Share News

ప్రతిపాదనలతోనే సరి..

ABN , Publish Date - Nov 20 , 2025 | 12:49 AM

మెడికల్‌ కళాశాల వద్ద రైల్వేట్రాక్‌పై ఫ్లైఓవర్‌ నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. రూ.25 కోట్ల నిర్మాణ వ్యయంతో పంపించిన ఫైల్‌ ముందుకు కదలడంలేదు. దీంతో వైద్య కళాశాలలో అత్యవసర సేవలు ప్రారంభానికి నోచుకోలేదు. విద్యార్థులు సైతం కళాశాలకు వెళ్లేందుకు రైల్వే ట్రాక్‌ దాటాల్సిన పరిస్థితి నెలకొంది.

ప్రతిపాదనలతోనే సరి..

- మెడిక ల్‌ కళాశాల వద్ద రైల్వేట్రాక్‌పై ఫ్లైఓవర్‌ నిర్మాణానికి గ్రహణం

- రూ.25 కోట్లతో మూడేళ్ల క్రితం ప్రతిపాదనలు

- కళాశాలకు వెళ్లాలంటే విద్యార్థులు రైల్వే ట్రాక్‌ దాటాల్సిందే..

-ప్లైఓవర్‌ నిర్మాణం తర్వాతే మెడికల్‌ కళాశాలలో అత్యవసర వైద్యసేవలు

మెడికల్‌ కళాశాల వద్ద రైల్వేట్రాక్‌పై ఫ్లైఓవర్‌ నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. రూ.25 కోట్ల నిర్మాణ వ్యయంతో పంపించిన ఫైల్‌ ముందుకు కదలడంలేదు. దీంతో వైద్య కళాశాలలో అత్యవసర సేవలు ప్రారంభానికి నోచుకోలేదు. విద్యార్థులు సైతం కళాశాలకు వెళ్లేందుకు రైల్వే ట్రాక్‌ దాటాల్సిన పరిస్థితి నెలకొంది.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

మచిలీపట్నం మెడికల్‌ కళాశాలను సమస్యలు వెంటాడుతున్నాయి. మూడేళ్ల క్రితం 150 మంది విద్యార్థులతో ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఎంబీబీఎస్‌ కోర్సుకు సంబంధించి మూడో సంవత్సరం తరగతులు రెండు నెలల క్రితం ప్రారంభమయ్యాయి. రూ.550 కోట్ల అంచనాలతో నిర్మాణం చేస్తున్న మెడికల్‌ కళాశాల పనులు 60 శాతం మేర పూర్తయ్యాయి. మెడికల్‌ కళాశాలలో ఇప్పటికే వైద్యసేవలు ప్రారంభం కావాల్సి ఉన్నా ప్రారంభించలేదు. మచిలీపట్నంలోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి సర్వజన ఆసుపత్రిగా పేరు మార్చి మెడికల్‌ కళా శాలగా చూపుతున్నారు.

ప్రధాన అడ్డంకిగా రైల్వేట్రాక్‌!

మచిలీపట్నం మెడికల్‌ కళాశాలకు వెళ్లాలంటే రైల్వే ట్రాక్‌ను దాటాలి. కళాశాలకు 700 మీటర్ల దూరంలోనే రైల్వేట్రాక్‌ ఉంది. ప్రతి రోజు పదికిపైగా రైళ్లు ఈ మార్గం గుండా రాకపోకలు సాగిస్తున్నాయి. రైలు వచ్చిన సమయంలో గేటు పడితే కనీసంగా పది నిమిషాలు రాకపోకలు నిలిచిపోతాయి. ఈ నేపథ్యంలో మెడికల్‌ కళాశాలకు వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా రైల్వేట్రాక్‌పై ఫ్లైఓవర్‌ నిర్మాణానికి రూ.25 కోట్లు కేటాయిస్తున్నట్లు 2022, మేలో మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించేందుకు వచ్చిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. రైల్వేట్రాక్‌పై ఫ్లైఓవర్‌ నిర్మాణం చేయాలంటే రైల్వేశాఖ అధికారులు అనుమతులు ఇచ్చి వారి పర్యవేక్షణలోనే నిర్మాణం జరగాలని మెడికల్‌ కళాశాల అధికారులు చెబుతున్నారు. అయితే ఇంతవరకు రైల్వేశాఖ అధికారులు ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలన చేసిన దాఖలాలే లేవు. భూమిని సర్వే చేసి విడగొట్టిందిలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద రైల్వేట్రాక్‌పై ఫ్లైఓవర్‌ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నా అవి కాగితాలకే పరిమితమయ్యాయి.

వైద్య సేవలు ఎప్పటినుంచో?

ప్రస్తుతం మెడికల్‌ కళాశాలలో 150 మంది విద్యార్థులు ఎంబీబీఎస్‌ కోర్సు మూడో సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. మెడికల్‌ కళాశాలలో అత్యవసర వైద్యసేవలు ఇప్పటికే ప్రారంభించాల్సి ఉంది. మెడికల్‌ కళాశాలలో ఇన్‌పేషెంట్‌, అవుట్‌ పేషెంట్లకు వైద్య సేవలు అందించేందుకు భవనాలు సిద్ధం కాకపోవడంతో వైద్యసేవలు ప్రారంభించలేదు. వచ్చే ఏడాది నాటికి ఈ భవనాలు అందుబాటులోకి వస్తే ఇక్కడే అత్యవసర వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. అత్యవసర వైద్యసేవలు పొందేవారు మెడికల్‌ కళాశాలకు వచ్చే సమయంలో రైల్వేట్రాక్‌ వద్ద గేటు పడితే వారి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. రైల్వేట్రాక్‌పై ఫ్లైఓవర్‌ నిర్మాణం జరిగే వరకు ప్రసూతి, గుండె జబ్బులు, ఇతర అత్యవసర వైద్యసేవలు మెడికల్‌ కళాశాలలో ప్రారంభించే అవకాశం లేదని వైద్యాధికారులు చెబుతున్నారు.

Updated Date - Nov 20 , 2025 | 12:49 AM