Share News

అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం.?

ABN , Publish Date - Mar 16 , 2025 | 12:46 AM

నూజివీడు పురపాలక రాజకీయం రసకందాయంలో పడింది. వైసీపీ చేతిలో ఉన్న ఈ పురపాలకం గతనెల పదిమంది వైసీపీ కౌన్సిలర్లు ఆ పార్టీని వీడి టీడీపీలోకి రావడంతో పురపాలక రాజకీయం గరంగరంగా ఉంది.

అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం.?

రసకందాయంలో నూజివీడు పురపాలక రాజకీయం

(నూజివీడు–ఆంధ్రజ్యోతి)

నూజివీడు పురపాలక రాజకీయం రసకందాయంలో పడింది. వైసీపీ చేతిలో ఉన్న ఈ పురపాలకం గతనెల పదిమంది వైసీపీ కౌన్సిలర్లు ఆ పార్టీని వీడి టీడీపీలోకి రావడంతో పురపాలక రాజకీయం గరంగరంగా ఉంది. ఈనెల 18వ తేదీకి నూజివీడు పురపాలక ప్రస్తుత కౌన్సిల్‌ కొలువుదీరి నాలుగేళ్లు పూర్తవుతుంది. నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలంటే నాలుగేళ్లు పూర్తయి ఉండాలి. దీంతో టీడీపీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులపై దృష్టి పెట్టింది. నూజివీడు పురపాలకంలో మొత్తం వార్డులు 32. నాలుగేళ్ల క్రితం జరిగిన పురపాలక ఎన్నికల్లో వైసీపీ 25 వార్డులు గెలువగా, టీడీపీ 7 వార్డులను దక్కించుకుంది. రాష్ట్రంలో అధికారం మారడం, ఆపై జరిగిన పరిణామాలతో వైసీపీ కాన్సిలర్లు పదిమంది టీడీపీలోకి రావడంతో, టీడీపీ బలం 17కు చేరగా వైసీపీ బలం 15 మంది సభ్యులకు పడిపోయింది. ఈ నేపథ్యంలో టీడీపీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల పదవులను వైసీపీ నుంచి తమ గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే కనీసం 22 మంది సభ్యులు చేతులు ఎత్తి మద్దతు తెలపాలి. దీంతో టీడీపికి మరో ఐదుగురు సభ్యుల మద్దతు అవసరం. టీడీపీ నియోజక వర్గ అధిష్ఠానం వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారిలో ఒకరికి, అలాగే టీడీపీలోని మరో కౌన్సిలర్‌కు వైసీపీ నుంచి మరో ఐదుగురు సభ్యుల మద్దతు కూడగడితే మీకు చైర్మన్‌ పదవి ఇస్తామని స్పష్టం చేయడంతో, వారిద్దరూ వైసీపీ సభ్యులపై గాలం వేస్తున్నారు. ఇదంతా గమనించిన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు మిగిలిన తమ కౌన్సిలర్లను తీసుకుని ఇటీవల ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. అయితే 15 మందిలో ఇద్దరు గైర్హాజరు కావడం గమనార్హం. దీంతో టీడీపీవర్గం ఈ ఇద్దరితో పాటు మరో ముగ్గురు కోసం వేట ప్రారంభించారు. అవిశ్వాస తీర్మానం గెలవడానికి అవసరం అయితే స్థానిక ఎమ్మెల్యే ఓటును సైతం ఉపయోగించుకుని, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను టీడీపీ కైవసం చేసుకోవచ్చనే వ్యుహంలో టీడీపీ ఉంది.

ప్రస్తుత చైర్మన్‌ రాజీనామా చేస్తే..

అవిశ్వాస తీర్మానంలో తాము నెగ్గలేమని ప్రస్తుత వైసీపీ చైర్‌పర్సన్‌ భావించి రాజీనామా చేస్తే చైర్మన్‌ ఎన్నిక జరగాలంటే కనీసం మూడు నెలలు సమయం పడుతుందని తెలుస్తోంది. మరోవైపు అవిశ్వాసం తెలుపుతూ ఆ తీర్మానం నోటీసును పురపాలక కమిషనర్‌కు ఇచ్చిన తర్వాత, దానిని కమిషనర్‌ జిల్లా కలెక్టర్‌కు పంపుతారు. కలెక్టర్‌ నుంచి నెలరోజుల లోపు ఎన్నిక నిర్వహించ మని సబ్‌ కలెక్టర్‌కు పంపుతారు. కలెక్టర్‌ ఆదేశాలు వచ్చిన తర్వాత 15 రోజులలోపు సబ్‌ కలెక్టర్‌ కౌన్సిల్‌ను సమావేశపరిచి, అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహిస్తారు.

Updated Date - Mar 16 , 2025 | 12:46 AM