OBC Reservation: చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి
ABN , Publish Date - Dec 16 , 2025 | 02:59 AM
చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది...
ఏపీ స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి
అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం డిమాండ్
న్యూఢిల్లీ, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, స్థానిక సంస్థల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ వరప్రసాద్ యాదవ్ అధ్యక్షతన సోమవారం ఏపీ భవన్‌లో జాతీయ ఓబీసీ సెమినార్‌ను నిర్వహించారు. ఎంపీ ఆర్.కృష్ణయ్య, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ.. దేశంలో మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో చట్టసభల్లో కూడా ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ఓబీసీ వర్గాల నుంచి దేశవ్యాప్తంగా ఒత్తిడి పెరుగుతుందని, ప్రధాని మోదీ సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీలో స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు సీఎం చంద్రబాబు కేంద్రం మీద ఒత్తిడి తీసుకుని రావాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరిలో ఏపీ, తెలంగాణలో 50 వేల మందితో వేర్వేరుగా బహిరంగ సభలు నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు.