Oil Palm Cultivation: ఆయిల్‌పామ్‌కు ప్రోత్సాహం
ABN , Publish Date - Dec 22 , 2025 | 06:04 AM
కోవిడ్ తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో పామాయిల్‌కు డిమాండ్ పెరిగింది. దేశంలో జరుగుతున్న ఆయిల్‌పామ్ సాగులో దాదాపు 50 శాతం వరకు మన రాష్ట్రంలోనే జరుగుతోంది.
రైతులకు మరిన్ని రాయితీలు
సాగు పెంపే కూటమి ప్రభుత్వ లక్ష్యం
అంతర పంటలతో అదనపు ఆదాయం
వందశాతం రాయితీతో మొక్కలు సరఫరా
నీటి పారుదల, సస్య రక్షణ చర్యలకూ సాయం
రైతులు వినియోగించుకోవాలి ఉద్యానశాఖ డైరెక్టర్
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
కోవిడ్ తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో పామాయిల్‌కు డిమాండ్ పెరిగింది. దేశంలో జరుగుతున్న ఆయిల్‌పామ్ సాగులో దాదాపు 50 శాతం వరకు మన రాష్ట్రంలోనే జరుగుతోంది. దేశంలో ఐదు లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్ పండిస్తుంటే.. రాష్ట్రంలో దాదాపు రెండున్నర లక్షల హెక్టార్లలో సాగులో ఉంది. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగును మరింత ప్రోత్సహించడానికి ఉద్యాన శాఖ ద్వారా కూటమి ప్రభుత్వం రైతులకు మరిన్ని రాయితీలు అందిస్తోంది. ఈ ఏడాది అదనంగా 50 లక్షల హెక్టార్లను ఆయిల్‌పామ్ సాగులోకి తేవాలన్న లక్ష్యంలో 38,661 హెక్టార్ల భూమిని గుర్తించారు. ఇందులో ఇప్పటికే 21,127 మంది రైతులు 20,797 హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగును విస్తరించారు. రాష్ట్రవాటాతో కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రైతులకు ప్రభుత్వం వంద శాతం రాయితీతో ఆయిల్‌పామ్ మొక్కలు సరఫరా చేస్తోంది. ఇండోనేషియా, చైనా, మలేషియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆయిల్‌పామ్ మొలకలను ఏడాదిన్నర పాటు నర్సరీల్లో పెంచి ఇస్తున్నారు. హెక్టారుకు దిగుమతి రకం మొలకలకు రూ.29వేలు, స్వదేశీ మొలకలకు రూ.20వేలు ప్రభుత్వం రాయితీ భరిస్తున్నది. ఆయిల్‌పామ్ తోటలకు నీటి పారుదల సౌకర్యాల కోసం బోర్‌వెల్‌కు రూ.25వేలు, మోటారుకు రూ.10వేలు అందిస్తోంది. పంట కోత కార్యకలాపాల సమయంలో విద్యుత్ సమస్యను అధిగమించేందుకు రూ.2,500 రాయితీతో ఇన్సులేటెడ్ పాలిమర్ గ్రిప్ హార్వెస్టింగ్ పోల్స్‌ను, లోతట్టు పొలాల్లో ఎలుకల నుంచి పంటను రక్షించడానికి వైర్ మెష్ కంపోనెంట్‌కు హెక్టారుకు రూ.20వేలు అందిస్తోంది. రాష్ట్రంలోని 24 జిల్లాలు, 373 మండలాల్లో 1.97 లక్షల మంది రైతులు 2.49 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. దీని ద్వారా హెక్టారుకు 19.81 టన్నుల తాజా పండ్ల గెలలు ఉత్పత్తి అవుతున్నాయి.
ఆయిల్‌పామ్ తోటల్లో 77,516 హెక్టార్లలో పసుపు, అల్లం, మొక్కజొన్న, మిర్చి, వివిధ రకాల కూరగాయలు అంతర పంటలుగా పండిస్తున్నారు. వీటితో పాటు అరటి, కోకో, జాజి, మిరియాలు, అరికెలు తదితరాలు మరో లక్ష హెక్టార్లలో అంతర పంటలుగా పండించే అవకాశం ఉందని ఉద్యానశాఖ అధికారులు చెప్తున్నారు. దీనిపై ఇప్పటికే చేసిన ప్రయోగాలు మంచి ఫలితాలివ్వడంతో ఈ దిశగా రైతుల్ని ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలో 24 కంపెనీలు ఆయిల్ పామ్ అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నాయి. గంటకు 721 టన్నుల సామర్థ్యం గల 15 ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 30 ఆయిల్‌పామ్ నర్సరీలను నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లా పెదవేగిలో ఏపీ ఆయిల్‌ఫెడ్ నిర్వహణలోని ఆయిల్‌పామ్ మిల్లులో 2024-25 (చమురు సంవత్సరం)లో తాజా పండ్ల గెలలు టన్నుకు సగటు ధర రూ.19,540 లభించింది. గత నవంబరులో గరిష్ఠంగా రూ.20,240 పలికింది. ఈ నేపథ్యంలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లు రాష్ట్ర ఉద్యానశాఖ డైరెక్టర్ కె.శ్రీనివాసులు తెలిపారు. రాయితీ పథకాలను వినియోగించుకుని, ఆయిల్‌పామ్ తోటల పెంపకంతోపాటు అంతరపంటలను సాగు చేసుకుని, అదనపు ఆదాయం పొందవచ్చని చెప్పారు. అవకాశం ఉన్న రైతులు ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి సారించాలని సూచించారు.