అమ్మో ‘అద్దేపల్లి’!
ABN , Publish Date - Oct 15 , 2025 | 01:09 AM
చూడడానికి సైలెంట్‌గా కనిపిస్తాడు. ఆలోచనలు మాత్రం చాలా వైలెంట్‌గా ఉంటాయి. ప్రతి ఆలోచనలోనూ నేరపూరిత పొరలు ఉంటాయి. రాజకీయంగా అధికార, ప్రతిపక్ష భేదాలు ఉన్నప్పటికీ ఆయన విషయంలో మాత్రం అంతా స్వపక్షమే. ఆయన చేసే కార్యకలాపాలు ఏమిటో స్పష్టంగా తెలిసినా అన్ని పార్టీల నేతలు కాసులతో కళ్లు మూసుకున్నారు. ఇదీ నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు లీలలు. ఆయన గురించి ఆరా తీసే కొద్దీ కొత్తకొత్త విషయాలు బయటకు వస్తున్నాయి.
- విద్యార్థి దశ నుంచి నేరపూరిత ఆలోచనలు
- అన్నదమ్ములిద్దరిదీ ఒకే తీరు
- తాతయ్య పేరుతో మద్యం వ్యాపారం
- ఇబ్రహీంపట్నంలో అన్ని పార్టీల నేతలతో సంబంధాలు
- ఏఎన్‌ఆర్ బార్‌కు స్థలం ఇప్పించిన టీడీపీ నేత
- ఆ ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు
- కేసుల నుంచి తప్పించుకునేందుకు రాజకీయ భాగస్వామ్యం
- జనార్దనరావుతో మద్యం వ్యాపారం చేసిన జోగి సోదరుడు
చూడడానికి సైలెంట్‌గా కనిపిస్తాడు. ఆలోచనలు మాత్రం చాలా వైలెంట్‌గా ఉంటాయి. ప్రతి ఆలోచనలోనూ నేరపూరిత పొరలు ఉంటాయి. రాజకీయంగా అధికార, ప్రతిపక్ష భేదాలు ఉన్నప్పటికీ ఆయన విషయంలో మాత్రం అంతా స్వపక్షమే. ఆయన చేసే కార్యకలాపాలు ఏమిటో స్పష్టంగా తెలిసినా అన్ని పార్టీల నేతలు కాసులతో కళ్లు మూసుకున్నారు. ఇదీ నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు లీలలు. ఆయన గురించి ఆరా తీసే కొద్దీ కొత్తకొత్త విషయాలు బయటకు వస్తున్నాయి.
ఆంధ్రజ్యోతి-విజయవాడ:
అదేపల్లి జనార్దనరావు మంచి విలాసపురుషుడు. ఆయనను చూసి తన సోదరుడు జగన్మోహనరావు అదే బాటలో పయనించాడు. ఇద్దరూ కలిసి ఒకే మార్గంలో వెళ్తున్నారు. జనార్దనరావు తండ్రి కిరాణా వ్యాపారం చేసి కూడగట్టిన ఆస్తులను విలాసాల కోసం అన్నదమ్ములు ఇద్దరూ హారతికర్పూరంలా కరిగించేశారు. ఇలా ఒక్కో ప్రాంతంలో ఉన్న ఆస్తులు, భూములను విక్రయించేయడంతో చిన్నాన్నలతో ఉమ్మడిగా ఉన్న ఆస్తులను అమ్మడానికి వారు అడ్డుకట్ట వేశారు. కొంతకాలంగా అన్నదమ్ములిద్దరూ తమ ఆస్తిని పంచాలని చిన్నాన్నలపై ఒత్తిడి చేస్తున్నారు. జనార్దనరావు, జగన్మోహనరావు ప్రవర్తన గురించి తెలిసిన చిన్నాన్నలు ఆస్తిని పంచడానికి అంగీకరించలేదు. ఇంజనీరింగ్ విద్యాభ్యాసం నుంచే జనార్దనరావు ఆలోచనలు నేరపూరితంగా ఉండేవని చిన్ననాటి స్నేహితులు చెబుతున్నారు. సమాజంలో ప్రముఖులుగా ఎదిగిన వారిని స్ఫూర్తిగా తీసుకుని ఆ స్థాయికి వెళ్లాలని భావించేవాడు. నిజాయితీగా వ్యాపారాలు చేసి ఆ స్థాయికి వెళ్లలేమని జనార్దనరావు గమనించాడు. అడ్డదారులు తొక్కితేనే ఉన్నత స్థితికి చేరుకుంటామనుకున్నాడు. ఇంజనీరింగ్ నుంచి జనార్దనరావుకు విలాసవంతంగా గడపం అలవాటుగా మారింది. విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయడం ఆయనకు చాలా ఇష్టం. జనార్దనరావు తరచూ ఆఫ్రికా దేశాలకు వెళ్తుండేవాడని స్థానికులు చెబుతున్నారు. అక్కడ తనకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేసేవాడు.
తాతయ్య జ్ఞాపకార్థం
అద్దేపల్లి జనార్దనరావు తన తాతయ్య పేరు మీద మద్యం వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. తాతయ్య అద్దేపల్లి నాగేశ్వరరావు (ఏఎన్‌ఆర్) పేరుతో బార్‌ను ఏర్పాటు చేశాడు. మద్యం వ్యాపారంలోకి దిగినప్పటి నుంచి ఈ పేరుతోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. తొలుత జాతీయ రహదారి పక్కన ఈ బార్‌ను నెలకొల్పాడు. ఈ బార్‌ను జాతీయ రహదారికి పక్కన ఏర్పాటు చేయడానికి టీడీపీకి చెందిన ఓ నాయకుడు సహకరించినట్టు స్థానికులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో బార్‌ను ఇక్కడి నుంచి తొలగించినా స్థలాన్ని మాత్రం జనార్దనరావు ఉపయోగించుకుంటున్నాడు. ఈ స్థలానికి సమీపంలో టీడీపీ నేత ఇల్లు ఉందని సమాచారం. ఈ స్థలంలోనే జనార్దనరావు నకలీ మద్యం తయారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. జనార్దనరావు చేసే నకిలీ వ్యాపారానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసుకోవడానికి రాజకీయ సంబంధాలను కొనసాగించాడు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలతో అంటకాగేవాడు. ఇందులో భాగంగానే 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇబ్రహీంపట్నంలోని ఆ పార్టీ నేతలకు దగ్గరగా ఉండేవాడు. 2019 నుంచి 2023 వరకు వైసీపీ నేతలకు దగ్గరగా ఉన్నాడు. అద్దేపల్లి జనార్దనరావు బార్ ముసుగులో ఏ వ్యాపారం చేస్తున్నాడన్న విషయం ఇబ్రహీంపట్నంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలకు బాగా తెలుసు. ఏ నాయకుడు ఆరోపణ, విమర్శ చేయడానికి వీలు లేకుండా ఆ నేతలకు చేయాల్సిన ఏర్పాట్లు చేసేవాడు. ఏఎన్‌ఆర్ బార్‌కు స్థలం ఇప్పించిన నేతతో జనార్దనరావుకు ఇప్పటికీ సత్సంబంధాలు, ఆర్థిక సంబంధాలు ఉన్నాయని స్థానికులు బహిరంగంగా చెబుతున్నారు. వైసీపీ హయాంలో బార్‌ను దక్కించుకున్న జనార్దనరావు తెలంగాణలో వ్యాపారం చేయడానికి అన్ని రాజకీయ పార్టీల నేతలను ఇందులో భాగస్వాములను చేశాడు. ఇందులో భాగంగానే మాజీ మంత్రి జోగి రమేశ్ సోదరుడి బార్‌లో చాలాకాలం భాగస్వామిగా ఉన్నాడు.
జనార్దనరావు జోగి మెట్లు ఎక్కాడా?
అద్దేపల్లి జనార్దనరావు.. మాజీ మంత్రి జోగి రమేశ్‌కు సంబంధించిన మరిన్ని అంశాలు నెమ్మదిగా బయటకు వస్తున్నాయి. జోగి రమేశ్ ఆధ్వర్యంలోనే తాము నకిలీ మద్యం తయారు చేసినట్టు జనార్దనరావు వీడియోలు విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా వారిద్దరికీ మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ బయటకు వచ్చింది. కాల్ మీ అని జోగి రమేశ్ జనార్థనరావుకు సందేశం పంపాడు. దానికి ఆయన ఓకే.. అని తిరుగు సమాధానం ఇచ్చాడు. తర్వాత కమ్ టు మై హోం అని జోగి నుంచి సందేశం వచ్చింది. దీని ప్రకారం జనార్దనరావు ఆయన ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చాటింగ్ జరిగిన తేదీని బట్టి జోగి రమేశ్ ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు సేకరిస్తున్నారు.