Share News

లక్ష క్యూబిక్‌ మీటర్లు తవ్వేశారు!

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:31 AM

కొత్తూరు తాడేపల్లిలో మైనింగ్‌ మాఫియా కొత్తరకం మోసానికి తెరతీసింది. కలెక్టర్‌కు నివేదించిన ఎన్‌వోసీలను అనుమతి పత్రాలుగా భ్రమింపజేసి లక్ష క్యూబిక్‌ మీటర్ల మేర మట్టి, గ్రావెల్‌ తవ్వుకుపోయింది. అడ్డుకోవాల్సిన అధికారులు అంతా అయిపోయిన తర్వాత అక్కడ తవ్వకాలకు అనుమతి లేదని నిర్ధారించడం వారి పనితీరుకు అద్దం పడుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అక్రమార్కులు రెచ్చిపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

లక్ష క్యూబిక్‌ మీటర్లు తవ్వేశారు!

- కొత్తూరు తాడేపల్లిలో మైనింగ్‌ మాఫియా దారుణం

- మొత్తంగా 5.83 ఎకరాల్లో 1.17 లక్షల క్యూబిక్‌ మీటర్ల ప్రకృతి సంపద తరలింపు

- అనుమతులు లేకపోయినా ఉన్నట్టుగా చూపిన అక్రమార్కులు

- కలెక్టర్‌కు నివేదించిన ఎన్‌ వోసీలను సంపాదించి.. అవే అనుమతులుగా భ్రమింపజేసి..

- బాధ్యులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన జిల్లా యంత్రాంగం

కొత్తూరు తాడేపల్లిలో మైనింగ్‌ మాఫియా కొత్తరకం మోసానికి తెరతీసింది. కలెక్టర్‌కు నివేదించిన ఎన్‌వోసీలను అనుమతి పత్రాలుగా భ్రమింపజేసి లక్ష క్యూబిక్‌ మీటర్ల మేర మట్టి, గ్రావెల్‌ తవ్వుకుపోయింది. అడ్డుకోవాల్సిన అధికారులు అంతా అయిపోయిన తర్వాత అక్కడ తవ్వకాలకు అనుమతి లేదని నిర్ధారించడం వారి పనితీరుకు అద్దం పడుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అక్రమార్కులు రెచ్చిపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

గత వైసీపీ ప్రభుత్వంలో రెచ్చిపోయిన అక్రమార్కులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా అనుమతులు లేకుండా 1,17,128.91 క్యూబిక్‌ మీటర్ల మేర గ్రావెల్‌/మట్టి తవ్వుకుపోయారు. విజయవాడ రూరల్‌ మండలం కొత్తూరు తాడేపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో లక్ష క్యూబిక్‌ మీటర్లకు పైగా మట్టి తవ్వుకుపోయాక కానీ అధికారులు వీటికి అనుమతులు లేవని తేల్చలేదు. మరి ఇన్నాళ్లూ అనుమతులు లేకుండా తవ్వుకుపోతుంటే అధికారులు ఏం చేస్తున్నారు అన్నదానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా గుట్టుగా కొత్తూరు తాడేపల్లిలో అక్రమ తవ్వకాలు జరిగాయి. ఒక వైపు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ మైనింగ్‌పై కూటమి ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశిస్తే.. మరో వైపు భయం అనేది లేకుండా మైనింగ్‌ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కొత్తూరు తాడేపల్లిలో అనుమతులే లేకుండా కేవలం ఎన్‌వోసీలను అడ్డం పెట్టుకుని స్థానిక ప్రజలను మభ్యపెట్టి లక్షలాది క్యూబిక్‌ మీటర్ల మేర మైనింగ్‌ జరిపారని నిగ్గు తేలటంతో సంచలనంగా మారింది. అక్రమ తవ్వకాలు నిజమేనని తేలడంతో ఇప్పుడు జిల్లా యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. ఇన్నాళ్లూ సంబంధిత శాఖలు జిల్లా యంత్రాంగాన్ని తప్పుదారి పట్టించడం గమనార్హం.

కొత్తూరు, తాడేపల్లిలో అడ్డగోలుగా తవ్వేశారిలా..

- కొత్తూరు తాడేపల్లి పరిధిలో సర్వే నంబర్‌ 247/3 ఏ1లో ఉన్న సందిపాము ఏసుపాదం పట్టా భూమి 1.51 ఎకరం ఉంటే 1.29 ఎకరంలో అక్రమంగా 13,010.385 క్యూబిక్‌ మీటర్ల మేర తవ్వేశారు.

- సర్వే నంబర్‌ 247/3ఏ2లో ఉన్న సందిపాము ఏసుపాదం పట్టా భూమి 0.47 సెంట్లు ఉంటే 0.40 సెంట్లలో 4,801.05 క్యూబిక్‌ మీటర్ల మేర అక్రమంగా తవ్వకాలు జరిపారు.

- సర్వే నంబర్‌ 247/3ఏ3లో ఉన్న సందిపాము ఏసుపాదం పట్టా భూమి 0.25 సెంట్లు ఉంటే 0.24 సెంట్లలో అక్రమంగా 1,798.620 క్యూబిక్‌ మీటర్ల మేర తవ్వేశారు.

- సర్వే నంబర్‌ 247/3బీలో ఉన్న సందిపాము ఏసుపాదం పట్టాభూమి 2.60 ఎకరాల్లో 1.60 ఎకరాల్లో అక్రమంగా 11,980.290 మీటర్ల మేర తవ్వకాలు జరిపారు.

- సర్వే నంబర్‌ 248లో అనుభవదారుగా ఉన్న కొంచా వెంకయ్యకు చెందిన 10.06 ఎకరాల భూమిలో 4.02 ఎకరాల్లో అక్రమంగా 85,538.564 క్యూబిక్‌ మీటర్ల మేర తవ్వేశారు.

గ్రామస్తుల ఫిర్యాదుతో వెలుగులోకి..

పై సర్వే నంబర్లలో గ్రావెల్‌, మట్టి తవ్వుకోవటానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఇవ్వలేదన్న విషయాన్ని షోకాజు నోటీసుల్లో కూడా పొందుపరిచారు. అవి ఫారెస్టు భూములు అవునో కాదో తెలియజేయడంతో పాటు ఆ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం, మైనింగ్‌, రెవెన్యూ శాఖల నుంచి నిరభ్యంతర పత్రాలు (ఎన్‌వోసీ) మాత్రమే ఇచ్చారు. అది కూడా జిల్లా యంత్రాంగానికి సమాచారం నిమిత్తం తెలపటం జరిగింది. ఎక్కడా అక్రమార్కులకు ఈ ఎన్‌వోసీలు ఇవ్వలేదు. కానీ అక్రమార్కులు ఆయా శాఖలలోని అవినీతి ఉద్యోగులను పట్టుకుని వాటిని సంపాదించారు. స్థానికంగా గ్రామస్తులకు ఇవే చూపించి అనుమతులుగా భ్రమింపజేశారు. దీంతో అనుమతులు ఉన్నాయనుకుని గ్రామస్తులు పట్టించుకోలేదు. ఆ తర్వాత అనుమానం వచ్చి కలెక్టర్‌కు గ్రామస్తులు ఫిర్యాదు చేస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ అధికారులు కొద్ది కాలం కిందట అక్రమాలను నిగ్గుతేల్చారు.

నోటీసులు జారీ

మొత్తం 5.83 ఎకరాల పరిధిలో అక్రమ తవ్వకాలు జరిగినట్టుగా నిర్ధారణ కావటంతో బాఽధ్యులైన వారికి జిల్లా యంత్రాంగం నోటీసులు జారీ చేసింది. విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టు సంస్థతో పాటు కృష్ణలంకకు చెందిన జానీబాషా, వాసా నాగరాజు, పోతురాజు మాధవరావులకు నోటీసులు ఇచ్చి, 15 రోజుల లోపు వివరణ ఇవ్వాల్సిందిగా నిర్దేశించింది.

Updated Date - Mar 11 , 2025 | 12:31 AM