యుగం నడుస్తోంది. ఆ మార్గాల్లో కొత్త అవకాశాలు సృష్టించుకోవాలి’ అని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ చెప్పినట్లు భారతదేశం అమృత కాలం దిశగా వేగంగా అడుగులు వేస్తోందన్నారు. 2047 నాటికి దేశం ‘వికసిత్‌ భారత్‌’గా అభివృద్ధి చెందిన దేశంగా, వికసిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలనే లక్ష్యం పెట్టుకున్నామని, ఆ దిశగా యువత ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని దిశానిర్దేశం చేశారు.

Updated Date - Nov 13 , 2025 | 04:52 AM