Share News

Satya Kumar Minister: ఎన్టీఆర్‌ వైద్య సేవల పునరుద్ధరణ

ABN , Publish Date - Nov 01 , 2025 | 03:28 AM

ఎన్టీఆర్‌ వైద్య సేవ కింద ఆరోగ్య సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రైవేటు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ప్రకటించాయి. వాటికి ఎన్టీఆర్‌ వైద్య సేవా ట్రస్టు చెల్లించాల్సిన...

Satya Kumar Minister: ఎన్టీఆర్‌ వైద్య సేవల పునరుద్ధరణ

  • మంత్రి హామీతో ‘ఆషా’ నిర్ణయం

  • రూ.2,700 కోట్ల బకాయిలకు‘వన్‌ టైం సెటిల్‌మెంట్‌’

  • నెలాఖరులోగా చెల్లిస్తాం: మంత్రి

అమరావతి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): ‘ఎన్టీఆర్‌ వైద్య సేవ’ కింద ఆరోగ్య సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రైవేటు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ప్రకటించాయి. వాటికి ఎన్టీఆర్‌ వైద్య సేవా ట్రస్టు చెల్లించాల్సిన రూ.2,700 కోట్ల బకాయిలను వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ వెల్లడించడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. శుక్రవారం ఉదయం సచివాలయంలోని తన చాంబర్లో ఆంధ్రప్రదేశ్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్‌ (ఆషా) ప్రతినిధులతో మంత్రి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సమస్యల పరిష్కారం కోసం సీఎం చంద్రబాబుతో చర్చించామని, వన్‌ టైం సెటిల్‌మెంట్‌ విధానంతో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని సత్యకుమార్‌ తెలిపారు. వన్‌ టైం చెల్లింపులు చేసేలోపే మరో రూ.250 కోట్లు ఆస్పత్రులకు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘యూనివర్సల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ’ కింద తీసుకునే నిర్ణయాల్లో ఆషా ప్రతినిధులను భాగస్వాములను చేస్తామని చెప్పారు. ట్రస్ట్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుల పరిశీలనకు యుద్ధ ప్రాతిపదికన సుమారు 50 మంది వైద్యులను నియమిస్తున్నామన్నారు. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున రోగుల ఆరోగ్య సంరక్షణను దృష్టిలో ఉంచుకుని వెంటనే వైద్య సేవలు కొనసాగించాలని కోరారు. ‘ఆస్పత్రులు సమ్మె చేపట్టిన నాటి నుంచి రూ.488 కోట్లు విడుదల చేశాం. మరో విడత రూ.250 కోట్లు విడుదల చేస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ట్రస్టు నుంచి వాటికి రూ.4,143 కోట్లు చెల్లించాం. ఇందులో జగన్‌ ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలే రూ.2,403 కోట్ల వరకు ఉన్నాయి. మా హయాంలో ఇప్పటివరకు ట్రస్టు ద్వారా జరిగిన వైద్య సేవలకు మొత్తం రూ.1,739 కోట్లు చెల్లించాం. ఆస్పత్రులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం కాబట్టే బిల్లులు చెల్లిస్తున్నాం’ అని మంత్రి వివరించారు. ఆషా ప్రతినిధులు మాట్లాడుతూ.. బకాయిలు పెరిగిపోయి.. ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా మారడంతోనే తాము ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందన్నారు. వన్‌ టైం సెటిల్‌మెంట్‌ను స్వాగతిస్తున్నామని, కానీ వెంటనే మరో రూ.250 కోట్లు విడుదల చేస్తే ఆస్పత్రులకు ఉపశమనం లభిస్తుందని చెప్పారు. దీనికి మంత్రి అంగీకరించారు. 10వ తేదీకల్లా రూ.250 కోట్లు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ప్రధాన డిమాండ్ల పరిష్కారానికి ఆయన చొరవ చూపడంతో గత 20 రోజులుగా నిలిపివేసిన వైద్య సేవలను తక్షణమే కొనసాగిస్తామని ప్రతినిధులు హామీఇచ్చారు.


వైద్య సేవలు పునరుద్ధరణ..: ఆషా

స్పెషాలిటీ ఆస్పత్రులు చేపట్టిన వైద్యం బంద్‌ను నిలిపివేస్తున్నామని ఆషా అధ్యక్షుడు విజయకుమార్‌ తెలిపారు. మంత్రితో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం నుంచే ఆస్పత్రుల్లో వైద్య సేవలు పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం వన్‌ టైం సెటిల్‌మెంట్‌ ద్వారా తమ బకాయిలు మొత్తం చెల్లించడానికి అంగీకరించిందని, నవంబరు నెలాఖరు నాటికి రూ.2,700 కోట్ల బకాయిలూ విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని.. నవంబరు 10నాటికి మరో రూ.250 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించారని వెల్లడించారు. యూనివర్సల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలో తమ ప్రతినిధులకూ భాగస్వామ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారన్నా రు. శస్త్రచికిత్సల ప్యాకేజీల పెంపునకూ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. బీమా విధానంపై భేటీల్లో ప్యాకేజీల పెంపుపై చర్చిస్తామని చెప్పారు.

Updated Date - Nov 01 , 2025 | 03:31 AM