NTR Vaidya Seva: బకాయిలు గట్టెక్కేదెలా
ABN , Publish Date - Dec 15 , 2025 | 04:10 AM
ఒకవైపు గతానికి మించి సంక్షేమ పథకాల అమలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు.. రెండింటికీ భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి.
‘ఎన్టీఆర్ వైద్య సేవ’ను వెంటాడుతున్న కష్టాలు
ట్రస్టుకు రుణాలు ఇవ్వలేమన్న బ్యాంకులు
నెట్‌వర్క్ ఆస్పత్రుల బకాయిల చెల్లింపునకు రూ.3 వేల కోట్ల రుణం కోరిన అధికారులు
రెండు సార్లు బ్యాంకర్లతో భేటీ
ష్యూరిటీ లేకపోవడంతో బ్యాంకర్ల నిరాకరణ
ఆస్తి, ఆదాయం, హామీ, తనఖాపై ప్రశ్నలు
వాస్తవానికి ఆస్పత్రుల బకాయిలు 2,400 కోట్లే
జగన్ ప్రభుత్వంలో 600 కోట్లు ‘బదలాయింపు’
రుణం భారమంటున్న నిపుణులు
ఆస్పత్రులతో మాట్లాడుకుని వాయిదాల్లో చెల్లించాలని సూచన
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఒకవైపు గతానికి మించి సంక్షేమ పథకాల అమలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు.. రెండింటికీ భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దీనికితోడు గత జగన్ ప్రభుత్వంలో అడ్డగోలుగా చేసిన అప్పులు, వాటి వడ్డీల భారం. వెరసి.. కూటమి ప్రభుత్వానికి ‘ఆర్థిక’ సమన్వయంలో కష్టాలు ఎదురవుతున్నాయి. కొన్ని పథకాలకు ఒక్కోసారి నిధులు కేటాయించలేని దుస్థితి. దీంతో పథకాలు నడవాలంటే కొత్త రుణాలు తీసుకోకతప్పని పరిస్థితి. నెట్‌వర్క్ ఆస్పత్రుల బకాయిల చెల్లింపు కోసం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు అధికారులు రూ.3 వేల కోట్లు అప్పు తేవాలనుకున్నారు. బ్యాంకర్లతో రెండుసార్లు సమావేశమయ్యారు. తొలి భేటీలో రెండు బ్యాంకులు సానుకూలంగా స్పందించాయి. కానీ రెండో సమావేశంలో రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు ససేమిరా అన్నారు. ‘ట్రస్టుకు రుణాలు ఇవ్వడం సాధ్యం కాదు. పైగా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టుకు ఆస్తులు లేవు. వచ్చే ఆదాయమూ లేదు. ఒక వేళ రుణాలు ఇచ్చినా తిరిగి ఎలా చెల్లిస్తారు? ప్రభుత్వం కూడా ష్యూరిటీ ఇవ్వడం లేదు. ఒకవేళ అది హామీ ఇవ్వాలన్నా సాధ్యంకాదు. ఇప్పటికే ప్రభుత్వం ద్రవ్య జవాబుదారీ-ఆర్థిక నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితికి చేరువైంది. పోనీ నెట్‌వర్క్ ఆస్పత్రుల ఆస్తులు తాకట్టు పెడతారా..? అందుకు అవి అంగీకరిస్తాయా’ అని ప్రశ్నించారు. వీటికి అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. నెట్‌వర్క్ ఆస్పత్రుల బకాయిలు చెల్లించడం ప్రశ్నార్థకంగా మారింది.
అవగాహన లేకుండా హామీ..
సాధారణంగా ప్రభుత్వంలో పనిచేసే అధికారులు.. ఏదైనా హామీ ఇచ్చే సమయంలో సాధాసాధ్యాలను పరిశీలించిన తర్వాత ముందుకెళ్తారు. కానీ ట్రస్టులకు బ్యాంకులు రుణాలు ఇస్తాయా ఇవ్వవా అన్న విషయంలో కనీస అవగాహన లేకుండా.. అప్పు తెచ్చి రెండు నెలల్లో బకాయిలు చెల్లిస్తామని ఆరోగ్య శాఖ, వైద్య సేవ ట్రస్టు అధికారులు నెట్‌వర్క్ ఆస్పత్రులకు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (ఆషా) సమ్మె విరమణకు అప్పట్లో అంగీకరించింది. ఇప్పుడు బ్యాంకర్ల తీరుతో పరిస్థితి తలకిందులు కావడంతో ట్రస్టు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అప్పుల కోసం బ్యాంకర్లతో మాట్లాడుకోవాలని ట్రస్టుకు సూచించిన ఆర్థిక శాఖ.. తిరిగి చెల్లించే విషయంలో హామీ ఇవ్వకపోవడంతో బ్యాంకర్లు.. రుణమివ్వడానికి నిరాకరించాయి.
ట్రస్టు సొమ్ము ఏపీ మెర్క్‌కు..
వాస్తవానికి నెట్‌వర్క్ ఆస్పత్రుల బకాయిలు రూ.2,400 కోట్లే. కానీ ట్రస్టు అధికారులు ఏపీ మెర్క్(ఆంధ్రప్రదేశ్ వైద్య విద్య-పరిశోధన కార్పొరేషన్)కు చెల్లించాల్సిన రూ.600 కోట్లను కూడా కలిపి మొత్తం 3వేల కోట్లు రుణంగా తీసుకోవాలని భావించారు. గత జగన్ ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీల కోసం ఏపీ మెర్క్‌ను ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు (అప్పటి ఆరోగ్యశ్రీ ట్రస్టు)లో రోగుల కోసం కేటాయించిన నిధుల్లో 15 శాతాన్ని.. అంటే రూ.600 కోట్లకుపైగా ఈ కార్పొరేషన్‌కు బదలాయించింది. ఫలితంగా ప్రభుత్వాస్పత్రుల్లో పేద రోగులకు అందించే వైద్యం నాణ్యత తగ్గిపోయింది. కొత్త మెడికల్ కాలేజీల కోసం రోగులను నిర్లక్ష్యం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ట్రస్టు నుంచి ఏపీ మెర్క్‌కు ఒక్క రూపాయి కూడా బదలాయించలేదు. అయితే అప్పట్లో ఇచ్చిన 600 కోట్లను కూడా కలిపి ట్రస్టు అధికారులు రూ.3 వేల కోట్ల బకాయిలు చూపిస్తున్నారు. ఆస్పత్రులకు ఇవ్వాల్సిన 2,400 కోట్లలోనూ అధిక మొత్తం బకాయిలు (రూ.1,500 కోట్లు) టాప్-50 ఆస్పత్రులకే చెల్లించాల్సి ఉంది. వీటికోసం రుణం తీసుకోవడం కంటే.. వాటితో చర్చించి.. నిర్దిష్ట సమయంలోగా సర్దుబాటు చేస్తామని ఒప్పందానికి రావాలని నిపుణులు సూచిస్తున్నారు.
రోగులకు తొలి ప్రాధాన్యం..
మరోవైపు.. ఆర్థిక ఇబ్బందులున్నప్పటికి రోగులకు సేవల విషయంలో మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం లేదు. రోగులకు ఇబ్బందులు ఎదురుకాకూడదనే.. ప్రతి నెలా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టుకు దాదాపు రూ.300 కోట్ల వరకూ విడుదల చేస్తోంది. నెట్‌వర్క్ ఆస్పత్రులు సమ్మె విరమించిన తర్వాత క్రమం తప్పకుండా వాటి ఖాతాల్లో నిధులు జమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బకాయిల విషయంలోనూ తొలుత చిన్న ఆస్పత్రులకు చెల్లింపులు జరిపి.. పెద్ద ఆస్పత్రులకు వాయిదాల రూపంలో చెల్లించడం ద్వారా ఆర్థిక భారం తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.