Share News

అమ్మో.. ఆయన!

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:36 AM

ఆయన ఓ జిల్లా స్థాయి అధికారి.. ఆయనకు మండలాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు అంటే చిన్నచూపు.. ఎక్కడ కాలు పెడితే అక్కడ వివాదాలమయం. నోటికొచ్చినట్టు మాట్లాడి అవమానించడం ఆయనకు పరిపాటి. ఇలా పలు అవినీతి, ఇతర గొడవల్లో చిక్కుకోవడంతో ఆయన్ను వైసీపీ హయాంలో అధికారులు, పాలకులు ప్రాధాన్యతలేని పోస్టులోకి సాగనంపారు. పక్క జిల్లాకు బదిలీ కూడా చేశారు. అయితే తనదైన శైలిలో పైరవీలు నడిపి జిల్లాలోని ఓ నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిగా వచ్చి విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. వీటిని భరించలేక స్థానిక ఉద్యోగులు, అధికారులు టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడి సాయంతో ఇటీవల కలెక్టర్‌ వద్ద తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రత్యేక అధికారి మాకొద్దు అంటూ వేడుకున్నారు.

అమ్మో.. ఆయన!

-నియోజకవర్గ ప్రత్యేక అధికారిపై తీవ్ర ఆరోపణలు

- జిల్లా స్థాయి విధులు గాలికి వదిలేసి..

- నియోజకవర్గంలోనే ఎక్కువగా మకాం

- సమావేశాలకు పిలిచి అధికారులు, సిబ్బందిపై దూషణలు

- అవినీతి వ్యవహారాలు, వివిధ వివాదాల్లో హస్తం

- ఈ ప్రత్యేక అధికారి మాకొద్దు అంటూ కలెక్టర్‌కు ఉద్యోగుల వేడుకోలు

ఆయన ఓ జిల్లా స్థాయి అధికారి.. ఆయనకు మండలాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు అంటే చిన్నచూపు.. ఎక్కడ కాలు పెడితే అక్కడ వివాదాలమయం. నోటికొచ్చినట్టు మాట్లాడి అవమానించడం ఆయనకు పరిపాటి. ఇలా పలు అవినీతి, ఇతర గొడవల్లో చిక్కుకోవడంతో ఆయన్ను వైసీపీ హయాంలో అధికారులు, పాలకులు ప్రాధాన్యతలేని పోస్టులోకి సాగనంపారు. పక్క జిల్లాకు బదిలీ కూడా చేశారు. అయితే తనదైన శైలిలో పైరవీలు నడిపి జిల్లాలోని ఓ నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిగా వచ్చి విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. వీటిని భరించలేక స్థానిక ఉద్యోగులు, అధికారులు టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడి సాయంతో ఇటీవల కలెక్టర్‌ వద్ద తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రత్యేక అధికారి మాకొద్దు అంటూ వేడుకున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

జిల్లాలోని ఓ శాఖకు ఆయన కీలక అధికారి. ఈయన వ్యవహారశైలితో తోటి అధికారులు, ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడేశారు. కనీస గౌరవం కూడా లేకుండా మాట్లాడటం, అవినీతి ఆరోపణలు ఆయన్ను చుట్టుముట్టాయి. దీంతో విసిగిపోయిన ఉన్నతాధికారులు, పాలకులు ఈయనపై బదిలీ వేటు వేశారు. పక్క జిల్లాలో ప్రాధాన్యత లేని విభాగానికి పంపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. అయితే తన పరిచయాలను ఊపయోగించుకుని ఐదు నెలల క్రితం కూటమి ప్రజాప్రతినిధుల సాయంతో మళ్లీ బదిలీపై వచ్చాడు. జిల్లాలో సౌమ్యుడిగా పేరొందిన ఒక ఎమ్మెల్యేను బ్రతిమిలాడుకుని ఆ నియోజకవర్గం ప్రత్యేక అధికారిగా నియమితులయ్యాడు. అప్పటి వరకు అతి వినయం ప్రదర్శించాడు. ఆ తర్వాత నుంచి తన అసలు రూపాన్ని బయటపెడుతున్నాడని నియోజకవర్గంలోని అన్ని మండలాల అధికారులు, సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు.

జిల్లా స్థాయి విధులు వదిలేసి..

జిల్లాస్థాయి విధులు వదిలేసి వారంలో నాలుగు రోజులపాటు నియోజకవర్గంలోనే ఉంటున్నాడు. తరచూ అధికారులు, సచివాలయ సిబ్బందితో సమావేశాలు నిర్వహిస్తున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. సమావేశాల్లో స్వామిత్వ సర్వే, ఇంటి పన్నుల వసూలు, వివిధ అభివృద్ధి పనులు చేయడంలో వెనకబడిపోయారని మండల స్థాయి అధికారులు, సిబ్బందిని చులకనగా మాట్లాడి అవమాన పరుస్తున్నాడని అధికారులు, సిబ్బంది వాపోతున్నారు. నేను చెప్పినట్లుగా చేయకుంటే నియోజకవర్గం నుంచి బదిలీ చేయిస్తానని, తనకు సర్వాధికారాలు ఉన్నాయని బెదిరిస్తున్నట్టు ఆరోపిస్తున్నారు. సదరు అధికారి తీరుతో మహిళా ఉద్యోగులు మనస్తాపానికి గురవుతున్నట్టు సమాచారం. గ్రామాల్లో పనిచేస్తున్న సచివాలయ సిబ్బందిని మరింతగా బెదిరిస్తున్నాడని ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ఈ అధికారి జిల్లాలో పనిచేస్తున్నా స్థానికంగా నివాసం ఉండరు. గుంటూరు జిల్లా నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. గుంటూరు జిల్లాకు ఈ నియోజకవర్గం పక్కనే ఉండటంతో నేరుగా నియోజకవర్గంలోనే మకాం వేస్తున్నారు.

టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడి వద్ద ఉద్యోగుల ఆవేదన

ఈ అధికారి వేధింపులు భరించలేని అధికారులు, సిబ్బంది టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడి వద్దకు వెళ్లి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనఈ అంశంపై నేరుగా కలెక్టర్‌తో మాట్లాడారు. సదరు అధికారి పనితీరు, ఉద్యోగులు, అధికారులను వేధిస్తున్న విధానాన్ని వివరించినట్లు విశ్వసనీయ సమాచారం.

నమ్మి బాధ్యతలు అప్పగిస్తే..

శాసన సభ్యుడు ఈ అధికారిని నమ్మి నిమోజకవర్గ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు అప్పగిస్తే, ఈయన మాత్రం నియోజకవర్గంలో పనిచేసే ఉద్యోగులను తీవ్ర ఇక్కట్లపాలు చేయడం ఎంత వరకు సమంజసమని ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ఈ ప్రత్యేక అధికారికి అన్ని వసతులు, ఏర్పాట్లు సమకూర్చాల్సిందేనని, ఎక్కడ చిన్నపాటి లోటు జరిగినా, ఆ లోటు సరిచేసేంత వరకు తనదైనశైలిలో శివాలెత్తిపోతున్నాడని వాపోతున్నారు. ఈ అంశంపై కలెక్టర్‌ దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని నియోజవర్గంలో పనిచేసే ఉద్యోగులు, అధికారులు కోరుతున్నారు.

Updated Date - Dec 16 , 2025 | 12:36 AM