Share News

అమ్మో జూన్‌!

ABN , Publish Date - Jun 02 , 2025 | 01:31 AM

జూన్‌ రావడంతో ప్రతి ఇంట్లోను చిన్నారుల నుంచి ఇవే డైలాగ్‌లు వినిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో 2025-26 విద్యాసంవత్సరం ప్రారంభం కాబోతోంది. కొన్ని ప్రైవేటు పాఠశాలలు సోమవారం నుంచి తరగతులు ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు ఈ నెల 12వ తేదీ నుంచి తలుపులు తెరుచుకోబోతున్నాయి. ప్రస్తుతం ప్రైవేటు, కార్పొరేట్‌, ప్రభుత్వ విద్యాసంస్థలు అడ్మిషన్లను పెంచుకోవడానికి వీధుల్లో ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. విద్యాసంవత్సరం కొద్దిరోజుల్లో ప్రారంభమవుతుండడంతో ప్రతి ఇంట్లోను జూన్‌ బడ్జెట్‌ కేటాయింపులు మొదలయ్యాయి. కుటుంబ నిర్వహణ ఖర్చులు, పిల్లల చదువులకు ఫీజులు, కొత్తగా విద్యాసంస్థల్లో చేర్చాలంటే డొనేషన్లు, పుస్తకాల కొనుగోళ్లు ఇలా ఒక్కోదానికి ఎంతెంత వెచ్చించాలన్న కేటాయింపులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలు జూన్‌ నెల వస్తుందంటే బెంబేలెత్తిపోతున్నాయి.

అమ్మో జూన్‌!

వణికిపోతున్న పేద, మధ్యతరగతి వర్గాలు

విద్యాసంస్థల్లో అడ్మిషన్ల ఫీజుల భారం

కొత్త విద్యాసంవత్సరంలో నయా నిర్ణయాలు

యూనిఫాం, షూ, బెల్టుల ఖర్చులు

కొత్త పుస్తకాలు.. కొత్త ధరల మోత

వేతనంలో సగం విద్యకే కేటాయింపు

- నాన్న.. పుస్తకాల బ్యాగ్‌ చిరిగిపోయింది. కొన్ని రోజుల్లో బడులు తెరుస్తారు. కొత్త బ్యాగ్‌ కొనాలి.

- అమ్మా... టిఫిన్‌ బాక్స్‌ తీసుకెళ్లే బ్యాగ్‌ పాడైపోయింది. కొత్త బ్యాగ్‌ కొనమని డాడీకి చెప్పు.

- డాడీ... షూ సైజు సరిపోవడం లేదు. కొత్త షూ కొనాలి.

జూన్‌ రావడంతో ప్రతి ఇంట్లోను చిన్నారుల నుంచి ఇవే డైలాగ్‌లు వినిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో 2025-26 విద్యాసంవత్సరం ప్రారంభం కాబోతోంది. కొన్ని ప్రైవేటు పాఠశాలలు సోమవారం నుంచి తరగతులు ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు ఈ నెల 12వ తేదీ నుంచి తలుపులు తెరుచుకోబోతున్నాయి. ప్రస్తుతం ప్రైవేటు, కార్పొరేట్‌, ప్రభుత్వ విద్యాసంస్థలు అడ్మిషన్లను పెంచుకోవడానికి వీధుల్లో ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. విద్యాసంవత్సరం కొద్దిరోజుల్లో ప్రారంభమవుతుండడంతో ప్రతి ఇంట్లోను జూన్‌ బడ్జెట్‌ కేటాయింపులు మొదలయ్యాయి. కుటుంబ నిర్వహణ ఖర్చులు, పిల్లల చదువులకు ఫీజులు, కొత్తగా విద్యాసంస్థల్లో చేర్చాలంటే డొనేషన్లు, పుస్తకాల కొనుగోళ్లు ఇలా ఒక్కోదానికి ఎంతెంత వెచ్చించాలన్న కేటాయింపులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలు జూన్‌ నెల వస్తుందంటే బెంబేలెత్తిపోతున్నాయి.

(ఆంధ్రజ్యోతి - విజయవాడ):

పేద, మధ్య తరగతి వర్గాల్లో ఎక్కువ మంది ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల వైపు చూస్తున్నారు. ఇక్కడ చదివిస్తే పిల్లలు ఉత్తములుగా ఉంటారని భావిస్తున్నారు. ఆదాయం అటుఇటుగా ఉన్నా ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థల్లోనే పిల్లలను చేర్చించడానికి సిద్ధమవుతున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు ఎల్‌కేజీకి రూ.40 వేలు ఫీజును వసూలు చేస్తున్నాయి. ఇది కాకుండా పుస్తకాలకు రూ.7వేలు. యూనిఫారానికి రూ.3 వేల నుంచి రూ.4వేలు, అడ్మిషన్‌ ఫీజును రూ.3 వేల నుంచి రూ.5వేలుగా నిర్ణయించారు. ఇలా తరగతి పెరిగే కొద్దీ ఫీజులను పెంచుతున్నారు. ఒకరిని ఎల్‌కేజీలో చేర్పించాలంటే తల్లిదండ్రులు రూ.40వేలు చేత్తో పట్టుకోవాల్సిందే. ఎందుకంటే మొత్తం ఫీజులో సగాన్ని అడ్మిషన్‌ తీసుకున్న రోజు చెల్లించాలని యాజమాన్యాలు షరతులు విధిస్తున్నాయి. ఇది కాకుండా మరో రూ.13 వేల నుంచి 15వేలు అదనంగా పట్టుకోవాలి. ఫీజుతోపాటు పుస్తకాలు, యూనిఫాం, అడ్మిషన్‌ ఫీజులను వెంటనే చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా ఒక పిల్లాడిని ఎల్‌కేజీలో చేర్పించడానికి రూ.40వేలు సిద్ధంగా ఉంచుకోవాలి. అదే ఇద్దరు పిల్లలను చేర్పించాలంటే సుమారుగా రూ.లక్షను పట్టుకోవాలి. పాఠశాల స్థాయిలో ఇబ్బందులు ఇలా ఉంటే ప్రొఫెషనల్‌ కోర్సులు, ఇంటర్మీడియట్‌ చదివే వారు ఉన్న కుటుంబాల్లో పరిస్థితి మరోలా ఉంటుంది. పదో తరగతి పూర్తి చేసుకున్న పిల్లలను ఇంటర్మీడియట్‌లో చేర్పించడానికి తల్లిదండ్రులు రూ.లక్షను సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కోర్సులో ఉన్న అదనపు కోచింగ్‌లను బట్టి ఈ ధర మరింతగా పెరుగుతుంది. విద్యాసంవత్సరం ఆరంభమైన ప్రతి ఏడాది పేద, మధ్యతరగతి వర్గాలు బడ్జెట్‌ కేటాయింపుల కోసం అల్లాడిపోతున్నాయి.

పుస్తకాల ధరలు కొంత మేలు

కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో విద్యార్థులకు మొత్తం పుస్తకాలను యాజమాన్యాలే ఇస్తాయి. ప్రభుత్వ, ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు నోట్‌ పుస్తకాలను బయట కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక్కో సబ్జెక్టుకు కనీసం రెండు రకాల నోట్‌ పుస్తకాలను కొనుగోలు చేయాలి. విద్యా సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని బుక్‌ స్టాల్స్‌లోకి నోట్‌ పుస్తకాల స్టాక్‌ చేరుతోంది. గడచిన ఏడాది కంటే ఈ ఏడాది నోట్‌ పుస్తకాల ధరలు విద్యార్థుల తల్లిదండ్రులకు కొంత ఊరటను ఇవ్వబోతున్నాయి. గడచిన ఏడాది 200 పేజీల తెల్లకాగితాలు, రూల్‌ పుస్తకం ఒక్కొక్కటి రూ.35లకు విక్రయించారు. ఈ ఏడాది ఈ పుస్తకం ధరను రూ.30లుగా నిర్ణయించారు. గడచిన ఏడాది కాగితం ఎగుమతి కారణంగా పుస్తకాల ధరలు ఎక్కువగా ఉన్నాయని బుక్‌స్టాల్స్‌ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఏడాది కాగితం ఎగుమతులను నిలిపేయడంతో పుస్తకాల ధరలు తగ్గుముఖం పట్టాయని స్పష్టం చేస్తున్నారు. పుస్తకాల బ్యాగ్‌లు, టిఫిన్‌ బాక్స్‌ బ్యాగ్‌ల ధరలు మాత్రం యధావిధిగానే ఉన్నాయి. పుస్తకాల బ్యాగ్‌ ధర రూ.150 నుంచి రూ.400 వరకు పలుకుతోంది. టిఫిన్‌ బాక్స్‌ బ్యాగ్‌ ధర రూ.100 నుంచి రూ.200 వరకు ఉంది.

Updated Date - Jun 02 , 2025 | 01:31 AM