AC Coaches on Fire: మంటల్లో బోగీలు
ABN , Publish Date - Dec 30 , 2025 | 05:15 AM
విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మంటల్లో చిక్కుకుంది....
టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్‌ప్రె్‌సలోని 2 ఏసీ కోచ్‌లు బుగ్గి.. ఒకరి మృతి
ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన
బీ1లో పొగలు, వేగంగా అలుముకున్న మంటలు.. ఎం2కూ అవి విస్తరణ
ప్రమాదాన్ని మొదట్లోనే గుర్తించి రైలు నిలిపివేత
దీంతో తప్పిన పెనుప్రమాదం
మృతుని బ్యాగులో 5.8 లక్షల నగదు, బంగారం
నగదులో సగం కాలిబూడిద
ఎలమంచిలి, సామర్లకోట, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో రెండు ఏసీ బోగీలు పూర్తిగా కాలిపోగా, ఒకరు సజీవ దహనమయ్యారు. ఆ బోగీల లోపలి భాగంలో ఇనుప ఊచలు మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే ప్రమాదాన్ని వెంటనే గుర్తించి రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు మరో ఐదు నిమిషాల్లో అనకాపల్లి జిల్లా ఎలమంచిలి స్టేషన్‌కు చేరుకుంటుందనగా, బీ1 కోచ్‌లో మంటలు రేగాయి. అవి వేగంగా ఎం2 కోచ్‌కు వ్యాపించాయి. అయితే, పొగలు కమ్ముకోవడాన్ని గుర్తించిన లోకో పైలట్లు రైలును ఎలమంచిలి రైల్వే స్టేషన్‌లోనిలిపివేశారు. అప్పటికే అప్రమత్తమైన ప్రయాణికులంతా రైలు ఆగిన వెంటనే బోగీల నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఎలమంచిలికి ముందు 5 కిమీ దూరంలో బీ1 కోచ్ బ్రేకులు పట్టేయడంతో (బ్రేక్ బైండింగ్) తొలుత పొగ వచ్చిందని, తర్వాత మంటలు చెలరేగాయని ప్రయాణికులు తెలిపినట్టు అధికారులు చెబుతున్నారు. బీ1 కోచ్‌లో 76 మంది, ఎం2 కోచ్‌లో 82 మంది ప్రయాణం చేస్తున్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఎలమంచిలి, అనకాపల్లి కేంద్రాల నుంచి 4 అగ్నిమాపక శకటాలు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాయి. మూడున్నర గంటలు శ్రమించి మంటలను అదుపు చేశాయి. ప్రమాదం జరిగిన రెండు బోగీల్లోనూ సామగ్రి చెల్లాచెదురుగా పడ్డాయి.
రైళ్ల రాకపోకలకు అంతరాయం
ఈ ప్రమాదంతో రైళ్లరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు విశాఖ నుంచి ఇటు విజయవాడ నుంచి సామర్లకోటకు చేరాల్సిన పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు గంటలు ఆలస్యంగా చేరుకున్నాయి. పూరీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్, హౌరా-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్, విశాఖ-లింగంపల్లి ఎక్స్‌ప్రెస్ రెండున్నర గంటలు ఆలస్యంగా ప్రయాణించాయి. ప్రయాణికులకు రైళ్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజెప్పేందుకు సామర్లకోట స్టేషన్‌లో హెల్ప్‌లైన్ ఏర్పాటుచేశారు. రైల్వే శాఖ డీఐజీ సత్యయేసుబాబు, అనకాపల్లి ఎస్పీ తుహిన్‌సిన్హా, రైల్వే ఎస్పీ షణ్ముఖ వడివేలు, అనకాపల్లి కలెక్టరు విజయ కృష్ణన్, రైల్వే సాంకేతిక సిబ్బంది, విద్యుత్ తదితర విభాగాల అధికారులు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్‌ఎం మోహిత్ సోనంక్య, సీఆర్‌ఎస్ చైర్మన్ మాధవి ఘటనా స్థలం వద్దనే ఉండి సహాయ చర్యలు పర్యవేక్షించారు. దెబ్బతిన్న రెండు బోగీలను కట్ చేసి, మిగిలిన బోగీలతో రైలును సామర్లకోట రైల్వేస్టేషన్‌కు సోమవారం ఉదయం 9గంటలకు తీసుకొచ్చారు. ఆ రెండు బోగీల్లోని 158 మందిని ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల్లో సామర్లకోట తరలించారు. అక్కడ ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌కు రెండు బోగీలను కొత్తగా తగిలించి.. వారిని ఎక్కించారు. వారిని తీసుకుని ఉదయం 11 గంటలకు సామర్లకోట నుంచి రైలు తిరిగి బయలుదేరింది.
ఏమిటీ బ్రేక్ బైండింగ్?
రైలు వేగం తగ్గించాలన్నా, ఆపాలన్నా లోకోపైలట్ బ్రేకు వేసినప్పుడు అది ప్రతి కోచ్ కింద ఉన్న అన్ని చక్రాలనూ ఆపుతుంది. ఆ క్రమంలో ఒక్కోసారి బ్రేక్‌పై బుష్ సరిగ్గా అప్లయ్ కాకపోతే రాపిడి ఏర్పడి పొగ వస్తుంది. బ్రేక్ రిలీజ్ చేసిన తర్వాత ఒక్కోసారి బుష్ చక్రం నుంచి వెనక్కి రాకుండా అతుక్కుని ఉండిపోతుంది. అది గమనించకుండా రైలును ముందుకు నడిపితే రాపిడి మరింత పెరిగి మంటలు వస్తాయి. అది ఎక్కువగా ఉంటే యాక్సిల్ బాక్స్‌లో ఉండే గ్రీజ్ కాలిపోతుంది. దీనినే రైల్వే పరిభాషలో ‘బ్రేక్ బైండింగ్’ అని అంటారు. ఇలా తరచూ జరుగుతూనే ఉంటుంది. కాకపోతే మంటలు ఏర్పడి కోచ్‌లు కాలిపోయే స్థాయిలో ప్రమాదం జరగడం చాలా అరుదు. బీ-1కోచ్‌లో బ్రేక్ బైండింగ్ జరిగిందని అధికారులు భావిస్తున్నారు. అయితే బ్రేకులు ఎందుకు పట్టేశాయనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

బోగీలో వస్త్ర వ్యాపారి మృతదేహం
ప్రమాదం ముందు వరకు కుమార్తెతో ఫోన్‌లో సంభాషణ
ప్రయాణికులంతా సురక్షింగా ఉన్నారనుకుంటున్న సమయంలో.. విశాఖ నుంచి ఓ మహిళ వచ్చారు. అదే రైలులోని బీ 1 కోచ్‌లో తన తండ్రి ప్రయాణిస్తున్నారని అధికారులకు ఆమె తెలిపారు. ప్రమాదం జరగడానికి ముందు కూడా తన తండ్రి తనతో మాట్లాడారని, ఆ తర్వాత ఫోన్ పని చేయలేదని తెలిపారు. ఆమె ఇచ్చిన వివరాలతో అధికారులు క్షుణ్ణంగా పరిశీలించగా, బీ 1 కోచ్‌లో ఓ మృతదేహం కనిపించింది. బెర్త్ పైనే మంటల్లో చిక్కుకుని ఆయన సజీవదహనం అయ్యాడు. ఆయనను విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70)గా గుర్తించారు. అది తన తండ్రి మృతదేహమేనని ఆమె ధ్రువీకరించారు. సుందర్ వద్ద గల బ్యాగులో రూ. 5.80 లక్షల నగదు, కొంత బంగారం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. నగదులో సగం కాలిపోయింది. సుందర్ వస్త్ర వ్యాపారం చేస్తుంటారని బంధువులు తెలిపారు.
ఎనిమిది గంటలపాటు టెన్షన్..
మంటల్లో చిక్కుకున్నది మొదలు సామర్లకోట స్టేషన్‌లో రైలు తిరిగి బయలుదేరేవరకూ సుమారు 8 గంటల పాటు ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ అమలకంటి శ్రీనివాసరావు సౌజన్యంతో మూడు రకాల అల్పాహారం, 250 వాటర్‌బాటిళ్లను సిబ్బంది ప్రయాణికులకు అందించారు. ఈ సందర్భంగా ప్రమాద సమయంలో ఏం జరిగిందనేది తమ అనుభవాలను కొందరు ప్రయాణికులు పంచుకున్నారు.

ఊపిరి తీసుకోవడం కష్టమైంది
‘‘నేను అనకాపల్లిలో ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ బీ1 బోగీలో ఎక్కాను. నేను టాయ్‌లెట్‌కు వెళ్లి బయటకు వచ్చిన సమయంలో బోగీలో పొగలు రావడం గమనించాను. ఆ వెంటనే మంటలు వ్యాపించాయి. నేను, మరికొందరం కలిసి నిద్రలో ఉన్న సహ ప్రయాణికులను అప్రమత్తం చేశాం. రైలును ఆపేందుకు చైన్ లాగగా, ఎలమంచిలి స్టేషన్‌లో రైలు నిలిచిపోయింది. ప్రయాణికులు లగేజీలను వదిలిపెట్టి కిందికి దిగడంతో ప్రాణాపాయం తప్పింది. మంటలు ఎగిసి పడడంతో పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొగలు వ్యాపించాయి. మేం ఊపిరి పీల్చుకునేందుకు చాలాసేపు ఇబ్బందిపడ్డాం.’’
- నాగేంద్ర, బీ 1 కోచ్ ప్రయాణికుడు

టాయ్‌లెట్స్ పక్కన బెడ్‌రోల్స్ వద్ద మంటలు
‘‘నేను ప్రయాణిస్తున్న బోగీలో టాయ్‌లెట్స్ సమీపాన బెడ్‌రోల్స్ నుంచి మంటలు, దట్టమైన పొగలు వస్తుండడాన్ని గుర్తించాం. అయితే మంటలు ఎలా ప్రారంభమయ్యాయో తెలియదు.’’
- లాల్‌భయ్యా, పట్నా, బీ 1 కోచ్ ప్రయాణికుడు