Share News

Krishna District: కృష్ణా జిల్లాలో చమురు, గ్యాస్‌ అన్వేషణ

ABN , Publish Date - Dec 27 , 2025 | 04:22 AM

కృష్ణా జిల్లాలో చమురు, గ్యాస్‌ నిక్షేపాల అన్వేషణ జరుగనుంది. 20 చమురు, గ్యాస్‌ బావులు తవ్వేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముంబైకి చెందిన వేదాంత లిమిటెడ్‌(కెయిర్న్స్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ డివిజన్‌)కు...

Krishna District: కృష్ణా జిల్లాలో చమురు, గ్యాస్‌ అన్వేషణ

  • 20 బావుల తవ్వకానికి వేదాంత సంస్థకు షరతులతో అనుమతి

అమరావతి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లాలో చమురు, గ్యాస్‌ నిక్షేపాల అన్వేషణ జరుగనుంది. 20 చమురు, గ్యాస్‌ బావులు తవ్వేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముంబైకి చెందిన వేదాంత లిమిటెడ్‌(కెయిర్న్స్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ డివిజన్‌)కు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. డిస్కవర్డ్‌ స్మాల్‌ ఫీల్డ్‌ (డీఎ్‌సఎఫ్‌-2018) విధానం కింద ఆన్‌షోర్‌ ఆయిల్‌/గ్యాస్‌ క్షేత్రం అభివృద్ధి పనులు తమకు దక్కాయని.. కృష్ణా బ్లాక్‌లో 35 చోట్ల తవ్వకాలకు ఎన్‌వోసీ ఇవ్వాలని, ఈ బ్లాక్‌ గుండానే బందరు కాలువ ప్రవహిస్తోందని వేదాంత కోరింది. దీనిని పరిశీలించిన ప్రభుత్వం.. 20 చోట్ల తవ్వకాలకు ఎన్‌వోసీ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఇరిగేషన్‌ ఈఎన్‌సీ, కృష్ణా డెల్టా సిస్టమ్‌ చీఫ్‌ ఇంజనీర్‌, కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఇది ఇరిగేషన్‌కు సంబంధించిన ఎన్‌వోసీ మాత్రమేనని.. పైగా తాత్కాలికమని.. తవ్వకాలు ప్రారంభించే ముందు సంబంధిత ఇతర శాఖల నుంచి సదరు సంస్థే అనుమతులు తీసుకోవాలని స్పష్టంచేసింది. అలాగే వేదాంత సంస్థ బందర్‌ కెనాల్‌ నుంచి గానీ, కృష్ణా డెల్టా సిస్టమ్‌ కెనాల్‌ నెట్‌వర్క్‌, డ్రైనేజీ నెట్‌వర్క్‌, చెరువులు, జలాశయాలు, ఇతర నీటి వనరుల నుంచి గానీ నీరు తీసుకోవడానికి వీల్లేదని షరతు విధించింది. వేదాంత లిమిటెడ్‌కు చెందిన కెయిర్న్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ డివిజన్‌.. దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు ఆయిల్‌-గ్యాస్‌ అన్వేషణ-ఉత్పత్తి కంపెనీ. భారత ముడిచమురు ఉత్పత్తిలో దానికి 25 శాతం వాటా ఉంది. ఈ భాగస్వామ్యాన్ని 50 శాతానికి పెంచుకోవాలని భావిస్తోంది.

Updated Date - Dec 27 , 2025 | 04:23 AM