Medical Education: వైద్యవిద్యకు ఎన్టీఆర్ విశ్వవిద్యాలయమే నాంది
ABN , Publish Date - Nov 02 , 2025 | 05:26 AM
వైద్యవిద్య కోసం దేశంలోనే మొదటిసారిగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం.. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి తెలిపారు.
దేశంలో ఆ ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుంది
ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తి
ఘనంగా 39వ వ్యవస్థాపక దినోత్సవం
విజయవాడ, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): వైద్యవిద్య కోసం దేశంలోనే మొదటిసారిగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం.. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి తెలిపారు. ఈ ఘనత దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు దక్కుతుందన్నారు. విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 39వ వార్షికోత్సవాన్ని శనివారం వర్సిటీలో ఘనంగా నిర్వహించారు. మధుమూర్తి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ అందరికీ అందుబాటులో నాణ్యమైన విద్యను అందించాలని నాడు ఈ విశ్వవిద్యాలయాన్నిఏర్పాటు చేశారన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వల్ల నేడు మారుమూల పల్లెలకు కూడా వైద్యం అందుబాటులోకి రావడం మంచి పరిణామమని చెప్పారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ జి.రఘునందన్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్యవిద్యలో యూజీ, పీజీ సీట్లు పెరగడం సంతోషకరమన్నారు. వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ పరిధిలో 554 కాలేజీలు పనిచేస్తున్నాయని, వర్సిటీలో రిసెర్చ్ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. యూనివర్సిటీకి అమరావతిలో ప్రభుత్వ భూములను కేటాయించడంలో గవర్నర్ నజీర్ పాత్ర కీలకమని ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు వర్సిటీ ప్రాంగణంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి ఉద్యోగులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రిజిస్ర్టార్ వి.రాధికారెడ్డి, సైకియాట్రిస్ట్ ఇండ్ల రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.