Share News

చెరువులు కబ్జా!

ABN , Publish Date - Jun 16 , 2025 | 12:59 AM

పర్యావరణం, భూగర్భజలాల పరిరక్షణతో పాటు ప్రజల దాహార్తిని తీర్చేందుకు దూరదృష్టితో నాడు ఏర్పాటు చేసిన ఊరు చెరువులు ఆక్రమణలతో కుచించుకుపోతున్నాయి. ప్రజాప్రతినిధుల స్వార్థం, అధికారుల ఉదాసీన వైఖరితో రూ.కోట్లు విలువ చేసే పురపాలక సంఘం చెరువులను కొందరు అక్రమార్కులు చెర పట్టారు. గుడివాడలోని బేతవోలు, పెద్దవీధి కుమ్మరి, నాగన్న మంచినీటి చెరువులు ప్రధానంగా కబ్జాకు గురయ్యాయి.

చెరువులు కబ్జా!

-గుడివాడ పట్టణంలో 3 చెరువుల్లో యథేచ్ఛగా ఆక్రమణలు

- నేటికీ కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు

- రూ.కోట్లు విలువైన భూములు అన్యాక్రాంతం

- చూసీచూడనట్టు వదిలేస్తున్న స్థానిక ప్రజాప్రతినిధులు

- నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు

పర్యావరణం, భూగర్భజలాల పరిరక్షణతో పాటు ప్రజల దాహార్తిని తీర్చేందుకు దూరదృష్టితో నాడు ఏర్పాటు చేసిన ఊరు చెరువులు ఆక్రమణలతో కుచించుకుపోతున్నాయి. ప్రజాప్రతినిధుల స్వార్థం, అధికారుల ఉదాసీన వైఖరితో రూ.కోట్లు విలువ చేసే పురపాలక సంఘం చెరువులను కొందరు అక్రమార్కులు చెర పట్టారు. గుడివాడలోని బేతవోలు, పెద్దవీధి కుమ్మరి, నాగన్న మంచినీటి చెరువులు ప్రధానంగా కబ్జాకు గురయ్యాయి.

ఆంధ్రజ్యోతి-గుడివాడ :

గుడివాడ పట్టణంలోని బేతవోలు ఊర చెరువు 14 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. 1970-80 కాలంలో ప్రజలు పూర్తిగా తాగునీటికి ఈ చెరువుపైనే ఆధారపడేవారు. పట్టణంలో సమ్మర్‌ స్టోరేజ్‌ చెరువులు వచ్చాక చెరువు వాడకం బాగా తగ్గింది. స్వల్ప వ్యవధిలోనే చెరువు గట్టు ఆక్రమణకు గురైంది. ప్రస్తుతం చెరువు ఎనిమిది ఎకరాల మాత్రమే ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో ఎకరం రూ.2కోట్లు పలుకుతోంది. మున్సిపల్‌ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఇక్కడ కొత్త కొత్త నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఆక్రమణలు తొలగించి, చెరువును అభివృద్ధి పరచాలని గతంలో బేతవోలు అభివృద్ధి కమిటీ పేరుతో అనేక సందర్భాల్లో పోరాటాలు చేసి, అధికారులకు వినతిపత్రాలను సమర్పించిన వారు స్పందించిన దాఖలాలు లేవు.

కొనసాగుతున్న నిర్మాణాలు

పట్టణ నడిబొడ్డులోని పెద్దవీధి కుమ్మరి చెరువు కూడా ఆక్రమణలకు గురైంది. ఆర్‌.ఎస్‌. నెం.45లో 4.53 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు చుట్టూ ఖాళీ లేకుండా ఇళ్లు నిర్మించుకున్నారు. ఇప్పటికీ మరికొంత మంది నిర్మించుకుంటూనే ఉన్నారు. ఇళ్లలోని సెప్టిక్‌ ట్యాంకు పైపులైన్లు నేరుగా చెరువులోని వదిలేయడంతో నీరు కలుషితమవుతోంది. మున్సిపల్‌ అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు.

వ్యాపార స్థలాలు మార్చేస్తూ..

స్థానిక బంటుమిల్లి రోడ్డులో ఆర్‌.ఎస్‌.నెం.245/1లో దొండపాడు కాల్వవకు దగ్గరగా 3.5 ఎకరాల విస్తీర్ణంలో నాగన్న చెరువు ఉంది. ఇది కూడా మూడు వైపులా ఆక్రమణకు గురైంది. వేసవిలో కొంతమంది దీన్ని పూడ్చివేసి వ్యాపారానికి అనుకూలంగా మార్చేస్తున్నారు. మరో వైపు జాతీయ రహదారి ఉండటంతో ఆక్రమణలు తక్కువగా ఉన్నాయి. ఇళ్లలోని సెప్టిక్‌ ట్యాంకు పైపులైన్లు నేరుగా చెరువులోకి వదిలేయడంతో నీరు కలుషితమవుతోంది.

ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా..

ఆక్రమణలు అడ్డుకుంటే ఓట్లు పోతాయనే భయంతో స్థానిక ప్రజాప్రతినిధులు కొందరు పట్టించుకోకుండా వదిలేశారని విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో తామేమి తక్కువ కాదన్నట్టు వీరు పలు చోట్ల కబ్జా చేసిన స్థలాలను అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

పూర్తి స్థాయి సర్వే చేస్తేనే..

ముఖ్యంగా బేతవోలు, నాగన్న చెరువు గట్లపై ఆక్రమించుకుని నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న వారికి గతంలో ప్రభుత్వం ఇళ్ల స్థలాలను ఇచ్చిందో లేదో పూర్తిస్థాయి సర్వే నిర్వహిస్తే అసలు విషయం బయటపడుతుంది. మున్సిపల్‌, రెవెన్యూ అధికారుల సమాచారం మేరకు దాదాపుగా 99శాతం మందికి ఇళ్లు లేదా టిడ్కో గృహాలను కేటాయించారు. కానీ అక్కడికి వెళ్లిన దాఖలాలు లేవు.

ఆక్రమణల తొలగింపు సాధ్యమేనా!

ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన వారిని తొలగించాలంటే పెద్ద సాహసమే చేయాలి. ఇప్పటికే మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు ఆయా చెరువుల గట్ల ఆక్రమణదారుల వివరాలను సేకరించారు. ఇక్కడి స్థలం వదులుకోకూడదనే ఉద్దేశ్యంతో తమ స్థానంలో కొడుకునో, కుమార్తెనో, దూరపు బంధువులనో తీసుకువచ్చి ఎప్పటి నుండో ఇక్కడే నివాసముంటున్నట్లు చిత్రీకరిస్తూ ప్రభుత్వాన్ని, అధికారులను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా రెండు చెరువు గట్లపై దేవాలయాలు, కర్మల భవనం వెలిశాయి. వాటిని తొలగిస్తారా లేదా మినహాయిస్తారా అనే మీమాంస నెలకొంది.

చెరువుల అభివృద్ధికి రూ.4.24 కోట్లు మంజూరు

బేతవోలు, నాగన్న ఊరచెరువుల అభివృద్ధికి అమృత 2.0 స్కీం నుంచి రూ.4.24 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఆయా చెరువులపై ఉన్న ఆక్రమణలను తొలగించి, కట్టలను పటిష్ట పరచి, నడక దారి, మొక్కల పెంపకం, చుట్టూ రెయిలింగ్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఏపీ గ్రీనరీ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌, పబ్లిక్‌ హెల్త్‌ డిపార్టుమెంట్‌ ఆధ్వర్యంలో డీపీఆర్‌ను సిద్ధం చేశారు.

క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ గుడివాడ లక్ష్యం

ఎన్నికలకు ముందు, తర్వాత గుడివాడ పట్టణాన్ని క్లీన్‌ అండ్‌ గ్రీన్‌గా మార్చాలని పదే పదే అనేక సందర్భాల్లో, బహిరంగ సభల్లో చెప్పా. చెరువులను అభివృద్ధి పరచి వినియోగంలోకి తీసుకురావాలని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. ఆయా చెరువుల గట్లపై నడక దారి ఏర్పాటు, కట్టలు పటిష్టం చేసేందుకు ప్రాధాన్యం ఇస్తాం.

- వెనిగండ్ల రాము, ఎమ్మెల్యే

Updated Date - Jun 16 , 2025 | 12:59 AM