Rayapati Shailaja: మహిళా ఖైదీలకు పౌష్టికాహారం
ABN , Publish Date - Sep 25 , 2025 | 05:14 AM
రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమశాఖ అమలు చేస్తున్న పోషమ్మ పథకాన్ని మహిళా ఖైదీలు, రిమాండ్ మహిళా ఖైదీలకు కూడా వర్తింపజేయాలని యోచిస్తున్నట్టు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్...
మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ వెల్లడి
విశాఖ సెంట్రల్ జైలు సందర్శన
విశాఖపట్నం, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళా, శిశు సంక్షేమశాఖ అమలు చేస్తున్న ‘పోషమ్మ’ పథకాన్ని మహిళా ఖైదీలు, రిమాండ్ మహిళా ఖైదీలకు కూడా వర్తింపజేయాలని యోచిస్తున్నట్టు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ వెల్లడించారు. బుధవారం విశాఖ సెంట్రల్ జైలును ఆమె సందర్శించారు. మహిళా ఖైదీల బ్యారక్‌లకు వెళ్లి సౌకర్యాలపై ఆరా తీశారు. మహిళా ఖైదీలకు పెడుతున్న ఆహారాన్ని రుచిచూసి సంతృప్తి వ్యక్తంచేశారు. మహిళా ఖైదీలకు కల్పిస్తున్న ఇతర సౌకర్యాలు, ఆస్పత్రి, బేకరీ యూనిట్, ఇతర వస్తు ఉత్పత్తి తయారీ యూనిట్లను పరిశీలించారు. ఇటీవల మహిళా ఖైదీ ప్రసవించిన చిన్నారిని ఆమె చేతుల్లోకి తీసుకున్నారు. అనంతరం జైలు బయట ఆమె మీడియాతో మాట్లాడుతూ జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు నవరాత్రుల సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషనర్ తరఫున పలు ప్రత్యేక కార్యక్రమాలు అమలుచేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మహిళలు, శిశువుల ఆరోగ్యం కోసం ‘పోషమ్మ’ పథకం కింద ప్రత్యేక ఆహారం సరఫరా చేస్తున్నామని, మహిళా ఖైదీలకు కూడా వర్తింపజేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. జైల్లో 80 మంది మహిళా ఖైదీలు ఉన్నారని, వారిలో 50 మందికి గంజాయి కేసుల్లో ప్రమేయం ఉందని చెప్పారు. ఆమె వెంట ఐసీడీఎస్ జాయింట్ డైరెక్టర్ చిన్మయిదేవి, పీడీ రామలక్ష్మి ఉన్నారు.