అందాలలో అహో మహోదయం..
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:58 PM
‘అందాలలో అహో మహోదయం.. భూలోకమే నవోదయం..’
ఊటీని తలపిస్తున్న నల్లమల
కేజీ రోడ్డుపై కనువిందు చేస్తున్న ప్రకృతి సోయగం
ఆహ్లాదాన్ని పంచుతున్న రోళ్లపెంట ఘాట్
సెల్ఫీలతో సందడి చేస్తున్న పర్యాటకులు
‘అందాలలో అహో మహోదయం.. భూలోకమే నవోదయం..’ అంటూ సాగిన సినీ గేయం మాదిరి నల్లమల అందాలను ప్రకృతి ప్రేమికులను కట్టి పడేస్తున్నాయి. ఊటీని తలపిం చేలా నల్లమల కొండలు కనువిందు చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో కొన్నిరోజులుగా నల్లమల అటవీ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వానలు తగ్గినప్పటికీ ఆకాశంలోని మేఘాలు సైతం నల్లమల కొండల అంచుల్ని తాకుతూ.. నిరంతరం మంచు కురిసినట్లు అనుభూతిని ఇస్తున్నాయి. ప్రత్యేకించి రోళ్లపెంట ఘాట్ వద్ద వున్న కొంత ప్రాంతాల్లో మంచు తరహాలో చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో నల్లమలలోని కొండలన్నీ మంచుతో కప్పబడినట్లు దర్శనమిస్తున్నాయి. ఊటీ మాదిరిగా రోళ్లపెంట ఘాట్ ఉండటంతో కర్నూలు-గుంటూరు జాతీయ రహదారి మీదుగా వెళ్లే ప్రయాణికులు, వాహన చోదకులు అక్కడ వాహనాలను నిలుపుకొని నల్లమల అందాలను వీక్షిస్తున్నారు. అక్కడే కాసేపు సేదతీరి సెల్ఫీలతో సందడిగా చేస్తున్నారు. కేజీరోడ్డుకు ఇరువైపుల ఉండే పచ్చదనం ప్రకృతే ఆహ్వానం పలుకుతున్నట్లుగా అద్భుతంగా కనిపిస్తోంది.
- ఆత్మకూరు, ఆంధ్రజ్యోతి