Minister Dola Veeranjaneyulu: త్వరలో ఎన్టీఆర్ విదేశీ విద్య
ABN , Publish Date - Jul 11 , 2025 | 03:48 AM
గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని తిరిగి అమల్లోకి తెచ్చేందుకు కూటమి సర్కార్ కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల హామీ ప్రకారం దీనికి సంబంధించి త్వరలో విధివిధానాల రూపకల్పన చేయాలని యోచిస్తోంది.
హామీ అమలుకు ప్రభుత్వం కసరత్తు
అమరావతి, జూలై 10(ఆంధ్రజ్యోతి): గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ‘ఎన్టీఆర్ విదేశీ విద్య’ పథకాన్ని తిరిగి అమల్లోకి తెచ్చేందుకు కూటమి సర్కార్ కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల హామీ ప్రకారం దీనికి సంబంధించి త్వరలో విధివిధానాల రూపకల్పన చేయాలని యోచిస్తోంది. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ఇప్పటికే విదేశీ విద్యకు సంబంధించి సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గత టీడీపీ ప్రభుత్వం 2016 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించి 4,923 మంది విద్యార్థులకు రూ.364 కోట్లు ఖర్చు చేసింది. విదేశాల్లో ఏ యూనివర్సిటీలో సీట్లు తెచ్చుకున్నా ఈ పథకాన్ని అమలు చేశారు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. జగన్ తెచ్చిన కొత్త మార్గదర్శకాల ప్రకారం 200 క్యూఎస్ ర్యాంకింగ్స్ యూనివర్సిటీల్లో సీట్లు పొందిన వారికే ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పించిన పర్యావసానంగా.. 10 శాతం మందికే లబ్ధి కలిగింది. చంద్రబాబు హయాంలో 4,923 మందికి విదేశీ విద్య అందిస్తే, జగన్ మూడేళ్ల పాటు ఈ పథకాన్ని నిలిపేసి ఆతర్వాత తాపీగా 213 మందికి మాత్రమే మంజూరు చేశారు.
ఏడాదిలో రెండుసార్లు దరఖాస్తుల ఆహ్వానం!
విదేశీ విద్య పథకాన్ని అమలు చేస్తామని కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. దీంతో దీని అమలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో అమలు చేసిన రీతిన ఎక్కువ దేశాల్లో చదువుకునేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించాలని, వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన కఠిన నిబంధనలు కాకుండా ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అర్హత దక్కేలా విధివిధానాలను రూపొందించనున్నారు. ప్రతి ఏటా రెండుసార్లు జూలై, నవంబర్ నెలల్లో దరఖాస్తులు స్వీకరించి.. విదేశాల్లో కొత్త కోర్సులు చదువుకునేందుకు వెళ్లే పేద విద్యార్థులకు ఆర్థిక అండ అందించాలని యోచిస్తున్నారు.