Share News

Health Department Tenders: అంతా మా ఇష్టం..

ABN , Publish Date - Jul 31 , 2025 | 05:41 AM

ఆస్పత్రుల్లో శానిటేషన్‌ పనులు నిర్వహించేందుకు పిలిచిన టెండర్ల వ్యవహారంలో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Health Department Tenders: అంతా మా ఇష్టం..

  • ఆరోగ్యశాఖ టెండర్లలో అధికారుల ఇష్టారాజ్యం

  • ప్రసన్నం చేసుకున్న కంపెనీలకే అర్హత

  • అన్ని అర్హతలున్న కంపెనీలు డిస్‌క్వాలిఫై గతంలో సజ్జల ఆప్తుడికి సెక్యూరిటీ టెండర్లు

  • ఇప్పుడు శానిటేషన్‌ టెండర్లు కట్టబెట్టేలా స్కెచ్‌

  • రఘురామ ఫిర్యాదు చేసిన కంపెనీకి ఓకే

  • జగన్‌ కోటరీకే టెండర్లు కట్టబెడుతున్న వైనం

నీకు అన్ని అర్హతలు ఉన్నాయా.. నువ్వు పనికిరావు. నీకు అనుభవం ఉందా.. నీకు చాన్సేలేదు. నువ్వు జగన్‌ మనిషివా.. అయితే ఓకే. నిబంధనలు మాకు పట్టవు. మా టెండర్లు, మా ఇష్టం. టెండర్లలో పాల్గొంటేనే సరిపోదు. మమ్మల్ని ప్రసన్నం చేసుకోవడానికి ముడుపులతో మెప్పించాలి. అప్పుడే అర్హత కల్పిస్తాం. ఇదీ ఆరోగ్యశాఖ టెండర్ల వ్యవహారంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు.

అమరావతి, జూలై 30(ఆంధ్రజ్యోతి): ఆస్పత్రుల్లో శానిటేషన్‌ పనులు నిర్వహించేందుకు పిలిచిన టెండర్ల వ్యవహారంలో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని అర్హతలున్న కంపెనీలను ఉద్దేశ పూర్వకంగా డిస్‌క్వాలిఫై చేసి, అర్హత లేని కంపెనీలనే క్వాలిఫై చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. శానిటేషన్‌ పనుల కోసం ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు మే నెలలో ఆరు జోన్లకు టెండర్లు ఆహ్వానించారు. ఈ టెండర్‌ ప్రక్రియలో మొత్తంగా 13 కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. చివరికి వారం క్రితం.. అంటే టెండర్లు పిలిచిన రెండు నెలల తర్వాత టెక్నికల్‌ బిడ్లు తెరిచారు. టెక్నికల్‌ బిడ్‌లలో ఏడు కంపెనీలకు అర్హత కల్పించి, ఆరు కంపెనీలను డిస్‌క్వాలిఫై చేశారు. ముడుపులు మొత్తం అందిన తర్వాత టెక్నికల్‌ బిడ్లు తెరిచారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే ఆరోగ్య శాఖలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.


ఆ అధికారిని ఎందుకు తప్పించారో?

మొదటి నుంచి టెండర్ల ప్రక్రియను పర్యవేక్షిస్తున్న కీలక అధికారిని అకస్మాత్తుగా ఆ పని నుంచి తొలగించారు. ఉద్దేశ పూర్వకంగా కొన్ని కంపెనీలకు టెండర్లు కట్టబెట్టేందుకే ఇలా ఇష్టారాజ్యంగా మార్పు లు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండి, ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో శానిటేషన్‌ పనులు చేస్తున్న కంపెనీలను అధికారులు డిస్‌క్వాలిఫై చేశారు. అధికారులు క్వాలిఫై చేసిన కంపెనీల్లో నాలుగింటిపై తీవ్ర ఆరోపణలున్నాయి. ఇందులో ఒక కంపెనీ సజ్జలకు అత్యంత ఆప్తుడైన వ్యక్తిది కావడం గమనార్హం. అలానే వైసీపీ ప్రభుత్వంలో ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజును ఇబ్బంది పెట్టిన జీజీహెచ్‌ మాజీ సూపరింటెండెంట్‌కు సంబంధించిన కంపెనీకి టెక్నికల్‌ బిడ్‌లో అర్హత కల్పించడం చర్చనీయాంశమైంది. సదరు కంపెనీపై విచారణ చేయాలని డీఎంఈకి ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రత్యేకంగా ఫిర్యాదు చేశారు. సాధారణంగా టెండర్లలో పాల్గొనే కంపెనీపై ఫిర్యాదులు వచ్చినా, అనుమానాలున్నా వెంటనే సదరు కంపెనీల నుంచి సమాధానం కోరాలి. ఏపీఎంఎ్‌సఐడీసీ అధికారులు అలాంటి నిబంధనలు ఏమీ పాటించ లేదు. ఫైనాన్షియల్‌ బిడ్‌ తెరవడానికి ఒక్కరోజు ముందు.. అభ్యంతరాలపై కేవలం వివరణ ఇచ్చి వెళ్లిపోండి అంటూ బుధవారం కంపెనీలకు లేఖలు పంపించారు. ఏపీఎంఎస్ఐడీసీ అడ్డగోలు నిర్ణయంపై కంపెనీలు కోర్టులను ఆశ్రయించేందుకు సిద్ధం అవుతున్నాయి.


జగన్‌ కోటరీదే హవా..

ప్రభుత్వం మారినా మాజీ సీఎం జగన్‌ కోటరీ కంపెనీల హవా మాత్రం తగ్గడం లేదు. ఆరోగ్యశాఖలో ఏ టెండర్‌ అయినా ఆ కంపెనీలకే దక్కుతున్నాయి. ఇప్పటికే విజయవాడలోని సిటీ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో టెండర్‌ లేకుండానే సీటీ స్కాన్‌ సేవలను జగన్‌ ఆప్తుడి కంపెనీకి అప్పగించేశారు. సెక్యూరిటీ టెండర్లు అలాగే కట్టబెట్టారు. ఇప్పుడు శానిటేషన్‌ టెండర్లు ఆ కోటరీ కంపెనీలకే కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం సెక్యూరిటీ టెండర్లలో అర్హత లేకపోయినా సజ్జల రామకృష్ణారెడ్డికి అనుంగుడైన వ్యక్తికి జోన్‌-1 టెండర్‌ కట్టబెట్టారు. ఇప్పుడు శానిటేషన్‌ టెండర్లలో కూడా ఏదొక జోన్‌ ఇవ్వాలనే ప్లాన్‌లో భాగంగా ఓ కంపెనీకి అర్హత కల్పించారు. కానీ సదరు కంపెనీ చాలా డాక్యుమెంట్లు టెండర్‌ బిడ్‌లో దాఖలు చేయకపోయినా అధికారులు కళ్లు మూసుకుని ఆ కంపెనీకి అర్హత కల్పించారు. దీనిపై వచ్చిన ఫిర్యాదులను బుట్టదాఖలు చేశారు.

Updated Date - Jul 31 , 2025 | 06:00 AM