నూరు శాతం వారికే..
ABN , Publish Date - May 22 , 2025 | 11:23 PM
సి.క్యాంపు రైతు బజార్‌లో ఇక నుంచి ఎవరు పడితే వారు అమ్మకాలు జరిపే అవకాశముండదు.
రైతులు, పొదుపు మహిళలు, దివ్యాంగులకు చోటు
ఫ ఒత్తిళ్లు, సిఫారసులకు అవకాశముండదు
ఫ ఊపిరి పీల్చుకుంటున్న అధికారులు, సిబ్బంది
ఫ రూ.6కోట్ల విస్తరణ పనులు
ఫ సకాలంలో పూర్తిచేయాలని ఆదేశం
ఫ పని కోల్పోయిన రెండు నష్టపరిహారం మంజూరు
ఫ హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
సి.క్యాంపు రైతు బజార్‌లో ఇక నుంచి ఎవరు పడితే వారు అమ్మకాలు జరిపే అవకాశముండదు. నిజమైన రైతులు, పొదుపులక్ష్మి మహిళలు, దివ్యాంగులు మాత్రమే వ్యాపారాలు కొనసాగిస్తారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, సిఫారసులు ఇక చెల్లవు. దీంతో రైతు బజారు అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకుంటున్నారు. ఏదిఏమైనా సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన అనంతరం సి.క్యాంపు రైతుబజారుకు మహర్దశ పట్టిందని చెప్పవచ్చు. ఓ వైపు విస్తరణ పనులు.. మరో వైపు రైతులకే ప్రాధాన్యంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రూ.6కోట్లు మంజూరు చేస్తూ విస్తరణ పనులు లక్ష్యం మేరకు సకాలంలో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. దీంతో అధికారులు రైతుబజార్ పక్కనున్న శిథిలావస్థలో ఉన్న పది బిల్డింగ్‌లను కూల్చివేశారు. చకచకా పనులు చేపడుతున్నారు. రాష్ట్రంలోనే సి.క్యాంపు రైతుబజార్‌ను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.
కర్నూలు అగ్రికల్చర్, మే 22 (ఆంధ్రజ్యోతి): రైతుబజారులో నూరు శాతం రైతులు, పొదుపులక్ష్మి గ్రూపుల మహిళలు దివ్యాంగులకే కూరగాయలు, పండ్లు అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు రైతుబజారు అధికారులు, సిబ్బంది తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, సిఫారసులకు ఇక ఛాన్స లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈనెల 17న ‘స్వచ్ఛాంధ-స్వర్ణాంధ్ర’లో భాగంగా సి.క్యాంపు రైతుబజారులో పర్యటించారు. రూ.6కోట్లు మంజూరు చేస్తూ విస్తరణ పనులు లక్ష్యం మేరకు సకాలంలో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
పది బిల్డింగ్‌లను కూల్చివేయడంతో పాటు..
రెండు రోజుల క్రితం సి.క్యాంపు రైతుబజారు పక్కనే ఉన్న శిథిలావస్థకు చేరిన 10బిల్డింగ్‌లను కూల్చివేయడంతో పాటు ప్లాట్‌పారాలు, ప్రహరీ తదితర పనులన్నీ పూర్తిచేసేందుకు ఎస్టీమేట్లు తయారుచేసి మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఆమో దానికి పంపారు. ఈవిషయాన్ని బుధవారం మార్కెటింగ్ శాఖ డీఈ రఘునాథ రెడ్డి తెలిపారు. మరోవైపు సీఎం పర్యటన సందర్బంగా మరమ్మతుల పనులు పూర్తిచేసేందుకు అని సి.క్యాంపు రైతుబజారులో కూరగాయలు అమ్ముకుంటున్న రైతులు, పొదుపులక్ష్మి మహిళలకు రెండు రోజులు తాత్కాలిక విరామాన్ని ప్రక టించారు. రెండు రోజులు ఉపాధి కోల్పోయిన వారికి నష్టపరిహారాన్ని అందిం చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని ఎస్టేట్ అధికారి కళ్యాణమ్మ, హరీష్‌కుమార్ తెలిపారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు అందుబాటులో తెస్తాం...
రైతుబజారులో చేపట్టాల్సిన పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తెస్తామని డీఈ రఘునాథరెడ్డి తెలిపారు. విస్తరణ తర్వాత ఇక ఎటువంటి రద్దీ ఉండదని, ఇంకా చాలామంది రైతులకు, పొదుపులక్ష్మి గ్రూపుల మహిళలకు వితంతువులకు, కూరగాయలు అమ్ముకునేందుకు అవకాశం కల్పించ బడుతుందన్నారు. సీ.క్యాంపు రైతుబజారు విస్తరణతో పాటు తొందరలోనే కల్లూరులోని గోవర్దనగిరి రైతుబజారున ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటు న్నట్లు తెలిపారు. రైతులు తాము పండించిన కూరగాయలు, పండ్లను దళారులతో అమ్మి నష్టపోకుండా ఆయా గ్రామాలకు వెళ్లి రైతులకు అవగాహన కల్పిస్తున్నా మని, రైతుబజార్లలోనే పంట ఉత్పత్తులు అమ్ముకుంటే మంచి ధర లభిస్తుందని హార్టికల్చర్ అసిస్టెంట్ శివకుమార్ తెలిపారు.
మా జీవితాల్లో వెలుగు
సి.క్యాంపు రైతుబజారు మా జీవితాల్లో వెలుగు నింపింది. ఎప్పటి నుంచో ఇక్కడ పొలంలో పండించిన కూరగాయలు, మామిడి, జామ తదితర పండ్లను తీసుకువచ్చి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాం. రైతుబజారును విస్తరిస్తే మరింత మందికి జీవనోపాధి లభిస్తుంది.
గోపాల్, రైతు, నాయకల్లు
ఒత్తిళ్లు తగ్గిపోయాయి
సీఎం చంద్రబాబు రైతుబజారుకు వచ్చి వెళ్లిన తర్వాత నిజమైన రైతులు, పొదుపులక్ష్మి గ్రూపుల మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు మాత్రమే కూరగాయలు, పండ్లు అమ్ముకునే అవకాశం దక్కింది. గతంలో మాదిరిగా రాజకీయ నాయకులు తమపై ఒత్తిళ్లు, సిపారసులు చేయడం లేదు.
కళ్యాణమ్మ, ఎస్టేట్ అధికారి, సి.క్యాంపు రైతుబజార్
ఉత్తమ రైతుబజార్‌గా తీర్చిదిద్దే అవకాశం
రాష్ట్రంలోనే ఉత్తమ రైతుబజార్‌గా సి.క్యాంపు రైతుబజారును తీర్చిదిద్దే అవకాశం ఏర్పడింది. గ్రామాలకు వెళ్లి కూరగాయలు, పండ్లు పండిస్తున్న రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. కల్లూరులో గోవర్దనగిరి రైతుబజారు కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది.
- శివకుమార్, హార్టికల్చర్ అసిస్టెంట్,